హైదరాబాద్: సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఓపెన్ మైండ్స్ సంస్థ ఆధ్వర్యంలో ‘‘ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల పక్రియ వైఫల్యము-ప్రజాస్వామ్య పరిరక్షణ’’పై బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఓపెన్ మైండ్స్ ఫోరమ్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రిటైర్డ్ ఉద్యోగులు, అడ్వకేట్లు, జర్నలిస్టులు, మేధావులు హాజరయ్యారు.
ఓపెన్ మైండ్స్ ఫోరం అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘పాలస్తీనా, గాజా లాంటి పరిస్థితులు ఏపీలో ఉన్నాయి. నామినేషన్ వేసేందుకు పోలీసుల కాళ్లు మొక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంత విధ్వంసకాండ ఎవరికోసం, దేని కోసం? పుంగనూరులో మొదలైన విధ్వంసం రాష్ట్రం మొత్తం పాకడానికి కారణం ఎవరు? కొన్ని చోట్ల నామినేషన్ వేయకుండా పోలీసులు ప్రత్యర్ధులకు సహకరించారు’’ అని తెలిపారు.
నేరమే అధికారమై ఏపీలో ఊరేగుతోంది..
సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ.. ‘‘నేరమే అధికారమై ఏపీలో ఊరేగుతోంది. ఇంకా దానికి అదుపు ఏమిటి? ఇలాంటి సమయంలో మడికట్టుకుని మాట్లాడలేం. నిజాన్ని బహిరంగంగా మాట్లాడడం అవసరం. ఓటుకు గౌరవ, మర్యాద లేకుండా చేస్తున్నారు. ఒకప్పుడు ఎన్నికల రిగ్గింగ్ జరిగితే.. ఇప్పుడు నామినేషన్ల రిగ్గింగ్ జరుగుతుంది.
ఏపీలో జరుగుతున్న సంఘటనలు కేంద్ర సర్కారుకు తెలియదనుకోవడం తప్పు. ఏపీలో అన్ని జిల్లాల్లో ఎన్నికలపై రౌండ్ టేబుల్ సమావేశాలు అవసరం. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రజలు ఇచ్చినవి కాదు. గోల్ మాల్ ఫలితాలతోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. దేశం మొత్తం తిరుగుతున్న రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఇప్పుడు ఉన్న మీడియాను నమ్మకండి...నమ్మి మోసపోకండి’’ అని అన్నారు.
ఏపీలో రాక్షస క్రీడ
ఆర్టీఐ మాజీ కమిషనర్ విజయబాబు మాట్లాడుతూ.. ‘‘ఏపీలో రాక్షస క్రీడ జరుగుతోంది. మాజీ మంత్రి మీద ఎస్ఐ దాడి చేస్తే దేశంలో చాలా మంది నేతలు స్పందించారు. కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమైంది? ఎన్నికల్లో గెలిచిన పార్టీకి ప్రభుత్వాన్ని నడిపే హక్కు మాత్రమే ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసే హక్కు ఇవ్వలేదు. నామినేషన్ వేయకుండా అడ్డుకున్నాక... ఇక ఎన్నికలు నిర్వహించడం ఎందుకు? అసలు ఎన్నికల సంఘం ఉందా? ఉంటే ఎందుకు స్పందించదు? సుప్రీంకోర్టు తీర్పును కూడా తుంగలో తొక్కారు’’ అని తెలిపారు.


