మొదలైన సేంద్రియ విప్లవం!
కశ్మీర్ లోయ పర్యాటకంతోపాటు వ్యవసాయానికి గుర్తింపు పొందింది. ఒకప్పుడు ఆ ప్రాంతానికి వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయం భారీగా తోడ్పడేది. కానీ ప్రస్తుతం కశ్మీర్ ఆరోగ్య సంక్షోభంతో పోరాడుతోంది. అందుకు వ్యవసాయ రసాయనాల వినియోగం పెరుగుతుండడం కారణమవుతుంది. పురుగుమందుల (Pesticides) వాడకంతో ముడిపడి ఉన్న క్యాన్సర్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతుండటంతో కశ్మీర్ వ్యవసాయ పద్ధతులను పూర్తిగా మార్చుకోవడానికి సిద్ధమవుతోంది.
క్యాన్సర్ కేసుల పెరుగుదల
జమ్మూ కశ్మీర్‌లో క్యాన్సర్ కేసుల సంఖ్య కొన్ని సంవత్సరాలు గణనీయంగా పెరుగుతోంది. 2018 నుంచి లోయలోనే 50,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఈ పెరుగుదల ముఖ్యంగా యాపిల్ పండించే ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 2010లో ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ అండ్ పీడియాట్రిక్ ఆంకాలజీలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, 2005-2008 మధ్య కశ్మీర్‌లో మెదడు కణితి (Brain Tumour) రోగుల్లో 90% మంది తోట కార్మికులు, తోటల సమీపంలో నివసించేవారు, వాటిలో ఆడుకునే పిల్లలే ఉండడం గమనార్హం. షేర్-ఇ-కశ్మీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SKIMS) డేటా ఆధారంగా దీర్ఘకాలికంగా(10-20 సంవత్సరాలు) భారీగా పురుగుమందులు వాడడంతో ఈ ప్రాణాంతక మెదడు కణితుల అభివృద్ధి ఎక్కువైందని తెలుస్తుంది.
సుస్థిరత వైపు అడుగులు
కశ్మీర్‌లోని ప్రజల భవిష్యత్తు ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇటీవల శ్రీనగర్‌లో జరిగిన 2025 ఫుడ్ సేఫ్టీ అండ్ హెల్త్ కాన్‌క్లేవ్‌లో వ్యవసాయ మంత్రి జావేద్ అహ్మద్ దార్ కీలక ప్రకటన చేశారు. హోలిస్టిక్ అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (HADP) కింద వచ్చే ఐదేళ్లలో 75,000 హెక్టార్ల వ్యవసాయ భూమిని సేంద్రియ సాగు కోసం కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఉన్న 20,000 హెక్టార్ల తోటలను పర్యావరణ అనుకూల, తక్కువ ప్రభావ వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘మానవ ఆరోగ్యాన్ని పరిరక్షించడం, స్థిరమైన వ్యవసాయ వృద్ధిని నిర్ధారించడం లక్ష్యం’ అని మంత్రి అన్నారు.
కశ్మీర్‌లో ఏటా ఉపయోగించే మొత్తం 4,080 టన్నుల పురుగుమందుల్లో 90% పైగా యాపిల్ తోటలపైనే వాడుతున్నారు. హెక్టారుకు వాడే అత్యధిక మందుల వినియోగంలో జమ్మూ కశ్మీర్ దేశవ్యాప్తంగా నాలుగో స్థానంలో ఉంది. రైతులు తమ ఉత్పత్తి ఖర్చుల్లో దాదాపు 55% కేవలం పంట సంరక్షణ (రసాయనాల) కోసం ఖర్చు చేస్తున్నారు.
సేంద్రియ సాగులో సవాళ్లు
సేంద్రియ వ్యవసాయానికి మారడం అంత సులభం కాదు. షేర్-ఇ-కశ్మీర్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ తారిక్ రసూల్ కొన్ని సవాళ్లను గుర్తించారు. ‘రసాయనాలు వాడడం తగ్గంచాల్సిందే. అయితే వీటిని పూర్తిగా వాడకుండా వ్యాధులు, తెగుళ్లను నిర్వహించడం కష్టం. సేంద్రియ యాపిల్స్ సాధారణంగా సాంప్రదాయ యాపిల్స్‌తో పోలిస్తే తక్కువ దిగుబడి ఉండే అవకాశం ఉంది’ అన్నారు.
ఇదీ చదవండి: జేబుకు తెలియకుండానే కన్నం వేస్తున్నారా?


