ఏపీటీడీసీ రెగ్యులర్ ఉద్యోగుల సేవలను దూరం పెట్టిన సర్కార్
డిప్యుటేషన్ మీద వచ్చినవారికి, కన్సల్టెంట్లకే పట్టం
పర్యాటక ఆస్తులను అమ్మేయడమే లక్ష్యంగా కుట్ర
ప్రభుత్వం ఆర్డర్ లేకుండా ఏడాదిగా ఉన్నతస్థాయిలో కొనసాగుతున్న అధికారి
నిబంధనలకు విరుద్ధంగా ట్రెజరీ నుంచి జీతాలు
30 మందికిపైనే కన్సల్టెంట్లు
పెట్టుబడుల కోసం ప్రత్యేకంగా ఇద్దరికి ఏకంగా ఏడాదికి రూ.కోటి సమర్పణ
ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన ఐదుగురు కన్సల్టెంట్లకు రూ.3.5 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర పర్యాటకశాఖ ప్రైవేటు కన్సల్టెంట్లు, డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న అధికారుల హస్తాల్లో విలవిల్లాడుతోంది. పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ), ఏపీ పర్యాటక ప్రాధికార సంస్థ (ఆప్టా)లోను వారి హవానే సాగుతోంది. ఏపీటీడీసీ రెగ్యులర్ ఉద్యోగులను ప్రధాన కార్యాలయం నుంచి బదిలీ పేరుతో బయటకు పంపించడమే కాకుండా డిప్యుటేషన్, కన్సల్టెంట్ ఉద్యోగులతో కార్యకలాపాలు సాగిస్తూ ఇష్టారీతిన వ్యవహారాలు కొనసాగించడం పరిపాటిగా మారిపోయింది.
వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా పర్యాటక ఆస్తులను ప్రైవేటుపరం చేసేందుకు చకచకా పావులు కదిపింది. దీనికోసం ప్రత్యేకంగా కన్సల్టెంట్ల వ్యవస్థతో పాటు పాలకులు చెప్పినట్టు వినే అధికారులను డిప్యుటేషన్లపై ఏపీటీడీసీ, ఆప్టాలో నియమించి అడ్డగోలు దోపిడీకి తెగబడుతోంది. పర్యాటకశాఖలో 30 మందికిపైనే కన్సల్టెంట్లు పనిచేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది.
ఆప్టా ఉద్యోగులకు మొండిచెయ్యి
ఆప్టాలో ఓ ప్రైవేటు ఏజెన్సీకి చెందిన ఐదుగురు కన్సల్టెంట్లు, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఏపీయూఐఏఎంఎల్) నుంచి మరో ఆరుగురు కన్సల్టెంట్లు పనిచేస్తున్నారు. వీరికి ఏడాదికి ఏకంగా రూ.5 కోట్ల వరకు చెల్లిస్తోంది. అంతటితో ఆగకుండా ప్రత్యేకంగా పెట్టుబడులను తీసుకొచ్చేందుకు ఇద్దరు కన్సల్టెంట్లను ఏకంగా ఏడాదికి రూ.కోటి వరకు చెల్లించే ప్రాతిపదికపై తీసుకొచ్చింది. వీరితోపాటు ఆప్టా, ఏపీటీడీసీల్లో ఉద్యోగ విరమణ చేసిన 18 మందిని ఆన్‌రోల్ కన్సల్టెంట్ కింద చేర్చుకుంది.
ఆప్టాలో అయితే పొరుగు శాఖల నుంచి వచ్చిన వ్యక్తులే ఏళ్లుగా తిష్టవేసి ఉద్యోగులను శాసించేస్థాయికి వెళ్లిపోయారు. ఇటీవల ఆప్టాకు శాశ్వత ఉద్యోగి పదవీ విరమణ దగ్గరకు వస్తున్న తరుణంలో తన సేవలను గుర్తిస్తూ పదోన్నతి కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించుకోగా.. డిప్యుటేషన్‌పై ఆప్టాలో పనిచేస్తున్న అధికారులు అడ్డుచెప్పడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆడిట్ శాఖకు చెందిన ఓ అధికారి పర్యాటకశాఖ అనుమతి లేకపోయినా ఏళ్లతరబడి ఆప్టాలో డైరెక్టర్ హోదాలో కొనసాగుతున్నారు.
డిప్యుటేషన్ కొనసాగింపు ఆర్డర్ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా తన పై అధికారి సాయంతో ట్రెజరీ నుంచి జీతం తీసుకుంటూ ఆప్టా ఉద్యోగులపైనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. గత జూన్‌లో ప్రమోషన్లు ఇవ్వాల్సి ఉండగా వాటిని అడ్డుకున్న సదరు అధికారి పదవీ విరమణ చేస్తున్న ఆప్టా ఉద్యోగి కి ప్రమోషన్ ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించవని చెప్పడం గమనార్హం. పైగా ఆ అధికారికి ఇన్నేళ్లు ఆర్డర్ లేకుండా పని చేస్తుండటంపై పర్యాటక శాఖ మెమో కూడా జారీ చేసింది.
