
రాష్ట్రంలో సంతృప్తికర స్థాయిలో వర్షపాతం
సెప్టెంబర్ 2 నాటికి కురవాల్సిన వర్షం 59.30 సెం.మీ.
28 శాతం అధికంగా 75.75 సెం.మీ. నమోదు
ఇకపై కురిసే వర్షాలు అదనమే అంటున్న వాతావరణ శాఖ
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల సీజన్‌లో వర్షాలు సంతృప్తికర స్థాయిలో నమోదయ్యాయి. రాష్ట్రంలో ఈ సీజన్‌లో ఇప్పటివరకు కురవాల్సిన సగటు సాధారణ వర్షపాతానికి మించి వానలు పడ్డాయి. అయితే ఈ సీజన్ సెప్టెంబర్ నెలాఖరు వరకు ఉంది కాబట్టి.. ఇకపై కురిసే వర్షాలు అదనమేనని, వర్షాలు కురిస్తే సగటు సాధారణ వర్షపాతాన్ని మించి నమోదైనట్టేనని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నైరుతి రుతుపవనాల సీజన్ కాగా.. ఈ 4 నెలల కాలంలో రాష్ట్రంలో 74.06 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. సెప్టెంబర్ 2వ తేదీ నాటికి 59.30 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా,... ఏకంగా 75.75 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సగటు వర్షపాతం కంటే 28 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది.
ఆరు జిల్లాల్లో అత్యధిక వర్షాలు
∙ప్రస్తుత సీజన్‌లో రాష్ట్రంలోని 6 జిల్లాల్లో అత్యధిక వర్షాలు నమోదయ్యాయి. 14 జిల్లాల్లో అధిక వర్షపాతం, 13 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అత్యధికంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 60 రోజులు వర్షాలు పడ్డాయి. ఆ తర్వాత ఆదిలాబాద్‌లో 55, ములుగులో 51 రోజుల పాటు వర్షాలు కురిశాయి.
నిర్మల్‌లో 48, వరంగల్‌లో 47, మహబూబాబాద్‌లో 44, మెదక్, సంగా రెడ్డి జిల్లాలో 43 రోజుల పాటు వర్షాలు కురిశాయి. నారాయణపేట, రంగారెడ్డి జిల్లాల్లో 42 రోజులు చొప్పున, కామారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, ఖమ్మం జిల్లాల్లో 41 రోజుల చొప్పున వర్షాలు కురిశాయి. మండలాల వారీగా వర్షపాతాన్ని పరిశీలిస్తే..119 మండలాల్లో అత్యధిక వర్షపాతం, 271 మండలాల్లో అధిక వర్షపాతం, 218 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
13 మండలాల్లో మాత్రం ఇంకా లోటు ఉంది. సీజన్ ముగిసే నాటికి ఈ మండలాల్లో కూడా సాధారణ వర్షపాతం నమోదవుతుందని అధికారులు చెబుతున్నారు. సెపె్టంబర్‌లో రాష్ట్రంలో సాధారణం కంటే కాస్త ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఇప్పటికే అంచనాలు విడుదల చేసింది.
» అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లాలు: మెదక్, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, యాదాద్రి భువనగిరి, వనపర్తి, కామారెడ్డి
» అధిక వర్షపాతం నమోదైన జిల్లాలు : సిద్దిపేట, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, జోగుళాంబ గద్వాల, హైదరాబాద్, నల్లగొండ, మేడ్చల్–మల్కాజిగిరి, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్
» సాధారణ వర్షపాతం నమోదైన జిల్లాలు: ములుగు, మహబూబా బాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, జనగామ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, హనుమకొండ, పెద్దపల్లి.