క్యాన్సర్ మహమ్మారిని ప్రాథమిక దశలోనే తుడిచిపెట్టేందుకు యూఏఈ వైద్య రంగం విప్లవాత్మక అడుగు ముందుకేసింది. అబుదాబిలోని బుర్జీల్ హాస్పిటల్స్ ప్రవేశపెట్టిన 'ట్రూచెక్ ఇంటెల్లి' అనే రక్త పరీక్షతో ఒకేసారి 70 రకాల క్యాన్సర్లను గుర్తించవచ్చు.
శరీరంలో క్యాన్సర్ లక్షణాలు కనిపించకముందే, కణాల స్థాయిలో మార్పులను ఈ టెస్టుతో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా 40 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు కలిగిన వారి కోసం ఈ 'ట్రూచెక్ ఇంటెల్లి' పరీక్షను తీసుకొచ్చారు. ఎందుకంటే వయస్సు పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
అదేవిధంగా ఎండోస్కోపీ లేదా బయాప్సీ వంటి పరీక్షలంటే భయం ఉన్నవారికి ఇదొక గొప్ప ప్రత్యామ్నాయం. ఈ పరీక్షలో ఫలితాల ఖచ్చితత్వం 95 శాతం నుండి 98 శాతం వరకు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదే విషయంపై బుర్జీల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ సీఈఓ డాక్టర్ హుమైద్ అల్ షంసీ మాట్లాడుతూ.. మేము నిర్వహించిన సర్వేలో దాదాపు 60 శాతం మంది ప్రజలు ముందస్తు క్యాన్సర్ పరీక్షలకు భయపడుతున్నారని తేలింది. కొలనోస్కోపీ, బయాప్సీ వంటి పరీక్షలపై ఉన్న భయం వల్ల చాలామంది వ్యాధి ముదిరే వరకు డాక్టర్ దగ్గరకు రావడం లేదు.
ఆ అడ్డంకిని తొలగించేందుకు 'ట్రూచెక్ ఇంటెల్లి' పరీక్షను తీసుకొచ్చాము. ఒక చిన్న రక్త పరీక్షతో ఏ రకమైన క్యాన్సర్‌నైనా గుర్తించవచ్చు. దీంతో ప్రాథమిక దశలోనే చికిత్స ప్రారంభించే అవకాశం ఉంటుంది"అని చెప్పుకొచ్చారు.


