చంద్రబాబు సర్కారు నిర్వాకాలను ఎండగడుతూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ లేఖ
కేడబ్ల్యూడీటీ–2లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున దాఖలు చేసిన అఫిడవిట్టే మీ నిర్లక్ష్యానికి నిదర్శనం
బచావత్ ట్రిబ్యునల్ అవార్డును పునఃసమీక్షించడం అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం ప్రకారం చట్టవిరుద్ధం
విభజన చట్టం 11వ షెడ్యూల్ బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను యథాతథంగా కొనసాగించాలని చెప్పింది
కేడబ్ల్యూడీటీ–2కు కేంద్రం 2023లో జారీ చేసిన అదనపు మార్గదర్శకాలు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టులో కేసు వేశాం
ఆ కేసులో సమర్థంగా వాదనలు వినిపించడంలో బాబు ప్రభుత్వం ఘోర వైఫల్యం
దానివల్లే అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం, విభజన చట్టానికి విరుద్ధంగా కేడబ్ల్యూడీటీ–2 వాదనలు వింటోంది
కృష్ణా జలాల్లో 763 టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ సర్కార్ వాదిస్తోంది
ట్రిబ్యునల్ విచారణ చేస్తుండగానే అదనంగా 372.54 టీఎంసీలు తరలించేలా, 16 ప్రాజెక్టులు చేపట్టేందుకు తెలంగాణ ఉత్తర్వులు.. అయినా సరే మీ ప్రభుత్వం
నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది
కేడబ్ల్యూడీటీ–2లో తుది వాదనలనైనా సమర్థంగా వినిపించండి బాబూ..
బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 512 టీఎంసీలు నికర జలాల్లో.. ఒక్క టీఎంసీ తగ్గినా దానికి మీరే బాధ్యత వహించాలి
1995–2004 మధ్య మీ నిర్వాకం వల్లే కర్ణాటక సర్కార్ ఆల్మట్టి ఎత్తును 524.25 మీటర్లకు పెంచేసింది
ఇప్పుడు నీటి నిల్వ ఎత్తును 519.6 నుంచి 524.25 మీటర్లకు పెంచే దిశగా అడుగులు వేస్తోంది.. దీని వల్ల ఆల్మట్టిలో అదనంగా వంద టీఎంసీలు నిల్వ చేసే అవకాశం
కేడబ్ల్యూడీటీ–2 అవార్డు అమల్లోకి రాక ముందే ఆల్మట్టి ఎత్తును కర్ణాటక పెంచేస్తున్నా చంద్రబాబు చేష్టలుడిగి చూస్తున్నారు
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల పరిరక్షణలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? అంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలో జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ తాళపత్ర సభ్యులుగా ఉన్న కేడబ్ల్యూడీటీ–2 (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్)లో.. కృష్ణా జలాలపై ఏపీ హక్కులను పరిరక్షించడం, ప్రయోజనాలను కాపాడటంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని, పేలవమైన వాదనలు వినిపిస్తోందని మండిపడ్డారు.
కేడబ్ల్యూడీటీ–2లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అనిల్‌కుమార్(ఏకే) గోయల్ దాఖలు చేసిన అఫిడవిట్.. తెలంగాణ ప్రభుత్వ సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు, ఏకే గోయల్ ఇచ్చిన సమాధానాలే అందుకు నిదర్శనమని ధ్వజమెత్తారు. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956 సెక్షన్–6(2) ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానమని.. దాన్ని పునఃసమీక్షించడం చట్టవిరుద్ధమని.. ఇదే అంశాన్ని కేడబ్ల్యూడీటీ–2 కేంద్రానికి ఇచ్చిన తుది నివేదికలో స్పష్టం చేసిందని గుర్తుచేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం విభజిత ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులకు ట్రిబ్యునళ్లు చేసిన నీటి కేటాయింపులు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టంగా పేర్కొందన్నారు.
కేడబ్ల్యూడీటీ–2కు 2023 అక్టోబరు 6న కేంద్ర జల్ శక్తి శాఖ జారీ చేసిన అదనపు విధి విధానాలు (టీవోఆర్) చట్టవిరుద్ధమని.. అందుకే వాటిని సవాల్ చేస్తూ నాడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిందని గుర్తు చేశారు. ఈ కేసులో టీడీపీ కూటమి ప్రభుత్వం సమర్థంగా వాదనలు వినిపించకపోవడం వల్లే.. కేంద్రం జారీ చేసిన అదనపు విధి విధానాల ప్రకారం విచారణ చేయాలని, తమ తీర్పునకు అనుగుణంగా తుది నిర్ణయం ఉంటుందని సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసిందన్నారు.
ఇప్పటికైనా మేల్కొని రాష్ట్ర హక్కులను పరిరక్షించేలా.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేలా తుది వాదనలు వినిపించటానికి చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ హితవు పలికారు. ఈ మేరకు చంద్రబాబుకు ఆయన శుక్రవారం లేఖ రాశారు. తొమ్మిది పేజీలతో కూడిన ఆ లేఖను తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..
బచావత్ ట్రిబ్యునల్ అవార్డు సుప్రీం కోర్టు డిక్రీతో సమానం..
అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం 1956లో సెక్షన్–6(2) బచావత్ ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ–1) అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానం. దాన్ని పునఃసమీక్షించడం చట్ట విరుద్ధమని కేడబ్ల్యూడీటీ–2 కూడా అభిప్రాయపడింది. అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం అక్టోబరు 6, 2023న జారీ చేసిన అదనపు విధి విధానాలకు అనుగుణంగా, కేడబ్ల్యూడీటీ–1 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నికర జలాలు 811 టీఎంసీలు(75% లభ్యత) పునఃపంపిణీ చేయడం, కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన మిగులు జలాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పంపిణీ చేయడంపై కేడబ్ల్యూడీటీ–2 విచారణ కొనసాగిస్తోంది.
దీనిపై కేడబ్ల్యూడీటీ–2 ఎదుట గత సెప్టెంబరు 23, 24వ తేదీల్లో తుది వాదనలు కొనసాగాయి. కృష్ణా జలాల్లో కచ్చితంగా 763 టీఎంసీల నీరు కేటాయించాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. అదే వాదనను కేడబ్ల్యూడీటీ–2 ఎదుట బలంగా వినిపిస్తోంది. అదే కనుక జరిగితే ఆం«ధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగినట్లే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తుది వాదనలు వినిపించే అవకాశం ఉంది కాబట్టి.. కృష్ణా జలాలపై హక్కులను కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.
చంద్రబాబు సర్కార్ వైఫల్యం వల్లే..
ఇప్పుడు కేడబ్ల్యూడీటీ–2 ఎదుట రాష్ట్రం తరఫున చంద్రబాబు సర్కారు వినిపిస్తున్న వాదనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేడబ్ల్యూడీటీ–2 తన తుది నివేదికను 2013 నవంబరు 29న కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తూ.. ‘కృష్ణా జలాల కేటాయింపులపై కేడబ్ల్యూడీటీ–1 నిర్ణయాలు ఎలాంటి ప్రభావానికి లోనై తీసుకున్నవి కావు. కాబట్టి వాటిని సమీక్షించడం అంటే కొత్తగా గందరగోళానికి తెర తీయటమే’ అని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014లోని 11వ షెడ్యూల్, క్లాజ్–4 ప్రకారం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులకు ట్రిబ్యునల్ కేటాయించిన జలాలు యథాతథంగా కొనసాగాల్సి ఉంది. ట్రిబ్యునల్ ప్రాజెక్టులకు చేసిన నీటి కేటాయింపుల్లో ఎలాంటి మార్పు ఉండకూడదు.
కానీ, అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం, విభజన చట్టం 11వ షెడ్యూల్‌ను తుంగలో తొక్కుతూ కేంద్ర జలశక్తి శాఖ 2023 అక్టోబరు 6న అదనపు విధి విధానాలు జారీ చేస్తూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీలను రెండు తెలుగు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని ఆదేశించింది. వెంటనే దాన్ని సవాల్ చేస్తూ, అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2023 అక్టోబరు 9న సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత 2024 జూన్ 12న ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టులో సరైన వాదనలు వినిపించలేదు.
ఫలితంగా కేంద్రం జారీ చేసిన అదనపు విధి విధానాలకు అనుగుణంగా కృష్ణా జలాల పంపిణీపై విచారణ చేపట్టాలని.. తుది నిర్ణయం తమ తీర్పునకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. వాటికి అనుగుణంగా 2024 ఆగస్టు 27న కేడబ్ల్యూడీటీ–2 విచారణ మొదలు పెట్టింది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలను పున:పంపిణీకి సంబంధించి రెండు రాష్ట్రాల వాదనలు ముందుగా వింటామని 2024 ఆగస్టు 29న కేడబ్ల్యూడీటీ–2 స్పష్టం చేస్తే టీడీపీ కూటమి ప్రభుత్వం ఎలా అంగీకరించింది? మొత్తం 36 అంశాలకు సంబంధించి రెండు రాష్ట్రాల సమ్మతికి అనుగుణంగా కృష్ణా జలాల నికర పున:పంపిణీపై విచారణ జరుపుతామని కేడబ్ల్యూడీటీ–2 వెల్లడించింది.
కేటాయింపులకు బేసిన్ ప్రాతిపదిక కాదు..
కృష్ణా బేసిన్ తమ రాష్ట్రంలో 71 శాతం ఉన్నందు వల్ల 75 శాతం నీటి లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల నీటిలో తమకు కచ్చితంగా 71 శాతం జలాలు కేటాయించాల్సిందే అని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. కానీ.. నీటి కేటాయింపులను బేసిన్ ప్రాతిపదికన ఏ ట్రిబ్యునల్ కూడా చేయలేదని గుర్తు చేస్తూ బలంగా వాదనలు వినిపించడంలో టీడీపీ సర్కార్ విఫలమవుతోంది. ఇది దురదృష్టకరం. కృష్ణా జలాల కేటాయింపునకు సంబంధించి, గతంలో తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన అంశాలు ఒక్కసారి చూస్తే.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలకు కృష్ణా జలాలను పంపిణీ చేసేందుకు 1969 ఏప్రిల్ 10న జస్టిస్ బచావత్ నేతృత్వంలో కేడబ్ల్యూడీటీ–1ను కేంద్రం ఏర్పాటు చేయగా.. ఆ ట్రిబ్యునల్ 1976 మే 27న తుది నివేదిక ఇవ్వగా.. దాన్ని అమలు చేస్తూ నాలుగు రోజుల తర్వాత..
అంటే 1976 మే 31న ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది.
అప్పుడు కూడా కృష్ణా జలాల కేటాయింపులో కేడబ్ల్యూడీటీ–1 నదీ పరీవాహక ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. కృష్ణా పరీవాహక ప్రాంతం 2,58,948 చదరపు కి.మీ కాగా, అందులో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 29.45 శాతం, అంటే 76,252 కి.మీ ఉంది. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా నదిలో 2,130 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని కెడబ్ల్యూడీటీ–1 నిర్ధారణకు వచ్చింది. ఒకవేళ నదీ పరీవాహక ప్రాంతాన్నే పరిగణలోకి తీసుకుని ఉంటే, నాడు ఆ ప్రాంతం ఉన్న మన ఆంధ్రప్రదేశ్‌కు 2,130 టీఎంసీల నీటిలో 627.29 టీఎంసీలు మాత్రమే కేటాయించేవారు. అన్ని అంశాలు, సమగ్ర అధ్యయనం తర్వాత అంతర్జాతీయ స్థాయిలో అనుసరించే ప్రమాణాలను ప్రాతిపదికగా తీసుకుని ‘ఫస్ట్ ఇన్‌టైమ్ ఫస్ట్ ఇన్ రైట్’ (ఎవరైతే ముందుగా ప్రాజెక్టు నిర్మించి, నీరు వినియోగిస్తారో వారికే తొలి హక్కు)ను అనుసరిస్తూ.. కేటాయింపులు జరిపింది.
