సాక్షి,అమరావతి: చంద్రబాబు సర్కారుపై అమరాతి రైతులు తిరగబడ్డారు. ‘తొలి దశలో మిమ్మల్ని నమ్మి వేలాది ఎకరాలు ఇస్తే.. మాకు అరుణ్య రోదన మిగిల్చారు. సంచార జాతుల్లా రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాం. అభివృద్ధి.. అభివృద్ధి అంటున్నారు ఇప్పటి వరకు ఎంత మేరకు అభివృద్ధి చేశారు’ అంటూ చంద్రబాబు ప్రభుత్వానికి అమరావతి రైతులు షాకిచ్చారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. రెండో దశ ల్యాండ్ పూలింగ్ కోసం నిర్వహించిన గ్రామ సభకు హాజరైన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌ను నిలదీశారు.
బుధవారం తుళ్లూరు మండలం వడ్డమానులో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామ సభ నిర్వహించింది. గ్రామ సభలో గ్రామస్తుల నుంచి భూసేకరణకు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ప్రయత్నించారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇవ్వాలని.. భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా అన్నీ ప్రయోజనాలు కల్పిస్తామని సూచించగా.. ఇందుకు వారు ససేమిరా అన్నారు. ఈ సందర్భంగా.. అమరావతి చట్టబద్ధపై మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌పై గ్రామస్తులు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో గ్రామ సభలో గందర గోళం నెలకొంది.
తొలి విడుత భూసేకరణ జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. మూడేళ్లలో అభివృద్ధి గ్యారంటీ అని మీరు రాసిస్తారా? చట్టబద్ధత ఎక్కడ? అభివృద్ధి ఏది? అని నిలదీశారు. అందుకు తెనాలి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ స్పందిస్తూ.. అమరావతి చట్టం ఉంది. అభివృద్ధి కోసం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా. మూడేళ్లలో అభివృద్ధి జరగకపోతే కోర్టుకు వెళ్లొచ్చని తెలిపారు.

అభివృద్ధి చేయకపోతే ప్రతి ఏటా ఎకరానికి రూ.5లక్షలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2014లో మీ మాటల్ని నమ్మి 50వేలమంది రైతులు ఎకరాలకు ఎకరాలు భూములు ఇచ్చారు. భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాట్లు అభివృద్ధి చేసి ఇచ్చారా?.అయినా, మీరు చెప్పేది మాకు అనవసరం. మా భూములను అభివృద్ధి చేశారా?.అభివృద్ధి చేస్తామని చెప్పడం కాదు. అగ్రిమెంట్‌లో పెట్టండి..అమరావతి రైతుల బతుకు అరణ్య రోదనగా మారింది. సంచార జాతుల్లా మేం రాష్ట్రం అంతా తిరుగుతున్నాం. మూడేళ్లలో అభివృద్ధి చేయకుంటే ఏం పరిహారం ఇస్తారో చెప్పండి. మా డిమాండ్‌లకు అంగీకరించి అడుగు ముందుకు వేయాలి’ అని స్పష్టం చేశారు.


