ఇండోనేషియాలో తీరం దాటిన ‘సెనియార్’
మరోవైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి సెనియార్ తుపాన్ ముప్పు తప్పింది. అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం.. క్రమంగా ఇండోనేషియా వైపు కదులుతూ బుధవారం తుపాన్‌గా మారి తీరం దాటింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు మినహా ఎటువంటి ప్రభావం ఉండదని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ శ్రీలంక, హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం అక్కడే కొనసాగుతోంది.
అలాగే ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని.. ఆ తర్వాత 48 గంటల్లో తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు కదులుతూ బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.


