గత నెలలో రాజమౌళి-మహేశ్ బాబు సినిమా లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. 'వారణాసి' అని టైటిల్ ప్రకటించారు. మూడున్నర నిమిషాల ఓ వీడియోని కూడా రిలీజ్ చేశారు. అయితే దీన్ని హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఆవిష్కరిస్తారని అప్పుడు రూమర్స్ వచ్చాయి కానీ అదేం జరగలేదు. కానీ ఇప్పుడు రాజమౌళి-జేమ్స్ కామెరూన్ మధ్య 'వారణాసి' గురించి డిస్కషన్ నడిచింది. సెట్‌కి వచ్చి కెమెరా పట్టుకుని సీన్స్ తీస్తానని కామెరూన్ చెప్పడం విశేషం.
(ఇదీ చదవండి: 'అవతార్'లో కళ్లుచెదిరే గ్రాఫిక్స్ వెనక భారతీయ మహిళ)
జేమ్స్ కామెరూన్ తీసిన లేటెస్ట్ సినిమా 'అవతార్ 3'.. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ 20th సెంచరీ ఫాక్స్ స్టూడియో స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. రాజమౌళి ఇక్కడే ఉండగా.. వీడియో కాల్ ద్వారా కామెరూన్ జక్కన్నతో మాట్లాడారు. మిగతా విషయాలు ఏమో గానీ 'వారణాసి' గురించి చేసుకున్న డిస్కషన్ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తోంది.
'వారణాసి' సినిమా సంగతేంటి అని కామెరూన్ అడగ్గా.. ఏడాది నుంచి షూటింగ్ చేస్తున్నామని, మరో ఏడెనిమిది నెలల్లో పూర్తవుతుందని రాజమౌళి చెప్పుకొచ్చారు. 'వారణాసి' షూటింగ్, సెట్స్ చూడాలని ఉందని చెప్పిన కామెరూన్.. కెమెరా పట్టుకుని తాను కూడా కొన్ని సీన్స్ తీస్తానని అన్నారు. అలానే 'పులులతో ఏదైనా షూట్ ప్లాన్ చేస్తుంటే చెప్పు' అని కామెరూన్ సరదాగా అన్నారు. దీంతో ఇద్దరూ నవ్వుకున్నారు. రాజమౌళి చెప్పిన దానిబట్టి చూస్తుంటే వచ్చే ఏడాది ద్వితియార్ధానికి షూటింగ్ అయిపోతుందనమాట. అంటే చెప్పినట్లు 2027 వేసవిలో రిలీజ్ చేస్తారనమాట.
(ఇదీ చదవండి: ఏఎన్నార్ కాలేజీకి నాగార్జున రూ.2 కోట్లు విరాళం)


