8 రోజులు మృత్యువుతో పోరాడి.. | Excise constable Soumya dies | Sakshi
Sakshi News home page

8 రోజులు మృత్యువుతో పోరాడి..

Feb 1 2026 4:23 AM | Updated on Feb 1 2026 9:04 AM

Excise constable Soumya dies

ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి 

లక్డీకాపూల్‌ (హైదరాబాద్‌)/నిజామాబాద్‌ అర్బన్‌: ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్ను మూశారు. నిజామాబాద్‌లో గంజాయి స్మగ్లింగ్‌ ముఠాను అడ్డుకునే క్రమంలో దుండగులు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ గాజుల సౌమ్య (23)ను జనవరి 25న నిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి 9.41 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు. కాలేయం దెబ్బతినడం, మెదడులో వాపు కారణంగా ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితంలేకపోయింది.  

గంజాయి స్మగ్లింగ్‌ ముఠాను పట్టుకునే ప్రయత్నంలో.. 
జనవరి 23న గంజాయి సరఫరా చేస్తున్నారన్న సమాచారం మేరకు నిజామాబాద్‌ శివారులోని మాధవనగర్‌ వద్ద ఎక్సైజ్‌ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులను చూసిన గంజాయి స్మగ్లింగ్‌ ముఠా సభ్యులు పారిపోయేందుకు యత్నించారు. దీంతో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. 

అదే సమయంలో ముఠా సభ్యులు తమ కారుతో సౌమ్యను ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఎక్సైజ్‌ పోలీసులు ఆమెను హుటాహుటిన స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ఎనిమిది రోజులపాటు సౌమ్య ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడారు. బాసటగా నిలిచిన ఎక్సైజ్‌ అధికారులు దగ్గరుండి ఆమెకు చికిత్స చేయించారు. 

ఉన్నతాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు ఆమెను పరామర్శించారు. సౌమ్య చికిత్స కోసం ప్రభుత్వం రూ. 10 లక్షలు మంజూరు చేసింది. నిజామాబాద్‌ జిల్లా మోస్రాకు చెందిన సౌమ్యది సామాన్య కుటుంబం. 2024 సంవత్సరంలో సౌమ్య ఉద్యోగంలో చేరింది. అంతలోనే ఆమె మరణించడంతో కుటుంబీకులు గుండెలవిసేలా విలపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement