సాక్షి,అమరావతి: సంక్రాంతి పండుగకు ముందు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో తుపాను ముప్పు నెలకొననుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడుతూ తుపానుగా మారే అవకాశం ఉందని సమాచారం. ఫలితంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
బంగాళాఖాతంలో వాయుగుండం క్రమంగా బలపడుతోంది. ఇది తుపానుగా మారి తీర ప్రాంతాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గాలుల వేగం గంటకు 60–100 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా. తుపాను కారణంగా ఉత్తర ఆంధ్ర తీర ప్రాంతాలు ఒడిశా తీర ప్రాంతాలు, తమిళనాడు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ సందర్భంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని సూచించారు.తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
1891–2024 మధ్యకాలంలో సంక్రాంతి సమయానికి 12 సార్లు తుపానులు ఏర్పడినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈసారి కూడా అదే తరహా పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. సంక్రాంతి పండుగకు ముందు తుపాను ముప్పు ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అధికారులు ఇప్పటికే అలర్ట్ జారీ చేసి, తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.


