
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇవాళ కూడా పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఉప్పల్, తార్నాక, సీతాఫల్‌మండి, చిలకలగూడ, సికింద్రాబాద్, మారేడుపల్లి, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్, ఎల్‌బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్,జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. తెలంగాణలో 9 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. రాబోయే రెండు గంటల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.
ఆదిలాబాద్, హైదరాబాద్, జనగాం, మహబూబ్‌నగర్, మెదక్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, నల్లొండ, రంగారెడ్డి, యాద్రాది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలకు మినహా అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ అయ్యింది. కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనీ బీరంగూడ, ఆర్‌సీ పురం, మియాపూర్, సెరిలింగంపల్లి, చంద్రాయణగుట్ట, హయత్‌నగర్, బాలాపూర్, శంషాబాద్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
కాగా, శుక్రవారం ఏకధాటిగా నాలుగు గంటల పాటు కురిసిన వానతో నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే జలదిగ్బంధంలో ఉన్న ప్యాట్నీ సింధీ కాలనీలో బోట్ల సాయంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కంటోన్మెంట్ సిబ్బంది మోటార్ల సహాయంతో నీళ్లను తొలగిస్తున్నారు. నాలా రిటైనింగ్ వాల్ కట్టకపోవడంతోనే ఇళ్లలోకి వర్షపు నీరు చేరినట్లు స్థానికులు చెబుతున్నారు.