
సాధారణం కంటే అధిక వర్షపాతం: ఐఎండీ
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఇప్పటికే దేశంలోకి ప్రవేశించాయి. రోజురోజుకీ విస్తరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. జూన్ నెలలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) మంగళవారం తెలియజేసింది. దేశంలో దీర్ఘకాల సగటు వర్షపాతం 166.9 మిల్లీమీటర్లు కాగా, వచ్చే నెలలో అంతకంటే 108 శాతం అధిక వర్షం కురిసే పరిస్థితులు ఉన్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్ చెప్పారు.
దేశవ్యాప్తంగా సాధారణం నుంచి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈశాన్య, వాయవ్య, దక్షిణ భారతదేశంలో సాధారణం కంటే వర్షపాతం నమోదు కావొచ్చని పేర్కొన్నారు. వర్షాల కారణంగా ఈశాన్యం, వాయవ్య ప్రాంతాలు మినహా దేశమంతటా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం, అంతకంటే తక్కువగానే రికార్డు అవుతాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. సాధారణ వర్షపాతం 87 సెంటీమీటర్లు కాగా, ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ దాకా 106 శాతం అధిక వర్షపాతం నమోదయ్యే వీలుందని తెలిపారు.
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్‌ప్రదేశ్‌లో మంచి వర్షాలు కురుస్తాయని వివరించారు. పంజాబ్, హరియాణా, కేరళ, తమిళనాడుల్లో సాధారణ కంటే తక్కువ వర్షం పడుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. భారత్‌లో 2020లో 958 మిల్లీమీటర్లు, 2021లో 870, 2022లో 925, 2023లో 820, 2024లో 934.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.