పడిపోయిన గరిష్ట,కనిష్ట ఉష్ణోగ్రతలు
పగటి పూట 2, రాత్రి పూట 3 డిగ్రీల మేర తగ్గుదల
రానున్న 3 రోజులపాటు ఇదే తరహా వాతావరణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పతనమయ్యాయి. మోంథా తుపాను ప్రభావం పూర్తిగా తగ్గడంతో వర్షాలు ఆగిపోయాయి. ఆ తర్వాత వాతావరణంలో నెలకొన్న మార్పులు.. పొడి వాతావరణ ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అక్టోబర్ నెలాఖరుకల్లా ఉష్ణోగ్రతల తగ్గుదల నమోదు కావాల్సి ఉండగా, ఈసారి కాస్త ఆలస్యంగానే ఉష్ణోగ్రతల పతనం నమోదైంది. దీంతో చలి ప్రభావం కనిపిస్తోంది. రానున్న మూడు రోజులపాటు ఇదే తరహా వాతావరణం ఉంటుంది. మరోవారం తర్వాత ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని, చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
నెలాఖరుకల్లా చలి తీవ్రం
నైరుతి రుతుపవనాలు పూర్తిగా ఉపసంహరణ కావడంతో వాతావరణంలో నెలకొనే మార్పులు శీతాకాలానికి సూచికగా కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుఫాను రాష్ట్రంలోనూ తీవ్ర ప్రభావాన్ని చూపింది. ప్రస్తుతం ఆకాశం మేఘాలు లేకుండా స్పష్టంగా ఉంది. దీంతో వాతావరణం పొడిగా మారుతోంది. దీంతో రాత్రి సమయంలో భూ ఉపరితలంపైనున్న వేడి త్వరగా తగ్గుతుండడంతో ఉష్ణోగ్రతలు సైతం వేగంగా తగ్గుతున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీ సెల్సియస్ తక్కువగా నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4డిగ్రీ సెల్సియస్ వరకు తగ్గుతున్నాయి. వేగంగా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడాన్ని పరిశీలిస్తే.. నెలాఖరు నాటికి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గి చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతానికి ఎలాంటి వాతావరణ హెచ్చరికలు లేవని అధికారులు అంటున్నారు. వాతావరణంలో నెలకొనే మార్పులతో అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని, ఈ పరిస్థితుల్లో ఉష్ణోగ్రతల పతనం క్రమంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వివరిస్తున్నారు.
ఆదివారం రాష్ట్రంలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే... మెదక్‌లో 14.1 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, ఆదిలాబాద్‌లో 14.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. భద్రాచలం, నల్లగొండ మినహాయిస్తే... మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైనట్టు వాతావరణ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.


