షెల్ ఆయిల్, గ్యాస్ వెలికితీతతో సాగునీటికే కాదు తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు
వెలికితీతకు వినియోగించిన నీటిలో అణుధార్మిక పదార్థాలు
భారీఎత్తున వెలువడే వ్యర్థ జలాలను ఎక్కడకు తరలిస్తారు? ఇదే అంశంపై డాక్టర్ల సంస్థ పీఎస్సార్ అధ్యయనం... నోబెల్ శాంతి బహుమతి కూడా పొందింది
దాని నివేదిక ప్రకారం... వ్యర్థ జలాల వల్ల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం
వేదాంతకు షెల్ గ్యాస్, ఆయిల్ వెలికితీత అనుభవం లేదు
అనేక ప్రయోగాలు, పరిశోధనల తర్వాత దేశంలో షెల్ గ్యాస్, ఆయిల్ వెలికితీతకు అనుకూలం కాదని తేల్చిన ఓఎన్‌జీసీ
అయినా సరే వేదాంతకు అనుమతులు...
ప్రైవేటు సంస్థల లాభాల కోసం ప్రజల ప్రాణాలు, నీరు, భూమి తాకట్టు
తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.. జీవో 75ను ఉపసంహరించుకోవాలి.. ప్రభుత్వానికి సైంటిస్ట్స్ ఫర్ పీపుల్ శాస్త్రవేత్తల లేఖ
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా కాజా, తరకటూరుతో పాటు 14 గ్రామాల పరిధిలో బావులు తవ్వి (షెల్) చమురు (ఆయిల్), గ్యాస్ (సహజ వాయువు) వెలికితీస్తే డెల్టాకు పెనుముప్పు తప్పదని, సాగు నీరే కాదు, తాగడానికి గుక్కెడు మంచి నీళ్లూ దొరకవని ‘సైంటిస్ట్స్ ఫర్ పీపుల్’ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘చమురు, గ్యాస్‌ను వెలికితీసేందుకు బావులను అత్యంత లోతుకు తవ్వుతారు. భారీఎత్తున నీటిని తోడడంతో భూగర్భ జలాలు అడుగంటుతాయి. గ్యాస్, చమురు వెలికితీత (ఫ్రాకింగ్) సమయంలో వెలువడే వ్యర్థ జలాల్లో అణుధార్మిక పదార్థాలు ఉంటాయి’’ అని పేర్కొన్నారు.
భారీగా వెలువడే వ్యర్థ జలాలను తరలించడం అసాధ్యమని... వాటిని వదిలేయడం వల్ల భూమి, నీరు, గాలి కలుషితం అవుతాయన్నారు. ఫ్రాకింగ్ వ్యర్థాలపై విస్తృతంగా అధ్యయనం చేసి నోబెల్ శాంతి బహుమతి పొందిన డాక్టర్ల సంస్థ ఫిజీషియన్స్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (పీఎస్సార్) నివేదికను వారు ఉటంకించారు. అణు ధార్మిక పదార్థాలు ఉండే ఫ్రాకింగ్ జలాల ప్రభావం ప్రజారోగ్యంపై తీవ్రంగా ఉంటుందని ఎత్తిచూపారు. షెల్ గ్యాస్, చమురు వెలికితీత వల్ల ప్రపంచవ్యాప్తంగా జరిగిన నష్టాలపై వందలాది పరిశోధనలు ఉన్నాయని గుర్తుచేశారు.
శాస్త్రీయ ఆధారాలను విస్మరించి... సమగ్ర పరిశీలన లేకుండా వేదాంత సంస్థకు నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) ఇవ్వడం బాధ్యతారాహిత్యంగా అభివర్ణించారు. తక్షణమే ఈ ఎన్‌వోసీ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పీఎస్సార్ సంస్థ శాస్త్రవేత్తలు డాక్టర్ కె.బాబూరావు, డాక్టర్ కె.వెంకటరెడ్డి, డాక్టర్ డి.రాంబాబు, డాక్టర్ అహ్మద్‌ఖాన్, డాక్టర్ పీజీ రావు, డాక్టర్ ఎం.బాపూజీతో పాటు, మరో 24 మంది శాస్త్రవేత్తలు బుధవారం ప్రభుత్వానికి లేఖ రాశారు. దానిని రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పంపారు.
