
సాక్షి, హైదరాబాద్: కాసేపట్లో నగరంలో భారీ వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో జీహెచ్‌ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు అధికారులు సూచించారు. సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ సిరిసిల్ల, భూపాలపల్లి, రంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
కాగా, నగరంలో నిన్న (గురువారం) రాత్రి కుండపోత వర్షం భీభత్సం సృష్టించింది. ప్రధాన రోడ్లన్నీ చెరువులను తలపించాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి జనజీవనం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు నీటమునిగి ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. ఓపెన్ నాలాలు, డ్రైనేజీల మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లాయి. చాలాచోట్ల పార్క్ చేసిన కార్లు నీట మునగగా, ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. వాహనదారులతోపాటు పాదచారులు సైతం నరక యాతన పడ్డారు.
సుమారు 43 ఫీడర్ల (11 కేవీ) పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం అలముకుంది. నగరం మొత్తం సుమారు గంటన్నర పాటు వర్షం దంచి కొట్టింది. గురువారం రాత్రి 11 గంటల వరకు అత్యధికంగా గచ్చిబౌలిలో 13.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సరూర్‌నగర్, శ్రీనగర్ కాలనీల్లో 12 సెంటీæమీటర్ల వర్షం కురిసింది. గంట వ్యవధిలోనే 7 నుంచి 9 సెంటీమీటర్ల వర్షం పడింది. నగర శివారులోని పలు అపార్ట్‌మెంట్లలోకి భారీగా వరద నీరు చేరటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేక ఇబ్బందులు పడ్డారు.
