
అల్పపీడనంతో రాష్ట్రాన్ని ముంచెత్తిన వానలు
నైరుతి సీజన్‌లో ఇప్పటివరకు 69.17 సెం.మీ వర్షపాతం
ప్రస్తుతం అత్యంత చురుగ్గా నైరుతి రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు కూడా అత్యంత చురుకుగా కదులుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లో కొనసాగిన తీవ్ర అల్పపీడనం వాయువ్య దిశలో కదిలి గురువారం దక్షిణ ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో తీరాన్ని దాటింది. ప్రస్తుతం మధ్య ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో అల్పపీడనంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
సగటున 5.08 సెంటీమీటర్ల వర్షపాతం...
బుధ, గురువారాల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా సగటున 5.08 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గురువారం రాత్రి వరకు చూస్తే 2.5 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవ నాల సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా 10 జిల్లాల్లో అధికం, 15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
ఈ సీజన్‌లో ఆగస్టు 28 నాటికి రాష్ట్రంలో సగటున 55.19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 69.17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 25 శాతం అధికంగా వర్షాలు కురిసినట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మరో రెండ్రోజుల పాటు కురిసే వర్షాలతో రాష్ట్రంలో సగటు వర్షపాతం ఈ సీజన్ మొత్తంలో కురవాల్సిన సాధారణ వర్షపాతానికి సమానమవుతుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.