
కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: అరేబియా సముద్రంలోని దక్షిణ కొంకణ్–గోవా తీర ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ మరింత బలపడి శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత వాయుగుండం మరింత బలపడే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తోంది. దీంతో రానున్న రెండు రోజులు రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొన్నిప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కావొచ్చని, అదేవిధంగా జగిత్యాల, కామారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షా లు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన ప్రాంతా ల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు, రానున్న రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
తగ్గిన ఉష్ణోగ్రతలు
గురువారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో అత్యధికంగా 35.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో అత్యధికంగా 20.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6–10 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. రానున్న రెండు రోజులు కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ వివరించింది.