నేడు అండమాన్ సముద్రంలో అల్పపీడనం
27వ తేదీకి తుపానుగా బలపడే అవకాశం
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ప్రస్తుత ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారానికి దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఇది 24వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా, 26, 27 తేదీల్లో తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తుపానుగా మారిన తర్వాత దీనికి సెనియార్ అని పేరు పెట్టనున్నారు (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్–యూఏఈ ఈ పేరు పెట్టనుంది).
ఈ తుపాను ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్ తీరానికి చేరే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ ప్రస్తుతం అంచనా వేసింది. పలు ప్రైవేటు గ్లోబల్ మోడల్స్ మాత్రం ఇది వాయవ్య దిశగా పయనించి ఏపీ, ఒడిశా, తమిళనాడు తీరాలపై ప్రభావం చూపుతుందని చెబుతున్నాయి. సముద్ర ఉష్ణోగ్రతలు అస్థిరంగా ఉండడంతో దీని కదలికలు ఇంకా అస్పష్టంగా ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
అండమాన్ సముద్రం, బంగాళాఖాతంలో ప్రస్తుతం 28 నుంచి 30 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలున్నాయి. కొన్నిచోట్ల తేమ ఎక్కువగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో ఈ తేమ తగ్గుతోంది. ఫలితంగా దాని గమనంపై అస్పష్టత నెలకొంది. 26వ తేదీ నాటికి దీని గమనంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
26 నుంచి వర్షాలు
దీని ప్రభావంతో ఈ నెల 26 నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రంలో అలలు 3 నుంచి 5 మీటర్ల ఎత్తువరకు ఎగిసిపడతాయని తెలిపింది.
సెనియార్ అంటే..
సెనియార్ అనే పేరును యూఏఈ(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) పెట్టింది. ఈ పదం అరబిక్ భాషకు చెందినది. దీని అర్థం ‘చేపలు పట్టేందుకు నావలో చేసే సుదీర్ఘ ప్రయాణం’


