
కొనసాగుతున్న రుతుపవనాల ఉపసంహరణ
ఈ నెల 16 వరకు పూర్తి కానున్న ప్రక్రియ
ఈ సీజన్‌లో సాధారణం కంటే 32 శాతం అధికంగా వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 16వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో ఉపసంహరణ ప్రక్రియ పూర్తవు తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో రుతుపవనాల కదలికలు వేగంగా ఉండటంతో వర్షాలకు అనుకూల వాతావరణం ఉంటుందని చెబుతున్నారు.
దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, అంతర్గత తమిళనాడుల మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో రానున్న రెండు రోజులు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుసాయి.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్ (జూన్1 నుంచి)లో రాష్ట్రవ్యాప్తంగా 77.32 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 102.37 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణం కంటే 32 శాతం అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 7 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా.. 16 జిల్లాల్లో అధిక వర్షపాతం, 10 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. గతేడాది సీజన్‌తో పోలిస్తే ఈసారి 4 శాతం అధికవర్షపాతం నమోదైంది.
పిడుగుపాటుకు ఇద్దరు మృతి
యాచారం/మాడ్గుల: వేర్వేరు ఘటనల్లో పిడుగుపాటుకు గురై రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు మృతి చెందారు. వివరాలు.. యాచారం మండలం నల్లవెల్లికి చెందిన జోగు మనీశ్ (12) ఏడో తరగతి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే మాల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
మాడ్గుల మండల పరిధిలోని అప్పారెడ్డిపల్లికి చెందిన బుచ్చయ్య (56) పశువులకు మేత వేయడానికి వెళ్లి పిడుగుపాటుకు గురై మృతిచెందాడు.