అనధికారిక డిప్యూటీ సీఈవో..
ఆప్టాకు సీఈవోగా ఏపీటీడీసీ ఎండీ వ్యవహరిస్తారు. సీఈవోకు అనుబంధంగా డిప్యూటీ సీఈవో కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆప్టాలో కన్సల్టెంట్ల ‘ప్రభ’ దేదీప్యమానంగా వెలుగుతోంది. ఎంతగా అంటే.. సదరు కన్సల్టెంట్ అనధికారిక డిప్యూటీ సీఈవోగా చలామణి అవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం కన్సల్టెంట్లకు ఎక్కడా లేనివిధంగా కీలకమైన పర్యాటక ఆస్తుల పర్యవేక్షణ, నిర్వహణలో ఫ్రీహోల్డ్ ఇచ్చేసింది. దీంతో ఆ కన్సల్టెంట్ ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది.
ఆప్టాతో పాటు ఏపీటీడీసీ అధికారులకు సైతం పెట్టుబడులకు సంబంధించి కనీస సమాచారం కూడా ఇవ్వడంలేదు. ఆ కన్సల్టెంట్ తీసుకొచ్చినవాళ్లే పెట్టుబడిదారులు.. తాను తయారు చేసిందే డీపీఆర్. ఇందులో వాస్తవాలతో పనిలేదు. ప్రభుత్వానికి కాగితాలపై లెక్కలు చూపించి రూ.కోట్ల విలువైన భూములను అప్పనంగా పంచిపెట్టడమే సదరు కన్సల్టెంట్ ప్రధాన విధి. అందుకే 2014–19 మధ్య ఆప్టాలో ఓ వెలుగు వెలిగిన ఆ కన్సల్టెంట్ మళ్లీ 2024లో చంద్రబాబు సర్కార్ రాగానే వాలిపోయారు.
తాజాగా సీఐఐ సదస్సులో పర్యాటకశాఖకు 104 ఎంవోయూల్లో రూ.17,973 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు గొప్పగా ప్రకటించారు. కానీ పెట్టుబడిదారుల వివరాలను మాత్రం ఇప్పటికీ బయటపెట్టడం లేదు. ఎందుకంటే ఆ పెట్టుబడిదారుల జాబితాలో చెప్పుకోదగ్గ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు లేవు. మొత్తం పెట్టుబడిదారుల్లో 95 శాతానికిపైగా ఏపీలోని వివిధ ప్రాంతాల వారే. వారి పేర్లతో ఎంవోయూలు చేసుకోవడం గమనార్హం. దీనివెనుక సదరు కన్సల్టెంట్ చక్రం తిప్పినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ఏపీటీడీసీలోనూ అంతే
ఏపీటీడీసీలోని కీలక విభాగాల్లో జీఎం స్థాయిలో ఒక్కరు కూడా శాశ్వత ఉద్యోగులు లేరంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. కనీసం ఈడీ స్థాయిలో పనిచేస్తున్న ఓ అధికారికి ఏడాది కిందట డిప్యుటేషన్ ముగిసింది. అయినా ఇప్పటివరకు పొడిగింపు ఆర్డర్ లేకుండానే కొనసాగుతున్నారు. పైగా నిబంధనలకు విరుద్ధంగా నెలనెలా జీతం తీసుకోవడం, శాశ్వత ఉద్యోగులను చిన్నచూపు చూస్తుండటం ఏపీటీడీసీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. కీలకమైన ఆర్థిక వ్యవహారాలను ఆప్టాలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న అధికారికి అప్పగించడం విచిత్రంగా ఉంది.
పైగా ఆరు క్లస్టర్ల ద్వారా 22 హరిత హోటళ్లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్న తరుణంలో ఏపీటీడీసీ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వాస్తవానికి స్వయం సమృద్ధి సాధించడం ద్వారా సింహభాగం ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చులను ఏపీటీడీసీ ఆదాయం నుంచే భరించేది. ప్రభుత్వం నుంచి మాత్రం ఏటా సుమారు రూ.2.50 కోట్ల వరకు కేటాయింపులు ఉండేవి. కానీ ఈసారి బడ్జెట్‌లో కేటాయింపులను ప్రభుత్వం రూ.64 లక్షలకు కుదించేసింది. తద్వారా ఏపీటీడీసీని వ్యూహాత్మకంగా దెబ్బతీసేలా వ్యవహరిస్తోంది.


