28న తీవ్ర తుపానుగా బలపడనున్న ‘మోంథా’
కాకినాడ–తుని సమీపంలో తీరం దాటే అవకాశం
మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఆస్కారం
కోస్తా జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/డోన్/తిరుపతి తుడా: ‘మోంథా’ సూపర్ సైక్లోన్ రాష్ట్రం వైపు వస్తోంది. శనివారం రాత్రి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతూ పోర్ట్‌బ్లెయిర్‌కి 510 కి.మీ., విశాఖకు 920, చెన్నైకి 890, కాకినాడకు 920, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కి 1,000 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని.. సోమవారం ఉదయానికి తుపానుగా బలపడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
అనంతరం వాయువ్య దిశగా, ఆ తర్వాత ఉత్తర–వాయువ్య దిశగా ప్రయాణించి 28న ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. తుపానుగా మారిన తర్వాత దీనికి ‘మోంథా’ అని పేరు పెట్టనున్నారు. తీవ్ర తుపానుగా మారాక 28న సాయంత్రం నుంచి రాత్రిలోపు కాకినాడ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఇది తీరం దాటే సమయంలో గంటకు 90–100 కి.మీ., గరిష్టంగా 110 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో సాధారణం కంటే 1–1.5 మీటర్ల ఎత్తుకు అలలు ఎగసిపడతాయని వెల్లడించారు. ఈ నెల 29 వరకు వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను అప్రమత్తం చేశారు. విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం, గంగవరం పోర్టుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
27 నుంచి అతి భారీ వర్షాలు
అల్పపీడనం నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. 27నుంచి 30వ తేదీ వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో 3 రోజులపాటు కోస్తాలోని పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. 27న అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉండడంతో ప్రకాశం, బాపట్ల, వైఎస్సార్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్ ఇచ్చింది.
నంద్యాల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉదంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. 28న వైఎస్సార్, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, ఏలూరు, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలకు రెడ్ అలెర్ట్.. నంద్యాల, శ్రీపొట్టి శ్రీరాములు, తిరుపతి, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చింది.
29న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఏలూరు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలెర్ట్.. పల్నాడు, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
కంభంలో 6.8 సెం.మీ. వర్షం
ప్రకాశం జిల్లా కంభంలో శనివారం 6.8 సెంటీమీటర్ల అత్యధిక వర్షం కురిసింది. చిత్తూరు జిల్లా పలమనేరులో 5.9, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 5.6, అసనపురంలో 5.2, ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం నాగులవరం, నెల్లూరు జిల్లా విడవలూరులో 5.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లా డోన్ మండలంలో 44.2 మి.మీ. వర్షం కురవడంతో వంకలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి.
ఎర్రగుంట్ల వద్ద ఆర్టీసీ బస్సు వంకలో ఆగిపోవడంతో స్థానికులు, ప్రయాణికులు బయటకు నెట్టుకొచ్చారు. ఉమ్మడి తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీగా వర్షం కురిసింది. తిరుపతిలో 2 గంటల పాటు భారీ వర్షం పడటంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.


