అరటి రైతు ఆశలు గెల్లంతు | Farmers Face Difficulties Due To Falling Crop Prices In Ap | Sakshi
Sakshi News home page

అరటి రైతు ఆశలు గెల్లంతు

Nov 22 2025 3:50 AM | Updated on Nov 22 2025 3:59 AM

Farmers Face Difficulties Due To Falling Crop Prices In Ap

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో రైతులు పడేసిన అరటి గెలలను మేస్తున్న పశువులు

పంట ధరలు దారుణంగా పతనంతో కుదేలైన అన్నదాతలు

టన్ను రూ.500.. అంటే కేజీ అర్ధ రూపాయికి పడిపోయిన వైనం 

ఎకరాకు రూ.లక్షన్నర పెట్టుబడి.. రూ.15 వేలు రావడమూ కష్టమే 

మూడేళ్లుగా టన్ను రూ.25 వేలు.. ప్రస్తుతం రూ.వెయ్యి లోపే..

ధర అమాంతం పడిపోతున్న పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం  

సాక్షి, అమరావతి, నెట్‌వర్క్‌: కంటికి రెప్పగా సాకిన పంటను అరటి రైతు ట్రాక్టర్‌తో దున్నేస్తున్నాడు..! కన్నబిడ్డలా పెంచిన తోటను తమ చేతులతోనే తొలగిస్తున్నాడు..! చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతతో సంక్షోభంలో చిక్కుకొని విలవిల్లాడుతున్నాడు..! అనంత రైతు ఆక్రందన వ్యక్తం చేస్తుంటే... అన్నమయ్య జిల్లా రైతు అల్లాడుతున్నాడు..! వైఎస్సార్‌ కడప రైతు కుదేలవుతుండగా.. నంద్యాల రైతు నిలువునా మునిగిపోయామని వాపోతున్నాడు..! సర్కారు పట్టించుకోకపోవడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో ఎగుమతులు నిలిచిపోయి అరటి రైతు మొత్తానికి దివాళా తీసే పరిస్థితిలో ఉన్నాడు.

అరటి ఒక్కటే కాదు... రాష్ట్రంలో దాదాపు ఏడాదిన్నరగా పంట ఏదైనా అన్నదాతకు మిగులుతున్నది ఆక్రందనే! వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి, కంది, టమాట, కొబ్బరి, వేరుశనగ, మామిడి, ఉల్లి, సజ్జ.. ఆలా పంట ఏదైనా సరే రైతుల పరిస్థితి అగమ్య గోచరమే. మద్దతు ధర మాటే లేదు.. ప్రభుత్వం ఆదుకున్న పాపాన పోలేదు. ప్రస్తుతం అరటి రైతు పరిస్థితి అయితే అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా మారింది. పెట్టుబడులూ రాని దైన్యంలో ఉన్నారు. రైతులకు భరోసాగా నిలవాల్సిన చంద్రబాబు సర్కార్‌ ఆ ఆలోచనే చేయడం లేదు. కనీసం మార్కెటింగ్‌ కల్పించే ప్రయత్నం చేయడం లేదు.

          పశువులకు వదిలేసిన అరటి తోట   

తోటలు టిల్లర్లుతో దున్నేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. ఇలాంటి సమయంలో అన్నదాతలను ఆదుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరతీసింది. రైతన్నా మీ కోసం.. పంచ సూత్రాలు అంటూ మభ్యపుచ్చే ఎత్తుగడలు వేస్తోంది. దీంతో ఇదేనా? కాలర్‌ ఎగరేసుకునేలా చేయడం అని రైతులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌లో అన్నదాత ఆవేదన వెలుగులోకి వచ్చింది. వైఎస్సార్‌ కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో ఏ పల్లెకు వెళ్లినా అరటి రైతుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది.

