ఎడారి దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం తెల్లవారుజామున ఉత్తర ప్రాంతాల్లోని రాస్ అల్ ఖైమా, అల్ రామ్స్ పరిసరాల్లో భారీగా వడగళ్ల వాన కురిసింది. అనేకచోట్ల రోడ్లన్నీ మంచు ముక్కలతో నిండిపోయాయి.
ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఉపరితల అల్పపీడన ప్రభావం వల్ల ఈ వడగళ్ల వర్షం కురిసినట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి.
జెబల్ జైస్ వంటి పర్వత ప్రాంతాల్లో అత్యల్పంగా 4.7°C ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం కూడా యూఏఈలోని ఉత్తర, తూర్పు ప్రాంతాలలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పొగమంచు కూడా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది.
దీంతో రోడ్లపై ప్రయాణించే వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా గత నెలలో కూడా యూఏఈలో కుండపోత వర్షాలు కురిశాయి. భారీ వర్షాల వల్ల.. అబుదాబీ, దుబాయ్‌తో పాటు నగరాల్లో జనజీవనం స్తంభించింది. కానీ ఇప్పుడు ఈ వడగళ్ల వానను అక్కడి ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు.


