అవుట్‌డేటెడ్ స్కీమ్.. అడ్డగోలు స్కామ్!
పీఎం విశ్వకర్మలో కుట్టు శిక్షణను తొలగించిన కేంద్రం.. రాష్ట్రంలో మాత్రం అమలు ఎవరి ప్రయోజనాల కోసం?
రెడీమేడ్ పోటీ.. పెరిగిన టైలరింగ్ సెంటర్లతో ఉపాధి ఎండమావే..!
బీసీ సంక్షేమ శాఖ కుట్టు శిక్షణ స్కీమ్‌పై ఆసక్తి చూపని మహిళలు
3 లక్షలకుపైగా ఆన్‌లైన్ దరఖాస్తులు.. శిక్షణకు వచ్చింది అంతంతమాత్రమే
అరకొర శిక్షణ.. ఆపై మెషిన్ల పంపిణీ పేరుతో బిల్లుల కోసం పైరవీలు
కీలక నేతల ఆశీస్సులతోనే అంతులేని అవినీతికి కుట్ర
సాక్షి, అమరావతి: మార్కెట్‌లో రెడీమేడ్ దుస్తుల తాకిడి పెరిగింది. కుట్టు మెషిన్ సెంటర్లు పెరిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో వేలాది మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి మెషిన్లు ఇచ్చినా వాటి ద్వారా వారి కుటుంబాన్ని పోషించుకునేంత ఉపాధి ఉండదనేది ఎవరినడిగినా చెబుతారు. అయినా ప్రభుత్వ పెద్దలు పంతం పట్టి మరీ కుట్టు శిక్షణ, కుట్టు మెషిన్ల పంపిణీ అంటూ రూ.కోట్లు ప్రజాధనం వృథాకు చేస్తున్న యత్నాలు అనుమానాలకు తావిస్తున్నాయి.
పదేళ్ల క్రితం పాతబడిన కుట్టు శిక్షణ స్కీమ్‌ను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ(పీఎం విశ్వకర్మ) స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాల్లోనూ పరిగణనలోకి తీసుకోకపోయినా రాష్ట్రంలో చేపట్టడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
రాష్ట్రంలోని బీసీ సంక్షేమ శాఖ ద్వారా అవుట్‌డేటేడ్ స్కీమ్‌ను అమలు చేయడం ద్వారా అడ్డగోలు స్కామ్‌కు స్కెచ్ వేశారన్నది తేటతెల్లమవుతోంది. టెండర్ నుంచి శిక్షణ వరకు అనేక లోపభూయిష్ట పద్ధతులు అనుసరించడంతోపాటు నిబంధనలూ ఉల్లంఘించిన ఈ స్కీమ్‌లో ఇప్పుడు బిల్లుల కోసం పైరవీలు ఊపందుకున్నాయి.
ఒకే కుటుంబానికి చెందిన రెండు సంస్థలకు వర్క్ ఆర్డర్
కీలక నేతల ఆశీస్సులతో రంగంలోకి దిగిన చిత్తూరు జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ అధికారులతో కుమ్మక్కై భారీ స్కామ్‌కు కుట్ర పన్నినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.257 కోట్లతో ప్రతిపాదించిన కుట్టు శిక్షణ, కుట్టు మెషిన్ల పంపిణీ పథకానికి తక్కువకు కోట్ చేసిన కాంట్రాక్టర్‌తోపాటు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నిర్వహిస్తున్న రెండు సంస్థలను ఎంప్యానల్ చేసి వర్క్ ఆర్డర్ ఇచ్చారు.
టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ నుంచి సెక్యూరిటీ డిపాజిట్(టెండర్ మొత్తంలో 2.5శాతం) తీసుకోకుండానే వర్క్ ఆర్డర్ ఇచ్చేయడం మరీ దారుణం. వాస్తవానికి టెండర్ ఖరారైన ఏడు రోజుల్లోగా సెక్యూరిటీ డిపాజిట్ చెల్లిస్తేనే అగ్రిమెంట్ ఇవ్వాలి. అధికారుల తప్పిదం బయటకు పొక్కడంతో కాంట్రాక్టర్‌కు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని నోటీస్ ఇచ్చి మసిపూసి మారేడు కాయ చేసే యత్నం చేసినట్టు సమాచారం.
స్కీమ్ అమలులో డొల్లతనం బట్టబయలు
బీసీ సంక్షేమ, ఈడబ్ల్యూఎస్ శాఖ ద్వారా రూ.257 కోట్లతో మొత్తం 1,02,832 మంది మహిళలకు ప్రతిపాదించిన ఈ స్కీమ్ అమలులో డొల్లతనం బట్టబయలైంది. అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం చూసినా రాష్ట్రంలో బీసీ, ఈడబ్ల్యూఎస్‌కు చెందిన 3,43,398 మంది మహిళలు ఉచిత కుట్టు శిక్షణ కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు.
వారిలో 72,080 మంది మాత్రమే శిక్షణ కోసం ఎఫ్‌ఆర్‌ఎస్ (ఫేస్ రికగ్నేషన్) యాప్‌లో నమోదు చేసుకున్నారు. వారిలోనూ 52,513 మంది మాత్రమే శిక్షణ పొందుతున్నారని చెబుతున్నారు. వారిలో 75శాతం హాజరు ఉంటేనే ఉచితంగా కుట్టు మెషిన్ అందిస్తామని అధికారులు చెబుతున్నారు.
90 రోజుల శిక్షణకు హాజరవుతున్న వారిలో 75శాతం హాజరు ఉండేది ఎంత మందికి అనేది అధికారులకే ఎరుక. ఈ లెక్కలు గమనించినా ఈ స్కీమ్ పట్ల మహిళలు ఆసక్తి చూపడంలేదని, శిక్షణ ప్రక్రియ కూడా సక్రమంగా జరగలేదనేది జగమెరిగిన సత్యం.
బిల్లుల కోసం కాంట్రాక్టర్ ఒత్తిళ్లు..
అధికారుల ససేమిరా కుట్టు శిక్షణ స్కీమ్ పేరుతో కాంట్రాక్టర్‌ను ముందు పెట్టి రూ.కోట్లు (బిల్లులు) కొట్టేసేందుకు పెద్ద ఎత్తున పైరవీలు సాగుతున్నాయి. తొలుత మొబిలైజేషన్ అడ్వాన్స్ కోసం యత్నిoచి భంగపడిన కాంట్రాక్టర్ తాజాగా మొదటి దశ శిక్షణ పూర్తైందని, బిల్లులు చెల్లించాలని రకరకాలుగా అధికారులపై ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. టెండర్ నుంచి శిక్షణ వరకు నిబంధనల్లో తీవ్ర ఉల్లంఘన ఉండటంతో బిల్లులు చెల్లిస్తే.. అది భవిష్యత్‌లో తమ మెడకు చుట్టుకుంటుందని ఆందోళన చెందుతున్న ఆర్థిక శాఖ అధికారులు అందుకు ససేమిరా అంటున్నారు.
రంగంలోకి కీలక అధికారులు
ఆర్థిక శాఖ అధికారులు బిల్లుల మంజూరుకు ఒప్పుకోకపోవడంతో అధికారపార్టీ నేతల ఆదేశాలతో రంగంలోకి దిగిన కీలక అధికారులు ఎలాగోలా బిల్లులు ఇప్పించేందుకు శక్తివంచన లేకుండా యత్నిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల ఈడీలతో సమావేశం నిర్వహించి కుట్టు శిక్షణ హాజరు, తదితర అంశాలను ఆమోదించేలా ఒత్తిడి తెచ్చారు. ఎంపిక ప్రక్రియలో గ్రామ, మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారుల అనుమతి తీసుకునే రాష్ట్ర స్థాయి అధికారులు, డబ్బులు చెల్లింపు విషయానికి వచ్చేటప్పటికి జిల్లా స్థాయిలో ఒక బీసీ కార్పొరేషన్ ఈడీ సంతకం ఉంటే చాలు అనే నిబంధన విధించారు.
ఈ నిబంధన వల్ల తాము ఇరుక్కుంటామని ఈడీలు ససేమిరా అంటున్నారు. తమ నియోజకవర్గంలో శిక్షణ పూర్తి అయ్యిందని కుట్టు మెషిన్లు ఇవ్వాలని ఎమ్మెల్యేల లేఖలు తీసుకుని బిల్లుల కోసం యత్నించడం గమనార్హం. ఇదిలా ఉంటే.. కుట్టు స్కీమ్ బిల్లుల విషయమై ఇటీవల మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు వద్ద కొందరు అధికారులు ప్రస్తావించినప్పుడూ ఆరి్థక శాఖ అధికారులు ససేమిరా అన్నట్టు విశ్వసనీయ సమాచారం.


