Sakshi News home page

సుస్థిర వ్యవసాయంతోనే ఆహార భద్రత

Published Thu, Aug 31 2023 3:36 AM

Food security through sustainable agriculture - Sakshi

సాక్షి ప్రత్యేక ప్రతినిధి :  రానున్న సంవత్సరాల్లో భారత్‌లో ఆహార సంక్షోభం తలెత్తనుందా? దేశవ్యాప్తంగా సుస్థిర వ్యవసాయాభివృద్ధి సాధ్యం కావడం లేదా? కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ సుస్థిర వ్యవసాయంలో ముందుకు వెళ్తున్నాయా? అలా వెళ్తున్న రాష్ట్రాలు ఆహార భద్రతకు భరోసా కల్పిస్తున్నాయా? సుస్థిర వ్యవసాయానికి మొత్తం 51 సూచికలను ప్రామాణికంగా తీసుకుని దేశవ్యాప్తంగా జరిపిన అధ్యయనం తర్వాత సుస్థిర వ్యవసాయం సాధించలేని పక్షంలో ఆహార భద్రత కష్టమేనని అఖిల భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్‌–ఐకార్‌) అభిప్రాయపడుతోంది.

‘కాంపోజిట్‌ ఇండెక్స్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ సస్టైనబులిటీ’పేరిట దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని వ్యవసాయ విధానా లను ఐకార్‌ శాస్త్రవేత్తలు డాక్టర్‌ ప్రేమ్‌చంద్, కిరణ్‌కుమార్‌లు పరిశీలించి నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో ఐకార్‌ ఈ అభిప్రాయానికి వచ్చింది. వ్యవసాయ విధానాల్లో స్పష్టమైన మార్పులు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తోంది.  

వ్యవసాయ సుస్థిరతకు సవాళ్లు 
‘వ్యవసాయ రంగంలో రసాయన ఎరువుల వినియోగం పెరగడం, తీవ్ర వ్యవసాయ పద్ధతులను అవలంబించడం, భూసారం తగ్గిపోవడం వ్యవసాయ సుస్థిరతకు పెనుసవాలుగా మారుతోంది. 2030 నాటికి దేశ జనాభా 150 కోట్లకు చేరుకుంటుంది. ఆ జనాభాకు ఆహార భద్రత కల్పించాల్సిన బాధ్యత సాగు రంగంపై ఉంది.

కొన్ని రాష్ట్రాలు సామాజిక, ఆర్థిక రంగాల్లో మంచి ప్రతిభ కనబరుస్తున్నా.. వ్యవసాయ సుస్థిరత సూచీలకు వచ్చేస రికి వెనుకబడుతున్నాయి..’అని ఐసీఏఆర్‌ వెల్లడించింది. పంజాబ్, హరియాణ సామాజిక, ఆర్థిక రంగాల్లో ముందంజలో ఉన్నప్పటికీ.. వ్యవసాయ సుస్థిరత సూచీని పరిశీలించినప్పుడు వెనుకబడి ఉన్నట్లు తెలిపింది. భారత వ్యవసాయ రంగం సుస్థిరత కోణంలో ఉన్నత స్థానంలో లేదని ఓ మోస్తరు సుస్థిరతతోనే ఉన్నట్లు స్పష్టం చేసింది. 

ప్రభుత్వాలుసహకరించాలి.. 
‘సుస్థిర వ్యవసాయానికి ప్రధాన సూచికలైన అతి తక్కువ నీరు,రసాయనాలు, ఎరువులు,విద్యుత్‌ వినియోగిస్తూ, భూసారం తగ్గకుండా పంటలు పండించే రైతాంగానికి ప్రభుత్వాలు సరైన సమయంలో సాయం అందించాల్సిన అవసరం ఉంది. అప్పుడే భారత్‌లో ఆహార భద్రతకు ఇబ్బందులు రావు. ప్రస్తుతం మిజోరం, కేరళ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్,పశ్చిమ బెంగాల్‌ మాత్రమేసుస్థిర వ్యవసాయాభివృద్ధి సాధిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులుఎదుర్కొనే రాజస్తాన్‌ సుస్థిరవ్యవసాయంలో చివరలో ఉంది..’ అని ఐకార్‌ నివేదిక తెలిపింది.  

