
తిరువనంతపురం కోవలం బీచ్ వద్ద పర్యాటకుల సందడి
అంచనా కంటే మూడు రోజుల ముందే రాక
ప్రస్తుతం చురుకుగా కదులుతున్న రుతుపవనాలు
3 రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశం!
నేడు, రేపు కొన్నిచోట్ల వర్షాలు
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. శనివారం ఉదయం కేరళ భూభాగంలోకి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రుతుపవనాల కదలికలు అత్యంత చురుకుగా ఉన్నాయని, లక్షదీవులతో పాటు కేరళ రాష్ట్రంలోకి పూర్తిగా ప్రవేశించేందుకు అత్యంత తక్కువ సమయం పడుతుందని వివరించింది. మరోవైపు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను కూడా రుతుపవనాలు తాకాయి.
నైరుతి రుతుపవనాలు ముందుగా కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత దేశమంతటా విస్తరిస్తాయి. ఈ సీజన్‌లో రుతుపవనాలు వాతావరణ శాఖ అంచనాల కంటే మూడురోజులు ముందుగానే భారత ప్రధాన భూభాగాన్ని తాకటం విశేషం. గతేడాది నైరుతి రుతుపవనాలు మే 30న కేరళను తాకగా... ఈసారి ఆరు రోజుల ముందే ప్రవేశించాయి.
రానున్న రెండురోజుల్లో రుతుపవనాలు మధ్య అరేబియన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, గోవాలో పూర్తి భూభాగం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలతోపాటు సబ్ హిమాలయన్ పశ్చిమబెంగాల్, సిక్కింలోకి ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. ఈసారి వర్షాకాలంలో రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, సాధారణం కంటే అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
మూడురోజుల్లో రాష్ట్రంలోకి..
రానున్న మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాధారణంగా కేరళను తాకిన తర్వాత సగటున నాలుగు నుంచి ఆరు రోజుల మధ్య తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రుతుపవనాల కదలికలు చురుకుగా ఉండడంతో మూడు రోజులలోపే రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరించేందుకు మరో మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గతేడాది జూన్ 3వ తేదీన రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశించగా... ఈసారి మే నెలలోనే ప్రవేశించడం గమనార్హం.
27న బంగాళాఖాతంలో అల్పపీడనం
నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండడం రైతాంగంలో ఉత్సాహాన్ని నింపుతోంది. సాధారణంగా నైరుతి రుతుపవనాల సీజన్‌లో కురిసే వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం, వాయుగుండం, తుఫానులపైనే ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 27న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆరోజుకల్లా తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో ఈ అల్పపీడనం ప్రభావం రాష్ట్రంపై ఉంటుందని, చాలాచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ అల్పపీడనం రెండ్రోజుల్లో బలపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని ముందస్తు అంచనాలు వెల్లడించాయి.
రెండ్రోజులు తేలికపాటి వర్షాలు
రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. తూర్పు మధ్య అరేబియా సముద్రం, దక్షిణ కొంకణ్ – గోవా తీర ప్రాంతం సమీపంలో కొనసాగిన స్పష్టమైన అల్పపీడన ప్రాంతం శనివారం ఉదయం బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం అదే ప్రాంతంలో రత్నగిరికి ఆగ్నేయంగా 40 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది.
క్రమంగా తూర్పు దిశలో కదిలి శనివారం రాత్రికల్లా దక్షిణ కొంకణ్ తీరంలో రత్నగిరి, దాపోలి మధ్యలో వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో దక్షిణ ప్రాంత జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదు కానున్నాయి.