క్యాన్సర్ వస్తుందనేందుకు ఆధారాల్లేవు
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: గుడ్డు తింటే క్యాన్సర్ వస్తుందంటూ వ్యాప్తిలో ఉన్న వదంతులను భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఖండించింది. అవన్నీ ప్రజల్లో అనవసరంగా భయాందోళనలను రేకెత్తించే తప్పుదోవ పట్టించే, శాస్త్రీయంగా నిరూపితం కాని వార్తలని స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
దేశంలో లభ్యతలో ఉన్న గుడ్లు మానవ వినియోగానికి సురక్షితమైనవని తేల్చి చెప్పింది. గుడ్లలో ప్రమాదకరమైన రసాయనాలున్నాయంటూ వస్తున్న పుకార్లకు ఎటువంటి శాస్త్రీయ ప్రాతిపదిక లేదని తెలిపింది. భారత్‌లో విక్రయించే గుడ్లలో క్యాన్సర్‌ను కలిగించే నైట్రోఫురాన్ మెటబోలైట్స్(ఏవోజెడ్) ఉన్నాయంటూ మీడియాతోపాటు సామాజిక మాధ్యమ వేదికలపై ఇటీవల వస్తున్న కథనాల నేపథ్యంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఈ మేరకు వివరణ ఇచ్చింది.
ఆహార భద్రత, ప్రమాణాల (కలుషితాలు, విషపదార్థాలు, అవశేషాలు) నిబంధనలు–2011 ప్రకారం కోళ్ల పెంపకంతోపాటు గుడ్ల ఉత్పత్తి అన్ని దశల్లోనూ నైట్రోఫ్యూరాన్‌ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించామని పేర్కొంది.
ఒకవేళ అనుమతించిన దానికంటే తక్కువ స్థాయిలో స్వల్ప అవశేషాలు బయటపడినా ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘన కిందకు రాదు, అలాగే దీనివల్ల ఆరోగ్యానికి ఎటువంటి ముప్పు ఉండదని ప్రకటించింది. మన దేశంలో నియంత్రణలు అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా ఉన్నాయని కూడా తెలిపింది. ఎక్కడో ఏవో కొన్ని ప్రయోగశాలల్లో వెలువడిన ఫలితాలను సాధారణీకరిస్తూ, గుడ్లు సురక్షితం కాదని ముద్ర వేయడం శాస్త్రీయంగా సరికాదని కూడా స్పష్టం చేసింది.


