
కీవ్: కజఖ్‌స్తాన్ సరిహద్దుల్లో ఉన్న రష్యాకు చెందిన గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌పై శనివారం రాత్రి ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసింది. భారీ పేలుళ్లు సంభవించడంతోపాటు పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో, ప్లాంట్‌ను మూసివేసినట్లు రష్యా, కజకిస్తాన్ అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని గాజ్‌ప్రోమ్ సంస్థకు చెందిన ఒరెన్‌బర్గ్ ప్లాంట్‌లో కజఖ్‌స్తాన్ నుంచి వచ్చే గ్యాస్‌ను ప్రాసెసింగ్ చేస్తారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఒరెన్‌బర్గ్ ప్లాంట్ వార్షిక సామర్థ్యం 45 బిలియన్ క్యూబిక్ మీటర్లు. డ్రోన్ దాడి కారణంగా ఈ ప్లాంట్‌లోని వర్క్‌షాప్ తీవ్రంగా దెబ్బతిందని అధికారులు తెలిపారు.
ప్లాంట్‌లో తాత్కాలికంగా గ్యాస్ ప్రాసెసింగ్‌ను నిలిపివేశామన్నారు. రష్యా తమపై సాగిస్తున్న యుద్ధానికి ఇంధన వనరులే కీలకమని భావిస్తున్న ఉక్రెయిన్ తరచూ ఆయిల్, గ్యాస్ రిఫైనరీలపై డ్రోన్ దాడులకు తెగబడుతోంది. మరో డ్రోన్ దాడితో ఒరెన్‌బర్గ్ సమీపంలో నొవొకుయి బషెవ్‌స్క్ ఆయిల్ రిఫైనరీ ప్రధాన శుద్ధి విభాగం దెబ్బతిందని ఉక్రెయిన్ ప్రకటించింది. ఇలా ఉండగా, రష్యా ఆధునీకరించిన గ్లైడ్ బాంబును ఖర్కీవ్‌లోని లొజావా నగరంపై శనివారం మధ్యాహ్నం ప్రయోగించిందని వెల్లడించింది. యూఎంపీబీ–5 ఆర్ అని పిలిచే రాకెట్ అమర్చిన ఈ రకం బాంబులు 130 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించిన తర్వాత సంభవించే పేలుడుతో తీవ్ర విధ్వంసం సంభవిస్తుంది.