
బయ్యారం: ఎండిపోతున్న వరినారుకు బిందెలతో నీళ్లుపోస్తూ జీవం పోసే యత్నం చేస్తున్న మహబూబాబాద్ జిల్లా కస్తూరినగర్‌కు చెందిన రైతు మాలోత్ రాంబాబు..
గాలుల తీవ్రతతోనే వానలకు ఆటంకం అంటున్న వాతావరణ శాస్త్రవేత్తలు
తెలంగాణలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు
సగటున 28 శాతం లోటు వర్షపాతం
ఆదిలాబాద్‌లో మాత్రమే సాధారణ వర్షపాతం
ఈ నెలాఖరులో వర్షాలు కురిసే అవకాశం
వాతావరణ విభాగం నిపుణుల అంచనా
సాక్షి, హైదరాబాద్: ‘ముందస్తు’గా మురిపించిన వర్షాలు కీలక సమయంలో ముఖం చాటేయటంతో రాష్ట్రంలో వాతావరణం వేసవిని తలపిస్తోంది. నైరుతి రుతుపవనాల సీజన్ లో సమృద్ధిగా వానలు కురవాల్సిన సమయంలో.. మొగులు కోసం రైతన్న దిగులుగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రుతుపవనాల కదలికలు మందగించడం, నిలకడలేని తీవ్రగాలుల ప్రభావంతో వర్షాలు జాడ లేకుండా పోయాయి. ఇదే సమయంలో తెలంగాణ ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈసారి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశించడంతో ఈ సీజన్‌లో వర్షాలు జోరుగా ఉంటాయని అంచనా వేశారు. ఈ అంచనాలు తలకిందులు కావటానికి ఎక్కువ రోజులు పట్టలేదు.
నైరుతి రుతుపవనాల సీజన్‌లోనే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో సగటున 24.34 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. కానీ 17.59 సెంటీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. సీజన్‌లో కేవలం జూన్, జూలై నెలల్లోనే ఎక్కువ వర్షాలు కురుస్తుంటాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత వరుసగా రెండు నెలలపాటు లోటు వర్షపాతం నమోదు కావడం ఇదే ప్రథమం అని వాతావరణ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
⇒ ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే సాధారణం కంటే 2 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మిగతా 32 జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉంది.
⇒ ఏడు జిల్లాల్లో 20 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదైంది.
⇒ 24 జిల్లాల్లో వర్షపాతం భారీ లోటు నమోదైంది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగుడెం, హబుబాబాద్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, జనగామ, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, ములుగు, నారాయణపేట జిల్లాల్లో 20 నుంచి 60 శాతం లోటు ఉంది.
⇒ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఏకంగా 62 శాతం తక్కువ వర్షాలు కురిశాయి.
వేసవి ఎండలు తక్కువగా ఉండడంవల్లే..
రాష్ట్రంలో సాధారణంగా వేసవి సీజన్‌లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. కానీ, ఈ ఏడాది వేసవిలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 20 సంవత్సరాల్లో మే నెలలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు ఈ సారి నమోదు కావడం గమనార్హం. ఎండల తీవ్రత తక్కువగా ఉంటే వర్షాలు సైతం తక్కువగానే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా మే నెలలో వర్షాలు అధికంగా కురవడం కూడా ప్రస్తుత వర్షాభావ పరిస్థితులకు మరో కారణమని అంటున్నారు. రాష్ట్రంలో వానలు బాగా కురవాలంటే బంగాళాఖాతంలో వాతావరణ మార్పులు కీలకమని నిపుణులు చెబుతున్నారు.
గాలుల తీవ్రతతో వానలకు ఆటంకం
నైరుతి సీజన్‌లో గాలుల తీవ్రత విపరీతంగా ఉంది. నిలకడలేని గాలుల కారణంగా వర్షాలు కురవడం లేదు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం లాంటివి ఏర్పడితే రాష్ట్రంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఉండేవి. కానీ ఈ సీజన్‌లో ఇప్పటివరకు అలాంటివేవీ నమోదు కాలేదు. ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం లాంటివి కనీసం రెండుమూడు రోజుల పాటు కొనసాగితే వర్షాలు సమృద్ధిగా కురిసేవి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వానలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ... తెలంగాణలో మాత్రం తక్కువగా ఉన్నాయి. మరో వారం తర్వాత పరిస్థితులు మారుతాయని అంచనా వేస్తున్నాం. – జీఎన్‌ఆర్‌ఎస్ శ్రీనివాసరావు, వాతావరణ శాస్త్రవేత్త, హైదరాబాద్ వాతావరణ కేంద్రం