రూ.లక్షలు ఖర్చు చేసి సాగుచేసిన పంటను కొనేవారు లేక దున్నేస్తున్న ఘటనలు దర్శనమిస్తున్నాయి. అరటికే కాదు.. మొన్నటికి మొన్న మామిడి, ఆ తర్వాత ఉల్లి, టమాట, మొక్కజొన్న ఇలా పంటలన్నీ మద్దతు ధరలు లేక చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దున్నేస్తున్న పరిస్థితులు కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే నెలకొన్నాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

‘అనంత’ రైతన్న ఆక్రందన.. 
చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో అనంతపురం జిల్లా నుంచి అరటి ఎగుమతులు నిలిచిపోయాయి. వ్యాపారులు అరటి తోటల వైపు కన్నెత్తి చూడకపోవడంతో దళారులు చొరబడుతున్నారు. టన్నుకు రూ.వెయ్యిలోపే ఇస్తుండడంతో రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఎకరాకు రూ.లక్షన్నర పెట్టు­బడి పెడితే రూ.15 వేలు రావడం కూడా కష్టంగా ఉందని, కూలీల ఖర్చులూ వెళ్లడం లేదని వాపోతున్నారు.

అనంతపురం జిల్లాలో 40 వేల ఎకరాలలో అరటి సాగు చేస్తున్నారు. ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్షన్నర పెట్టుబడులు పె­ట్టా­రు. మూడేళ్లుగా టన్ను రూ.25 వేలు పలికిన ధర ఇప్పుడు ఒక్కసారిగా రూ.వెయ్యి లోపు పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లాలో ఈ ఏడాది అసాధారణ వాతా­వ­రణ పరిస్థితులు, తుపాను తదితర కారణాలతో అరటి పంటను తెగుళ్లు చుట్టుముట్టాయి. దీంతో ఎగుమతి చేసే కంపెనీలు కొనడం లేదు. ఇదే అదనుగా దళారులు రైతు­లను నట్టేట ముంచుతున్నారు. రైతుల నుంచి కేజీ రూపాయికి కొని మార్కెట్‌లో రూ.30–రూ.50కి అమ్ముతున్నారు.

అనంతపురం జిల్లా యాడికి వద్ద  అరటి గెలలను మేస్తున్న గొర్రెలు 

తోటల్లోనే మాగిపోతున్న గెలలు 
వైఎస్సార్‌ కడప జిల్లాలో 20,231 ఎకరాల్లో అరటి సాగులో ఉంది. పులివెందుల, వేంపల్లె, వేముల, లింగాల, సింహాద్రిపురం, కాశినాయన, మైదుకూరు మండలాల్లో సుమారు 16 వేల ఎకరాల్లో పంట చేశారు. ఈసారి అంచనాలకు తగ్గట్లు దిగుబడులున్నా పంటను అమ్మలేని దుస్థితి. విదేశాలకు ఎగుమతి నిలిచిపోగా ఉత్తరాది రాష్ట్రాల్లో డిమాండ్‌ లేదని వ్యాపారులు చెబుతున్నట్లు రైతులు తెలిపారు. అన్నమయ్య జిల్లాలో మామిడి రైతులు సీజన్‌లో ధరలు లేక అల్లాడిపోగా ప్రస్తుతం అరటి రైతులు కడగండ్లు ఎదుర్కొంటున్నారు. టన్ను రూ.2–4 వేల లోపే అంటుండడంతో ఏంచేయాలో పాలుపోక పడరాని కష్టాలు పడుతున్నారు.

జిల్లాలో 12 వేల ఎకరాలకు పైగా పంట సాగులో ఉండగా 9 వేల ఎకరాల్లో మొదటి, రెండు, మూడో క్రాప్‌ కోతకు సిద్ధంగా ఉంది. 20 రోజులుగా ధరలు గణనీయంగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజంపేట, రైల్వేకోడూరు నుంచి నిత్యం నాందేడ్, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాలకు పదుల సంఖ్యలో లారీల్లో లోడు  వెళ్లేవి. ప్రస్తుతం ధరలు లేకపోవడంతో లారీలు రైల్వేకోడూరులో పక్కన పెట్టేశారు. వైఎస్సార్‌ సీపీ హయాంలో రూ.15–18 వేల వరకు ధరలు పలకగా ప్రస్తుతం టన్ను అరటి రూ.2–4 వేలకు పడిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. కొనేవారు లేక  తోటల్లో చెట్లపైనే కాయలు 
మాగుతున్నాయి. 