సుస్థిర వ్యవసాయానికి 51 సూచికలు 
సుస్థిర వ్యవసాయాభివృద్ధికి 51 సూచికలను ప్రామాణికంగా తీసుకున్నట్లు ఐకార్‌ వెల్లడించింది. సారవంతమైన నేలలు, నీటి వనరులు, జీవ వైవిధ్యం, సామాజిక, ఆర్థిక, పర్యావరణ సమతుల్యత తదితర సూచికలు ప్రధానమైనవిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, బిహార్, హరియాణాతోపాటు వరి పండించే జార్ఖండ్, అస్సాం రాష్ట్రాలు ఎక్కువ ప్రమాదంలో ఉన్నట్లు ఐకార్‌ వివరించింది. ఇక్కడ వ్యవసాయ విధానాల్లో మార్పులు అత్యావశ్యమని హెచ్చరించింది.

పంటల మార్పిడి, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి, పంట రుణాలు, నీటి వనరుల కల్పన తదితరాలతో సుస్థిర వ్యవసాయం సాధ్యమంది. అధిక ఇన్‌పుట్‌ సబ్సిడీల నుంచి పద్ధతి ప్రకారం రైతులకు లబ్ధి చేకూరే విధానాలు రావాల్సి ఉందని తెలిపింది. భూములు సారవంతంగా లేని చోట రసాయన ఎరువుల వాడకం పెరుగుతోందని, దీనివల్ల భూమిలో ఆర్గానిక్‌ కార్బన్‌ తగ్గుదల చోటు చేసుకుంటోందని వివరించింది. 

దేశంలో ఓ మాదిరి సుస్థిరతే.. 
సుస్థిర వ్యవసాయంలో 0 నుంచి 1ని ప్రామాణికంగా తీసుకుంటే దేశంలో సరాసరిన 0.50 నమోదు అవుతోందని, ఇది ఓ మాదిరి సుస్థిరత మాత్రమేనని ఐసీఏఆర్‌ తేల్చింది. 0ను అధ్వానంగా పేర్కొంటే, 1ని అత్యుత్తమంగా పేర్కొంది. హిమాచల్‌ ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళలు జాతీయ సగటును మించి ఉన్నాయి. పంజాబ్, హరియాణా, రాజస్తాన్, గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌లు అధ్వానంగా ఉన్నాయి.

ఈ రాష్ట్రాల్లో భూ గర్భ జలాల వినియోగం అధికంగా ఉందని, భూగర్భ జలాలు 40 సెంటీమీటర్ల మేరకు వేగంగా పడిపోయాయని ఐకార్‌ పేర్కొంది. ఇక పర్యావరణ సుస్థిరతలో కర్ణాటక, మహారాష్ట్ర, మిజోరం, ఉత్తరాఖండ్‌లు మెరుగైన పనితీరును కనపరుస్తున్నట్లు తెలిపింది.

ఇందులో అస్సాం, మణిపూర్, జార్ఖండ్, పంజాబ్, తెలంగాణ అధ్వానంగా ఉన్నట్లు తమ పరిశోధనలో తేలిందని పేర్కొంది. ఈ రాష్ట్రాల్లో ఆర్గానిక్‌ వ్యవసాయం చాలా తక్కువ పరిమాణంలో ఉందని, గ్రీన్‌హౌస్‌ గ్యాసెస్‌ ఎక్కువగా వ్యవసాయ రంగం నుంచే వెలువడుతున్నట్లు పేర్కొంది. 

వాణిజ్య పంటలున్నా ఏపీ భేష్‌ 
సుస్థిర వ్యవసాయాభివృద్ధి సాధిస్తున్న ఐదారు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఉండటం అభినందనీయం. మిజోరం, కేరళ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు కూడా ఉన్నా.. ఆ రాష్ట్రాల్లో వాణిజ్య పంటలు తక్కువగా ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో వాణిజ్య పంటలు అధికంగా సాగు చేస్తున్నా.. రసాయన ఎరువులు, నీరు తక్కువ వినియోగం, భూసారాన్ని పెంపొందించేలా చేయడం ద్వారా సుస్థిర వ్యవసాయాన్ని సాధించింది. సుస్థిర వ్యవసాయం చేస్తున్న రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని ప్రోత్సాహకాలు అందించాల్సిన అవసరం ఉంది. ఈ రైతులను ఆదుకుంటే దేశ ఆహార భద్రతకు వచ్చే ముప్పేమీ ఉండదు.

Advertisement

What’s your opinion

Advertisement