నాడు మన రాష్ట్రంలో తొలుత 1885–1928 మధ్య కర్నూలు–కడప కాలువ (కేసీ కెనాల్)తో పాటు కృష్ణా ఆయకట్టులో నీటి వినియోగం జరిగింది. ఆ ప్రాతిపదికన రాష్ట్రంలో కృష్ణా నీటి కేటాయింపుపై ప్రాజెక్టులను మూడు వర్గాలుగా విభజించి నిర్ణయం తీసుకున్నారు. 1951 నాటికి పూర్తయిన ప్రాజెక్టులు, 1951 నుంచి 1960 సెప్టెంబరు వరకు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, 1960 తర్వాత చేపట్టిన ప్రాజెక్టులుగా కేడబ్ల్యూడీటీ–1 వర్గీకరించింది. ఆ మేరకు పాత ప్రాజెక్టులకు 749.16 టీఎంసీలు, అప్పటికే ప్రతిపాదనలో ఉన్న జూరాలకు 17.84 టీఎంసీలు, శ్రీశైలం ప్రాజెక్టుకు 33 టీఎంసీలతోపాటు పునరుత్పత్తి (రీజనరేషన్) అవసరాల కోసం మరో 11 టీఎంసీలు.. అన్నీ కలిపి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాల్లో మొత్తం 811 టీఎంసీలు కేటాయించారు.
కేడబ్ల్యూడీటీ–1 కేటాయింపుల మేరకు రాయలసీమకు 144.7 టీఎంసీలు, కోస్తా ఆంధ్రాకు 387.24 టీఎంసీలు, తెలంగాణకు 278.96 టీఎంసీలు లభిస్తాయి. కృష్ణా డెల్టా ఆధునికీకరణతో మిగిలే 20 టీఎంసీలను తెలంగాణలోని భీమా ఎత్తిపోతలకు కేటాయించారు. తుదిగా రాయలసీమకు 144.7 టీఎంసీలు, కోస్తాంధ్రకు 20 టీఎంసీలు తగ్గి 367.24 టీఎంసీలు, తెలంగాణకు ఆ 20 టీఎంసీలు పెరిగి వాటా 298.96 టీఎంసీలకు పెరిగింది. అలా ఏపీకి 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీల నీరు కృష్ణా జలాల్లో దక్కింది. ఆ మేరకే 2015, జూలై 18, 19 తేదీల్లో కేంద్రం, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తాత్కాలిక సర్దుబాటు ఒప్పందం జరిగింది.
పంపిణీ చేయాల్సింది కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన మిగులు జలాలనే..
కేడబ్ల్యూడీటీ–1 అవార్డు గడువు ముగియడంతో 2004 ఏప్రిల్ 2న కేంద్ర ప్రభుత్వం కేడబ్ల్యూడీటీ–2 ను ఏర్పాటు చేసింది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు, కర్ణాటక, మహారాష్ట్ర వాదనలు కూడా విన్న తర్వాత కేడబ్ల్యూడీటీ–2 ప్రాథమిక నివేదిక 2010 డిసెంబర్ 31న, తుది నివేదికను 2013 నవంబరు 29న కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదికపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వేర్వేరుగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేశాయి. కేడబ్ల్యూడీటీ–2 తుది నివేదికను అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ గెజిట్ ప్రచురించలేదు.
2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌తోపాటు, తెలంగాణకు కృష్ణా జలాలను పంపిణీ చేసే బాధ్యతను కేడబ్ల్యూడీటీ–2కు అప్పగించింది. అప్పటి నుంచి పలుమార్లు.. 2014 నుంచి 2024 వరకూ కేడబ్ల్యూడీటీ–2 గడువు పొడిగిస్తూనే వచ్చారు. 2024 ఆగస్టు 29న కేడబ్ల్యూడీటీ–2 ఆదేశాలు జారీ చేస్తూ.. నాడు ఉమ్మడి రాష్ట్రంలో కేడబ్ల్యూడీటీ–1 ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీల నీటి పున:పంపిణీపై వాదనలు వింటామని వెల్లడించింది. ఆ తర్వాత నదిలో కేడబ్ల్యూడీటీ–2 తుది నివేదికలో సగటు ప్రవాహాలు, 75% నుంచి 65% మధ్య ఉన్న మిగులు జలాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా కేటాయించిన 194 టీఎంసీల పంపిణీపై వాదనలు వింటామని పేర్కొంది. విభజన చట్టం ప్రకారం కేడబ్ల్యూడీటీ–1 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీల పున:పంపిణీ అనేది పూర్తిగా చట్టవిరుద్ధం.
కేవలం కేడబ్ల్యూడీటీ–2 తుది నివేదికలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించని 194 టీఎంసీల మిగులు జలాల పంపిణీపై మాత్రమే ట్రిబ్యునల్ విచారించాల్సి ఉంది. అందులోనూ విభజన చట్టంలో 11వ షెడ్యూల్‌లో ప్రస్తావించిన హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, తెలుగుగంగతో పాటు, తెలంగాణలోని నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. వాస్తవ పరిస్థితులు ఇలా ఉండగా, చంద్రబాబు ప్రభుత్వం పూర్తి ఉదాసీనత ప్రదర్శిస్తోంది.
గతంలో కేటాయించిన 811 టీఎంసీల పున:పంపిణీని సమీక్షిస్తామన్న కేడబ్ల్యూడీటీ–2 నిర్ణయంపై కనీసం అభ్యంతరం కూడా చెప్పడం లేదు. కృష్ణా డెల్టాలో వినియోగించిన నీటిలో 95 శాతం ఆ పరీవాహక ప్రాంతం వెలుపల వినియోగిస్తున్నట్లు అంగీకరించడం వల్ల, కృష్ణా జలాలపై రాష్ట్రం హక్కు, ఆ నీటి వినియోగంలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంపై ఈ ప్రభుత్వం ఏ మాత్రం చిత్తశుద్ధి చూపడం లేదన్న విషయం స్పష్టమవుతోంది.
రాయలసీమకు అన్యాయం..
ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నిర్వహణ నియమావళి (ఆపరేషన్ ప్రోటోకాల్)కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్షాన కేడబ్ల్యూడీటీ–2లో ఏకే గోయల్ దాఖలు చేసిన అఫిడవిట్ చూస్తే.. దేశంలోనే కరవు పీడిత ప్రాంతమైన రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతున్న విషయం స్పష్టమవుతోంది. కరవు ప్రాంతాలైన రాయలïÜమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగు నీరందించేలా తెలుగుగంగ (కృష్ణా 29 టీఎంసీలు. పెన్నా 30 టీఎంసీలు), గాలేరు–నగరి (38 టీఎంసీలు), హంద్రీ–నీవా (40 టీఎంసీలు), వెలిగొండ (43.5 టీఎంసీలు) చేపట్టారు.
మిగులు జలాలపై ఆధారపడి శ్రీశైలం నుంచి మూడు దశాబ్దాలుగా తెలుగుగంగకు, హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులకు 12 ఏళ్లుగా నీటి విడుదల జరుగుతోంది. వెలిగొండలో మొదటి దశ దాదాపు పూర్తయింది. రెండో దశలో శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని నల్లమలసాగర్‌కు తరలించాల్సి ఉంది. కానీ.. కేడబ్ల్యూడీటీ–2 ముందు ఏకే గోయల్ దాఖలు చేసిన అఫిడవిట్ శ్రీశైలం నుంచి తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు నీటి విడుదలను ప్రశ్నార్థకం చేసింది. కేడబ్ల్యూడీటీ–1 అవార్డు అమలులో ఉన్నంత కాలం.. బేసిన్‌లోని రాష్ట్రాలు 2,130 టీఎంసీలు వినియోగించుకున్న తర్వాతే.. అందులోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 811 టీఎంసీల నికర జలాలను వినియోగించుకున్న తర్వాతే తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తామని ఆ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ఇక పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించిన 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో నాగార్జునసాగర్ ఎగువన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 45 టీఎంసీలు వినియోగించుకోవచ్చు. వాటిని కూడా బేసిన్‌లోని రాష్ట్రాలు 2,130 టీఎంసీలను వాడుకున్న తర్వాతే వినియోగించుకుంటామని అఫిడవిట్లో పేర్కొన్నారు. గత ఆరేళ్లలో కృష్ణా నదిలో కొనసాగుతున్న వరద పరిస్థితి చూస్తే.. జూలై, ఆగస్టులో శ్రీశైలానికి ప్రవాహం మొదలవుతోంది. ఏ ఏడాదీ అవసరాలకు మించి వరద రాలేదు. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో తొలి నుంచి టీడీపీ వైఖరి దారుణం. ఏనాడూ అక్కడి ప్రాజెక్టులను పట్టించుకోలేదు.
మీ పాపం వల్లే.. ఆల్మట్టి ఎత్తు పెంపు..
చంద్రబాబు 1995లో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. 1996లో లోక్‌సభ ఎన్నికల తర్వాత యునైటెడ్ ఫ్రంట్‌కు కన్వీనర్‌గా ఉన్నారు. ఆ ఎన్నికల తర్వాత హెచ్‌డీ దేవెగౌడ ప్ర«ధాని అయ్యారు. అప్పుడు ఆయన తన రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చేలా కర్ణాటకలో కృష్ణా నదిపై ఉన్న ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచే పని మొదలుపెట్టారు. దీనివల్ల డ్యామ్‌లో 100 టీఎంసీల అదనపు నిల్వ సామర్థ్యం ఏర్పడుతుంది. అది మన రాష్ట్ర ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బ తీస్తుందంటూ రైతులతోపాటు విపక్షాలు ఎంత ఆందోళన వ్యక్తం చేసినా మీరు (చంద్రబాబు) ఏమాత్రం పట్టించుకోకుండా పెడచెవిన పెట్టారు. ఆ తర్వాత 2000లో బచావత్ ట్రిబ్యునల్ గడువు ముగుస్తుండడంతో కృష్ణా జలాల కేటాయింపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే అవకాశం ఏర్పడింది.
ఆ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులు మొదలుపెట్టాలన్న డిమాండ్ అన్ని వర్గాల నుంచి వచ్చింది. రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాకు మేలు చేసేలా హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టు.. తెలంగాణ ప్రాంతంలోని నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా ఎత్తిపోతల పథకం, శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టులు చేపట్టాలన్న డిమాండ్లు వచ్చాయి. కానీ, మీ ప్రభుత్వం అవేవీ పట్టించుకోలేదు. సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో అవన్నీ పునాదిరాళ్లకే పరిమితం అయ్యాయి. అప్పుడు కేవలం మీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుకునేందుకు కర్ణాటక ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ 2010లో అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
విభజన తర్వాత తెలంగాణకు హక్కులు తాకట్టు..
రాష్ట్ర విభజన తర్వాత 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో సీఎంగా ఉన్న మీరు (చంద్రబాబు) హైదరాబాద్‌లో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి రాత్రికి రాత్రి అక్కడి నుంచి పారిపోయి వచ్చారు. ఆ కేసు నుంచి బయటపడేందుకు కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టారు. తమ భూభాగంలో ఉన్నాయనే సాకు చూపుతూ శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంతో పాటు పులిచింతల పవర్ ప్రాజెక్టును కూడా 2014లో తెలంగాణ ప్రభుత్వం తమ అధీనంలోకి తీసుకుంది. నాగార్జునసాగర్ కుడి కాలువ రెగ్యులేటర్ ఏపీ భూభాగంలోనే ఉన్నా దాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం తమ అధీనంలోకి తీసుకుంది. ఇంత జరిగినా దేన్నీ మీ ప్రభుత్వం అడ్డుకోలేకపోయింది. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతున్నా అప్పటి మీ ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
దీంతో కృష్ణా జలాల కేటాయింపు, వినియోగంలో తమకు చాలా అన్యాయం జరుగుతోందని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ నేపథ్యంలోనే కృష్ణా జలాల కేటాయింపునకు సంబంధించి కృష్ణా బోర్డు, దాని పరిధి, విధి విధానాలు ఖరారు చేస్తూ 2021 జూలై 15న కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. విభజన చట్టం 11వ షెడ్యూలులోని హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, తెలుగుగంగ ప్రాజెక్టులను అనుమతి ఉన్న ప్రాజెక్టులుగా ప్రకటించింది. వీటన్నింటి సాధన కోసం నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేసింది.
కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో ఎక్కడా రాజీ పడకుండా పని చేసింది. ఇప్పుడు టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు అదే చిత్తశుద్ధితో పని చేయాలని కోరుతున్నాం. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ద్వారా రాష్ట్రానికి దక్కిన 512 టీఎంసీలలో ఇప్పుడు ఒక్క టీఎంసీ కోల్పోయినా అందుకు టీడీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఇప్పటికైనా మేలుకో బాబూ..!
కేడబ్ల్యూడీటీ–2 ఎదుట రెండు తెలుగు రాష్ట్రాల వాదనలు కొనసాగుతుండగానే.. కృష్ణా జలాలు అత్యధికంగా వినియోగించుకునేలా, ఇప్పుడున్నవే కాకుండా, అదనంగా కూడా 372.54 టీఎంసీలు నిల్వ చేసుకునే విధంగా ప్రాజెక్టులు చేపట్టడానికి తెలంగాణ ప్రభుత్వం 2025 సెప్టెంబరు 16న జీఓ ఎంఎస్ నెం. 34 జారీ చేసింది. మరోవైపు అదేరోజు అటు కర్ణాటక ప్రభుత్వం కూడా ఆల్మట్టి డ్యామ్‌లో నీటి నిల్వ ఎత్తు 519.16 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచే పనులకు అనుమతి ఇచ్చింది. దీనివల్ల ముంపునకు గురయ్యే 1,33,867 ఎకరాల భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కేడబ్ల్యూడీటీ–2 తుది నివేదిక అమల్లోకి రాక ముందే కర్ణాటక సర్కార్ ఆల్మట్టిలో నీటి నిల్వ ఎత్తును పెంచేస్తున్నప్పటికీ మీరు చేష్టలుడిగి చూస్తుండటం దారుణం. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ, ప్రయోజనాలను కాపాడటంలో మీ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం, అలక్ష్య ధోరణి వల్లే పొరుగు రాష్ట్రాలు ఆ విధంగా చురుకుగా వ్యవహరిస్తున్నాయి. దీనివల్ల మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరాన్ని మళ్లీ ఒకసారి మీ దృష్టికి తెస్తున్నా. గతంలో మీరు ఎప్పుడు అధికారంలో ఉన్నా, రాష్ట్రం తీవ్ర అన్యాయానికి గురైంది. తిరిగి ఈరోజు అదే పరిస్థితి ఉత్పన్నమవుతోంది. అదే సమస్య ఎదురవుతోంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మీరు రాజీ పడతారన్న అభిప్రాయం అందరిలో బలంగా వ్యక్తమవుతోంది.