అర్థ రూపాయికే కిలో  
నంద్యాల జిల్లాలో ఉద్యానశాఖ లెక్కల ప్రకారం 40 వేల ఎకరాల్లో అరటి సాగు అవుతోంది. ఎకరాకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షలు ఖర్చు చేశారు. గతంలో గెలల చొప్పున విక్రయించగా ఇటీవల కిలోల్లో అమ్ముతున్నారు. మొన్నటివరకు విజయవాడ, గుంటూరు, వినుకొండ తదితర చోట్లకు   ఎగుమతులు అధికంగా ఉండేవి. ప్రస్తుతం అడిగేవారు లేకపోవడంతో భువనేశ్వర్, ఒడిశా, బిహార్‌కు తరలిస్తున్నారు. అంతదూరం తరలిస్తే రైతులకు మిగిలేది శూన్యమేనని వాపోతున్నారు. ప్రస్తుతం కేజీ అర్థ రూపాయి (టన్ను రూ.500)కి పడిపోయింది. దీంతో రైతులు తోటలను దున్ని వేస్తున్నారు.      

ఉల్లితో మొదలైన ధరల పతనం.. 
ఈ సీజన్‌లో ఉల్లితో మొదలైన ధరల పతనం అరటి వరకు కొనసాగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ధరల స్థిరీకరణ నిధి ద్వారా మార్కెట్‌లో జోక్యం చేసుకుని వ్యాపారులతో పోటీపడి ధరలు పడిపోయిన పంట ఉత్పత్తులను కొను గోలు చేసి మద్దతు ధర­లు దక్కేలా చేయడంలో ఘోరంగా విఫలమైంది. మొక్కు­బడి సమీక్షలతో సరిపెట్టడం తప్ప రైతులను ఆదుకునే దిశగా అడుగు కూడా వేయని దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది.

ప్రత్యేక రైలు నిలిచిపోయింది..
వైఎస్‌ జగన్‌ హయాంలో అరటి ఎగుమతుల కోసం ప్రత్యేకంగా అనంతపురం నుంచి ముంబైకు ఏటా ప్రత్యేక రైళ్లు నడిపితే.. చంద్రబాబు సర్కార్‌ వచ్చాక ఒక్క రైలు కూడా నడపలేని దుస్థితి. వైఎస్‌ జగన్‌ హయాంలో టన్ను రూ.30 వేలకుపైగా పలకగా, నేడు రూ.వెయ్యికి కూడా కొనేవారు లేక తోటలను రైతులు దున్నేస్తున్న పరిస్థితి నెలకొంది.

18 నెలలుగా అన్నదాత గుండెకోత 
అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ సూపర్‌ సిక్స్‌లో ఇచి్చన హామీకి తూట్లు పొడుస్తూ తొలి ఏడాది నిస్సిగ్గుగా ఎగ్గొట్టారు సీఎం చంద్రబాబు. కనీసం ఈ ఏడాదైనా పూర్తి స్థాయిలో ఇస్తారనుకుంటే అదీ లేదు. అడ్డగోలు కోతలు పెడుతూ అరకొరగా విదిల్చి ఏడు లక్షల మందికి ఎగనామం పెట్టారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు పైసా భారం పడకుండా నోటిఫై చేసిన ప్రతి పంటకు సాగు చేసిన ప్రతి ఎకరాకు యూనివర్శల్‌ కవరేజీ కల్పిస్తూ అండగా నిలిచిన ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం వచ్చీరాగానే అటకెక్కించేసింది. మరోపక్క వరుస వైపరీత్యాల వల్ల లక్షలాది ఏకరాల్లో పంటలు దెబ్బతిన్న రైతులకు కనీసం ఇన్‌పుట్‌ సబ్సిడీ (పంట నష్టపరిహారం) సకాలంలో ఇవ్వడంలో చేతులెత్తేసింది. మద్దతు ధరకు కొనేవారు లేక రూ.వేల కోట్ల పెట్టుబడులు నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతూ వందలాది మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఆదుకున్న దాఖలాలు లేవు.

వైఎస్‌ జగన్‌ హయాంలో అరటి రైతుకు మహర్దశ
వైఎస్‌ జగన్‌ హయాంలో అరటి రైతుకు సువర్ణ యుగమనే చెప్పాలి. నాణ్యమైన దిగుబడులు లక్ష్యంగా ఏటా ఫ్రూట్‌ కేర్‌ యాక్టివిటీస్‌ను ప్రోత్సహిస్తూ సబ్సిడీపై కవర్లు ఇవ్వడమే కాదు. తోట బడుల ద్వారా వ్యవసాయ క్షేత్రాల వద్దే ప్రి ప్రాసెసింగ్‌ టెక్నిక్స్‌పై అరటి రైతులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అరటికి ప్రత్యేక మద్దతు ధర ప్రకటించడమే కాదు. ధరలు పతనం కాకుండా ప్రతి ఏటా పంట మార్కెట్‌కు వచ్చే ముందే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రైతులకు అండగా నిలిచారు. వ్యాపారులతో పాటు ఎగుమతిదారులతో రైతులను అనుసంధానం చేసి మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పించేవారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విదేశాలకు ఎగుమతి కోసం తాడిపత్రి నుంచి ముంబైకు ప్రత్యేకంగా ఏటా కిసాన్‌ రైళ్లు నడిపారు.

ఫలితంగా ఐదేళ్లలో ఏ ఒక్క ఏడాది ధరలు పతనం కాలేదు. రాష్ట్రంలో 2018–19లో 1.75 లక్షల ఎకరాల్లో సాగవుతూ 45 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. అలాంటిది 2019–24 మధ్య  వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో విస్తీర్ణం 2.74 లక్షల ఎకరాలకు పెరగగా, దిగుబడులు 70 లక్షల టన్నులకు చేరాయి. ఎగుమతులైతే 2014–19 మధ్య 23 వేల టన్నులు జరిగితే.. 2019–24 కాలంలో ఏకంగా 3 లక్షల టన్నులు దాటాయి.

సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, బహ్రెయిన్, యూఏఈ, యూరోప్‌ దేశాలతో పాటు అమెరికాకు సైతం ఎగుమతయ్యాయి. 2018–19లో టన్ను రూ.5వేలకు మించని ధర 2023–24లో ఏకంగా రూ.30 వేలకు పైగా పలికింది. నాడు ఐదేళ్లలో అరటి సాగు, దిగుబడులు, ఎగుమతుల్లో ఏపీ సాధించిన ప్రగతిని గుర్తిస్తూ బనానా ఎక్స్‌పోర్టు ప్రమోషన్‌ అవార్డు–2020, ది బెస్ట్‌ స్టేట్‌ ఇన్‌ బనానా అవార్డు–2022 వంటి ఎన్నో అవార్డులు ఏపీని వరించడం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా పేర్కొనవచ్చు.

కొబ్బరి ధర.. మరింత దిగజారి..
సాక్షి, అమలాపురం/అంబాజీపేట: కొబ్బరి ధరలు రోజురోజుకు పతనమవుతున్నాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేట మార్కెట్‌లో నెల వ్యవధిలో పచ్చి కొబ్బరి వెయ్యి కాయల ధర రూ.9 వేల వరకు తగ్గింది. గత నెలలో ఇదే సమయంలో రూ.23 వేలు–రూ.25 వేలు ఉంది. సెపె్టంబర్‌లో రూ.28 వేల దాక పలికింది. కానీ, గత వారం రూ.19 వేలకు, ఇప్పుడు రూ.16 వేలకు పడిపోయింది. పండగలు పూర్తి కావడం, తమిళనాడు, కేరళలో కొబ్బరి దిగుబడి పెరగడంతో మన పంటకు డిమాండ్‌ తగ్గింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధరలు పడిపోయి, ఎగుమతులు తగ్గడంతో కాయల రాశులు పేరుకుపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. చలికాలంలో ఇతర రాష్ట్రాల్లో ఆలయాలకు వెళ్లే భక్తుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఇక సంక్రాంతి వరకు పండగల సీజన్‌ లేకపోవడంతో రైతుల్లో గుబులు పట్టుకుంది.

        కోనసీమ జిల్లా రైతుల వద్ద పేరుకుపోయిన కొబ్బరి   

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 1.80 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతుండగా, ప్రస్తుతం సగటున దింపునకు (45 రోజులకు) 14 కోట్ల కాయలు దిగుబడిగా వస్తోందని, రోజుకు 30 లారీల వరకు ఎగుమతి జరుగుతోందని అంచనా. సెపె్టంబరులో ఇది 90 లారీల వరకూ ఉండేది.

ధరల పతనం ప్రభావం కురిడీ కొబ్బరిపై కూడా కనిపిస్తోంది. గత నెల కన్నా కురిడీ కొబ్బరి పాత కాయలో గండేరా (పెద్దకాయ), గటగట (చిన్నకాయ) ధరలు రూ.వెయ్యి చొప్పున తగ్గాయి. రూ.30 వేలు ఉన్న గండేరా రకం రూ.29 వేలు, గటగటా రూ.28 వేల నుంచి రూ.27 వేలకు తగ్గింది. కొత్త కాయలు రూ.29 వేలు ఉన్న గండేరా రకం  రూ.27,500కు, రూ.27 వేలున్న గండేరా రకం ధర రూ.25 వేలకు పడిపోయాయి. కొత్త కాయ కురిడీ రకం రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు తగ్గడం గమనార్హం. ‘‘దిగుబడి ఆశాజనకంగా ఉన్న సమయంలో మార్కెట్‌లో ధరలు ఒక్కసారిగా తగ్గాయి.  మంచి ధర వస్తుందనే ఆశతో నిల్వ చేసిన మాలాంటి రైతులం నష్టపోతున్నారు’’ అని  పోతవరం గ్రామానికి చెందిన రైతు పాటి శేఖర్‌ వాపోయాడు.

ధర లేక, వ్యాపారులూ రాక 8 ఎకరాల్లో అరటి తొలగించా
నాకున్న 20 ఎకరాలలో 14 ఎకరాల్లో అరటి సాగు చేశా. ఎకరాకు రూ.1.20 లక్షల చొప్పున రూ.16 లక్షలు పెట్టుబడి పెట్టా. దిగుబడి బాగా రావడంతో ఆశలు పెట్టుకున్నా. కానీ, కోతకు వచ్చే సమయానికి మార్కెట్‌లో ధరలు పడి పోయాయి. వ్యాపారులు తోటల వైపే రావడం లేదు. టన్ను రూ.1,500కు ఇస్తామన్నా ఆసక్తి చూపడం లేదు. ధర లేక, వ్యాపారులూ రాక 8 ఎకరాల్లో అరటి పంట తొలగించా. 6 ఎకరాలలో నెల రోజుల్లో పంట కోతకు రానుంది. అప్పటికైనా ధర దక్కు తుందన్న ఆశ లేదు. ఇప్పటికే రూ.15 లక్షల మేర నష్టపోయా. 15 ఏళ్లుగా అరటి సాగు చేస్తున్నా  ఇంతటి అధ్వాన పరిస్థితి ఎన్నడూ చూడలేదు.
– ఓబుళరెడ్డి రామచంద్రారెడ్డి, వేముల మండలం భూమయ్యగారిపల్లె, వైఎస్సార్‌ కడప

తెగనమ్ముదామని చూస్తున్నా ఎవరూ రావడం లేదు
ఆరు ఎకరాలలో అరటి సాగు చేశా. ఎకరాకు రూ.1.30 లక్షల మేర రూ.8 లక్షల వరకు ఖర్చు చేశా. దిగుబడి ఎకరానికి 25 టన్నులు తక్కువ ఉండదనుకున్నా. ధరలు పూర్తిగా పడిపోయాయి. కాయలు మాగితే నష్టపోతామని ఉన్న రేటుకే అమ్ముదామని చూస్తున్నా... అరటి గెలల కొనుగోలుకు వ్యాపారులు దరిదాపులకు కూడా రావడం లేదు. 
– కల్లూరు ఓబుళరెడ్డి, వైఎస్సార్‌ కడప వేల్పుల గ్రామం, వైఎస్సార్‌ కడప

