
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో నేడు, రేపు (శుక్ర,శని) భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో వారం రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వద్ద కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. వాయుగుండానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది.

కోస్తా జిల్లాల్లో ఐదు రోజులపాటు బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో విజయనగరం జిల్లాలో 12 సెం.మీ అత్యధిక వర్షపాతం నమోదయినట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.

రుతుపవనాలు ప్రవేశించి.. దాదాపు నెలన్నర అవుతున్నా.. లోటు వర్షపాతమే కొనసాగుతోంది. మండు వేసవిని తలపించేలా భానుడు భగభగలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో.. బ్రేక్‌మాన్‌సూన్ పరిస్థితులు కనిపిస్తున్నాయని ఎండలు.. లోటు వర్షపాతం నుంచి కొంత ఉపశమనం కలిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

వారి అంచనాల ప్రకారం గురువారం నుంచి రాష్ట్రంలో వర్షాలు క్రమక్రమంగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోనూ వర్షాలు జోరందుకోనున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ మోస్తరు వానలు పడనున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు, పిడుగులు పడే ప్రమాదం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.