
గ్రేటర్ సమీప జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: వాతావరణ శాఖ
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు ఇలాగే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం గ్రేటర్ హైదరాబాద్ సమీప జిల్లాల్లో జోరు వాన నమోదైంది. హైదరాబాద్, జనగామ, మహబూబ్‌నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్లగొండ, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, అదిలాబాద్ జిల్లాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లాల కలెక్టర్లకు సూచించింది. నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు అంతంత మాత్రంగానే కురిశాయి. గత మూడు వారాలుగా వర్షాల జాడలేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 26.23 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 20.43 సెంటీమీటర్లు మాత్రమే కురిసింది.