భారతదేశం అనేక ఖనిజాలకు (ఇంధన, లోహ, అలోహ ఖనిజాలు) నిలయం. వీటిని సరైన విధంగా గుర్తించి.. వినియోగించుకుంటే.. దిగుమతి కోసం దాదాపు ఏ దేశం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. భూమిపైన మాత్రమే కాకుండా.. సముద్ర గర్భంలో కూడా విరివిగా లభిస్తాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇండియా.. నేషనల్ గ్యాస్ హైడ్రేట్ ప్రోగ్రామ్ (NGHP) ద్వారా.. సముద్రంలో మీథేన్ హైడ్రేట్ నిక్షేపాలను గుర్తించింది. ఇంతకీ ఇదెందుకు ఉపయోగపడుతుంది?, ఎలా బయటకు తీయాలి?, బయటకు తీయడం వల్ల లాభం ఏమిటనే.. ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారతదేశం.. బంగాళాఖాతంలో మాత్రమే కాకుండా, దాని తూర్పు ఖండాంతర అంచున దగ్గర కూడా భారీగా మీథేన్ హైడ్రేట్ నిక్షేపాలను గుర్తించింది. ఈ నిక్షేపాల విలువ ట్రిలియన్ డాలర్లు ఉండవచ్చని అంచనా. కానీ దీనిని (మీథేన్ హైడ్రేట్) సముద్రం నుంచి బయటకు తీయగల సరైన టెక్నాలజీ ప్రస్తుతానికి అందుబాటులో లేదు. అంతే కాకుండా దీనిని బయటకు తీయడానికి యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ (UNCLOS) ద్వారా కొన్ని హక్కులను పొందాల్సి ఉంటుంది.
మీథేన్ హైడ్రేట్‌ను బయటకు తీయడం కష్టమా?, ఎందుకు?
సముద్రం అడుగున ఉన్న భూభాగం చల్లగా (0-4 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్) ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీథేన్ హైడ్రేట్ గడ్డ కట్టుకుని ఉంటుంది. అయితే దీనిని బయటకు తీయాలని ప్రయత్నించినప్పుడు.. కొంత ఉష్ణోగ్రత వల్ల కరిగిపోవచ్చు. ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ మీథేన్ హైడ్రేట్ ఆవిరయ్యే అవకాశం ఉంటుంది.
డీ–ప్రెషరైజేషన్, థర్మల్ స్టిమ్యులేషన్, వంటి టెక్నాలజీలను ఉపయోగించి లేదా కొన్ని రసాయన పద్దతుల ద్వారా మీథేన్ హైడ్రేట్ బయటకు తీయవచ్చు. కానీ సముద్ర గర్భంలో ఎక్కువ సేపు పని చేయడం అనేది చాలా కష్టమైన పని. అంతే కాకుండా పనిచేస్తున్నప్పుడు మీథేన్ విడుదలైతే చాలా ప్రమాదం. దీనికోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
మీథేన్ హైడ్రేట్ వల్ల ఉపయోగాలు
సముద్రంలోని భారీ మీథేన్ హైడ్రేట్‌ను బయటకు తీస్తే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రధానంగా గ్యాస్ దిగుమతులు తగ్గించవచ్చు. విద్యుత్ ఉత్పత్తి, వంట గ్యాస్, పరిశ్రమల్లో ఉపయోగించవచ్చు. భవిష్యత్ తరాలు ఉపయోగించుకోవడానికి నిల్వ చేసుకుపోవచ్చు. బొగ్గు, పెట్రోలియంతో పోలిస్తే.. మీథేన్ హైడ్రేట్ ఉపయోగం వల్ల కాలుష్యం తగ్గుతుంది. గ్యాస్ ధరలు కూడా తగ్గుతాయి.
పరిధి దాటితే పరిస్థితులు తీవ్రం!
సముద్రం అనేది ఏ ఒక్క దేశం అధీనంలో ఉండదు. ఇది మొత్తం అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఉంటుంది. కేవలం తీరరేఖ నుంచి 12 నాటికల్ మైళ్ల దూరం మాత్రమే ఆ దేశం ఆధీనంలో ఉంటుంది. అయితే తీరరేఖ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఉన్న సముద్రంలో లభించే వనరులను దేశం ఉపయోగించుకునే అధికారం ఉంటుంది. ఈ పరిధి ఏ దేశం దాటినా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి సముద్రంలోని నిక్షేపాలను ఏ ఒక్క దేశం స్వాధీనం చేసుకోవడం అనేది సాధ్యం కాదు.
ఇదీ చదవండి: 'ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు'.. కియోసాకి పదో పాఠం


