
సాక్షి, విశాఖపట్నం: రాగల 24 గంటల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. అల్లూరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల పల్నాడు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
రుతు పవన గాలులు కొనసాగనున్నాయని.. 40-50 కిమీ వేగంతో గాలుల వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
మరోవైపు, తెలంగాణలొ గత రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని తెలిపింది. దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్ని జిల్లాల్లో 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.