రాష్ట్రమంతా నైరుతి! | Monsoons moving actively in Telangana | Sakshi
Sakshi News home page

రాష్ట్రమంతా నైరుతి!

May 29 2025 1:11 AM | Updated on May 29 2025 6:00 AM

Monsoons moving actively in Telangana

తెలంగాణలో చురుకుగా కదులుతున్న రుతుపవనాలు

జూన్‌లో 111 శాతం వర్షపాతం నమోదు కావచ్చన్న వాతావరణ శాఖ

రానున్న మూడు రోజులు పలుచోట్ల మోస్తరు వానలు

ఐదు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు అత్యంత చురుకుగా కదులుతున్నాయి. ఈనెల 26న రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించగా... బుధవారం సాయంత్రానికి తెలంగాణ అంతటా విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన నాలుగు నుంచి ఆరు రోజుల వ్యవధిలో రాష్ట్ర భూభాగం అంతటా విస్తరించేవి. కానీ ఈసారి కేవలం రెండున్నర రోజుల వ్యవధిలోనే విస్తరించడం గమనార్హం.

ప్రస్తుతం రుతుపవనాల కదలికలు చురుకుగా ఉండటంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు... కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ సూచించింది. 

ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించిన వాతావరణ శాఖ... ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. 

జూన్‌ నెలలో విస్తారంగా వర్షాలు... 
కాగా, జూన్‌ నెలలో రుతుపవనాల గమనానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనాలు విడుదల చేసింది. నైరుతి సీజన్‌లో జూన్‌ నెలలో రాష్ట్రంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 12.94 సెంటీమీటర్లు. ఐఎండీ అంచనాల ప్రకారం జూన్‌ నెలలో సాధారణం కంటే అధికంగా వర్షాలు కురుస్తాయని.. సగటున 111 శా­తం వర్షపాతం నమోదు కావొచ్చని వివరించింది.

గతేడాది జూన్‌ నెలలో 15.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణంకంటే 23 శాతం అధికంగా వర్షపాతం నమోదు కాగా... ఈసారి అంతకుమించి వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. 

అత్యధికంగా నారాయణపేట జిల్లా ఉట్కూర్‌లో 4.88 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదేవిధంగా వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌లో 3.0 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 2.75 సెంటీమీటర్లు, నల్లగొండ జిల్లా గుండ్లపల్లెలో 2.28 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 2 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

Advertisement
 
Advertisement
Advertisement