లేఖలోని ముఖ్యాంశాలు..
1. వేదాంత కంపెనీకి షెల్ గ్యాస్, ఆయిల్ వెలికితీతకు కేంద్రం లీజు ఇచ్చింది. ఆ ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతంలో పుట్టి పెరిగిన మేము... ప్రపంచవ్యాప్తంగా షెల్ బావులు సృష్టించిన పర్యావరణ విధ్వంసం, ఆరోగ్య నష్టాల గురించి తెలిసి, ఆందోళన చెందాం. స్థానిక ప్రజలకు ఎదురయ్యే ముప్పును వివరించే ప్రయత్నం చేశాం.
మీడియా సంస్థలు మా వాదనలకు వేదిక కల్పించినా, రాష్ట్ర పీసీబీ సహకరించలేదు. పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) నివేదికపై మేం లేవనెత్తిన ప్రశ్నలకు వేదాంతతో సమాధానాలు ఇప్పించలేదు. నిజానికి వేదాంతకు షెల్ ఆయిల్, గ్యాస్ వెలికితీతలో అనుభవం లేదు. అంతేకాదు, భారత ప్రభుత్వానికి షెల్ గ్యాస్, ఆయిల్ ఫ్రాకింగ్‌పై స్పష్టమైన పర్యావరణ, భద్రతా నియమ నిబంధనలు కూడా లేవు.
2. ఫ్రాకింగ్ చేయడానికి కోట్ల లీటర్ల నీరు అవసరం. అందులో వందల సంఖ్యలో హానికర రసాయనాలు కలుపుతారు. వ్యాపార రహస్యాల పేరుతో వాటిని ప్రజలకు వెల్లడించరు. బావుల నుంచి వచ్చే వ్యర్థ జలాల్లో అణుధార్మికత (రేడియో యాక్టివిటీ) ఉంటుంది. అంత నీరు ఈ ప్రాంతంలో దొరకదు. భూగర్భ జలాలను తోడేస్తే వ్యవసాయం కుప్పకూలుతుంది. తాగునీరు కూడా లభించదు. ఫ్రాకింగ్ వ్యర్థ జలాలను శుద్ధి చేయలేం. మరి ఎక్కడకు వదులుతారు?
3. ఫ్రాకింగ్ వల్ల కలిగే ఆరోగ్య నష్టాలపై పీఎస్సార్ అనేక నివేదికలు విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన నష్టాలపై వందలాది పరిశోధనలున్నా అన్నీ పక్కనపెట్టి, శాస్త్రీయ ఆధారాలను విస్మరించి, సమగ్ర పరిశీలన లేకుండా ఎన్‌వోసీ ఇవ్వడం ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఇంత అధిక జనాభా సాంద్రత ఉన్న, తాగునీటి కొరత ఉన్న ప్రాంతంలో ఫ్రాకింగ్‌కు అనుమతించడం ప్రాణాంతకం.
4. భారత ప్రభుత్వం గతంలో ఓఎన్‌జీసీ సంస్థకు ఫ్రాకింగ్‌కు అనుమతులు ఇచి్చంది. కొన్నేళ్ల పరిశోధన, ప్రయోగాల తర్వాత దేశంలో షెల్ నిర్మాణాలు వాణిజ్యపరంగా అనుకూలం కావని తేల్చి ఓఎన్‌జీసీ స్వయంగా వదిలేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు సంస్థ లాభాల కోసం ప్రజల ప్రాణాలు, నీరు, భూమిని తాకట్టు పెట్టే ప్రయత్నాన్ని తక్షణమే నిలిపివేయాలి. శతాబ్ద కాలంగా వ్యవసాయం, తాగు నీటి మీద ఆధారపడిన ఈ ప్రాంతాన్ని ఫ్రాకింగ్ నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులు, న్యాయ వ్యవస్థను కోరుతున్నాం.


