పీపీపీలో ప్రాజెక్టులకు కట్టబెట్టేందుకు ప్రణాళిక
ప్రైవేటు సంస్థలకు వయబులిటీ గ్యాప్ ఫండింగ్ రూ.2 వేలకోట్లు
18 యూడీఏల్లో ప్రభుత్వ భూములకు రెక్కలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ)లో ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఈ విధానాన్ని మున్సిపాలిటీలకు విస్తరించింది. విలువైన 1,300 ఎకరాల భూములను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. భూములతోపాటు కంపెనీల యాజమాన్యాలకు ప్రస్తుత బడ్జెట్‌లో రూ.2 వేల కోట్ల వయబులిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నట్టు ప్రకటించింది.
రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో నీటిసరఫరా ప్రాజెక్టులు, రవాణా నెట్‌వర్క్, హౌసింగ్ తదితర 12 రకాల మౌలిక సదుపాయాలను కల్పించాలంటే 2029 నాటికి రూ.66,523 కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని, ఈ లక్ష్యాలను చేరుకునేందుకు పీపీపీని అమలు చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ విధానంలో 2.30 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని ప్రకటించింది. ప్రైవేటు సంస్థలకు వేల ఎకరాల భూములను కట్టబెట్టడంతోపాటు వయబులిటీ ఫండింగ్ ఇవ్వడాన్ని చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా చెబుతోంది.
నిరుపయోగం పేరుతో నేతలకు ధారాదత్తం
పట్టణప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూమిని అనుయాయులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కారు స్కెచ్ వేసింది. ఈ భూములను వాణిజ్యపరంగా లాభదాయకంగా మార్చేందుకని కలరింగ్ ఇచ్చి రాష్ట్రంలోని అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(యూడీఏ)ల ద్వారా అమలుచేస్తున్న ల్యాండ్ మానిటైజేషన్ ప్రోగ్రామ్‌తో అప్పగించేందుకు సిద్ధమైంది. మొత్తం 18 యూడీఏల్లో 73 ల్యాండ్ పార్సిల్స్‌లో 1,300 ఎకరాలను ఇప్పటికే గుర్తించారు.
ఈ భూములు నిరుపయోగంగా ఉన్నాయని తేల్చారు. ఇప్పటికే నాలుగు యూడీఏల్లో ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) జారీచేశారు. మిగిలిన వాటికి త్వరలో ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. పీపీపీ విధానంలో పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయవచ్చని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చని, ఈ విధానం దేశంలో పట్టణాభివృద్ధిలో రాష్ట్రాన్ని నిలబెడతాయని పేర్కొనడం గమనార్హం.
ట్యాక్స్ బాదుడికి రంగం సిద్ధమైనట్టే?
మున్సిపాలిటీలు, పంచాయతీల్లో రోడ్లు, రవాణాను పీపీపీ విధానంలో ప్రైవేటుకు అప్పగిస్తే ప్రభుత్వంపై ఆరి్థకభారం ఉండదని గతంలో అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రైవేటు సంస్థలు రోడ్లు వేసి ట్యాక్స్ వసూలు చేసుకోవచ్చన్నారు. ఇప్పుడు ఈ పీపీపీ విధానాన్ని మున్సిపాలిటీలకు ఆపాదించి అమల్లోకి తెచ్చినట్టయింది. ప్రజలకు తాగునీటి సరఫరా, రోడ్లు, విద్య వంటి సదుపాయాలు ఉచితంగా ప్రభుత్వం కల్పించాలి.
కానీ అందుకు విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రస్తుతం ప్రకటించిన నీటిసరఫరా, రవాణా, హౌసింగ్ తదితర 12 రకాల మౌలిక సదుపాయాలను ప్రైవేటుకు కట్టబెడుతోంది. దీంతో వీటిపై ప్రజల నుంచి పన్ను వసూలుకు ఆయా సంస్థలకు అధికారం ఇచ్చినట్టేనని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పీపీపీ విధానం: ముఖ్య కార్యదర్శి
పట్టణ ప్రాంతాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి, జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త ఆర్థిక మండలాల్లో రూ.35 వేలకోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఇందులో భాగంగా మున్సిపల్‌శాఖలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంపై సమగ్ర పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను ఖరారు చేసినట్టు ఆయన తెలిపారు.