పెట్టుబడులు కూడా వచ్చేలా లేదు
నాలుగు ఎకరాల్లో అరటి సాగు చేశా. పెట్టుబడులు కూడా లభించే పరిస్థితి లేదు. నా ఆశలు గల్లంతయ్యాయి. మా అబ్బ (తాత), నాన్న కూడా అరటి­నే పండించారు. 30 ఏళ్లుగా ఈ పంటనే నమ్ముకుని ఉన్నాం. గతంలో పులివెందుల అరటిని విదేశాలకు ఎగుమతి చేసేవారు. ఇప్పడు అసలు రైతుల వద్దకు వచ్చి వ్యాపారులు కొనే పరిస్థితి లేదు. ధర లేక చాలామంది  తోటలోనే కాయలను వదిలేస్తున్నారు. పరిస్థితులు చూస్తుంటే కడుపు మండిపోతోంది.
– ప్రసాద్, నల్లపురెడ్డిపల్లె గ్రామం, పులివెందుల మండలం, వైఎస్సార్‌ కడప

పరిస్థితి అత్యంత దయనీయం 
గత 25 ఏళ్ల నుంచి 5 ఎకరాలలో అరటి పండిస్తున్నా. ఎకరాకు రూ.లక్ష ఖర్చు పెట్టా. కానీ, పరిస్థితి దయనీయంగా ఉంది. గతంలో టన్ను రూ.30 వేలు కూడా పలికింది. ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం టన్ను రూ.1,500–రూ.2,500 మాత్రమే ఉంది. పెట్టుబడులూ రావడం లేదు.
– విష్ణు, నల్లపురెడ్డిపల్లె, పులివెందుల మండలం, వైఎస్సార్‌ కడప

రూ.20 లక్షల ఆదాయం ఊహిస్తే పెట్టుబడీ వచ్చేలా లేదు
పది ఎకరాలలో ఏడేళ్లుగా అరటి సాగు చేస్తున్నా. పెట్టుబడికి రూ.లక్షలు అయింది. కానీ,  పంటను అడిగే నాథుడు లేడు. టన్ను రూ.3 వేలకు కూడా అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. కరోనా సమయంలోనూ ఇలాంటి పరిస్థితి లేదు. పంట అమ్మితే రూ.20 లక్షలపైన ఆదాయం వస్తుందని అనుకుంటే, పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు.
– కుమ్మెత నాగార్జునరెడ్డి, లింగాల, వైఎస్సార్‌ కడప

చీనీ తీసేసి మరీ అరటి వేశాను.. మునిగిపోయాను
ఏడు ఎకరాలలో చీనీ తొలగించి అరటి సాగు చేశా­ను. కానీ, దానికంటే దారుణంగా నష్టపోయాను. గత మూడేళ్లు అరటికి మంచి ధరలు రావడంతో ఈ పంట వైపు మొగ్గాను. కానీ, ఈ ఏడాది ధరలు భారీగా పతనమయ్యాయి. పంటను అమ్ముకునేందుకు వ్యాపారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. తీవ్రంగా నష్టపోతున్నాం. ఇలాంటి దారుణ పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు.
– అలవలపాటి నాగేశ్వర్‌రెడ్డి, లింగాల, వైఎస్సార్‌ కడప

కనీసం కౌలు కూడా వచ్చేలా లేదు..
పొలాలు కౌలుకు తీసుకుని అరటి సాగు చేస్తున్నా. సుమారు 30 వేల అరటి చెట్లు వేశా. మార్కెట్‌లో ధరలు చూస్తే పెట్టుబడుల మాట దేవుడెరుగు, కనీ­స కౌలు కూడా వచ్చేలా లేదు. కష్టపడి పండిస్తే తు­ఫాను, అకాల వర్షాలు మరింత నష్టం కలిగించాయి. 
– గాజుల నాగయ్య, అబ్బీపురం, మహానంది, నంద్యాల జిల్లా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement