మేమొచ్చాక ర‌హ‌స్య జీవోల గుట్టు తేల్చుతాం: కారుమూరి వెంకటరెడ్డి | karumuri venkata reddy on govt GOs | Sakshi
Sakshi News home page

మేమొచ్చాక ర‌హ‌స్య జీవోల గుట్టు తేల్చుతాం: కారుమూరి వెంకటరెడ్డి

Oct 28 2026 9:52 PM | Updated on Oct 28 2026 9:52 PM

karumuri venkata reddy on govt GOs

తాడేప‌ల్లి: చంద్రబాబు, లోకేష్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ప్ర‌భుత్వం ఏర్పాటైన 28 నెలల కాలంలో, అత్యంత గోప్యంగా ఎవరికీ తెలియకుండా ఏకంగా 434 రహస్య జీవోలను విడుదల చేయాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి డిమాండ్‌ సూటిగా ప్ర‌శ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడుతూ ర‌హ‌స్య జీవోల‌తో ప్రజాధనాన్ని దోచుకునేందుకు తెరవెనుక కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. 

పరిపాలనలో పారదర్శకత లేకపోవడానికి ఈ రహస్య జీవోలే నిదర్శనమని కారుమూరి పేర్కొన్నారు. అత్యధికంగా రెవెన్యూ శాఖలో 181, హోమ్ డిపార్ట్‌మెంట్‌లో 83, ఫైనాన్స్‌లో 24, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖలో 18 రహస్య జీవోలను జారీ చేశారని వివరించారు. 2014-2019 మధ్య గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ 1,729 కాన్ఫిడెన్షియల్ జీవోలు జారీ అయ్యాయని ఆయన ప్రస్తావించారు.

సెప్టెంబర్‌లో 15 రహస్య జీవోలు విడుదల కాగా, 2026 అక్టోబర్ 12 నాటికి ఈ నెలలోనే 11 జీవోలు వెలువడినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి రెండు రోజులకు ఒక రహస్య జీవో వెలువడుతుంద‌ని, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా, కన్సల్టెంట్ల నియామకాలు, ప్రత్యేక కేటాయింపుల పేరుతో సాగుతున్న ఈ చీకటి జీవోల బాగోతంపై ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే వైఎస్ జ‌గ‌న్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక వైఎస్సార్‌సీపీ ప్ర‌భుత్వంలో వీటిపై సమగ్ర విచారణ జరిపిస్తామని కారుమూరి వెంక‌ట‌రెడ్డి హెచ్చరించారు.    

ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను ఎందుకు దాస్తున్నారు? 
కూట‌మి ప్రభుత్వం వచ్చిన ఈ 28 నెలల కాలంలో ప్రజలకు తెలియకుండా ఏకంగా 434 రహస్య జీవోలు విడుదల చేశారని కారుమూరి వెంక‌ట‌రెడ్డి అన్నారు. ‘‘అసలు ఈ జీవోల్లో ఏముంది? ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు? ప్రజలకు తెలియాల్సిన ప్రభుత్వ నిర్ణయాలను ఎందుకు దాస్తున్నారు? చంద్రబాబు ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి.  2024 జూలై 25న హోం శాఖ నుంచి తొలి రహస్య జీవో విడుదలైంది. 2026 అక్టోబర్ 9 నాటికి మొత్తం 434 రహస్య జీవోలు విడుదలయ్యాయి. 

ఒక ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తే జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. కానీ ఈ ప్రభుత్వం మాత్రం పెద్ద సంఖ్యలో జీవోలను రహస్యంగా ఉంచుతోంది. 2014 నుంచి 2019 వరకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 1,729 కాన్ఫిడెన్షియల్ జీవోలు ఇచ్చారు. ఇప్పుడు కేవలం 28 నెలల్లోనే 434 రహస్య జీవోలు ఇచ్చారు. సెప్టెంబర్‌లో 15 జీవోలు, అక్టోబర్ 12వ తేదీ నాటికే ఈ నెలలో 11 రహస్య జీవోలు విడుదలయ్యాయి. దాదాపు ప్రతి రెండు రోజులకు ఒక రహస్య జీవో విడుదలవుతోంది. ఇంత రహస్యంగా ప్రభుత్వం ఏం చేస్తోంది?’’ అని చెప్పారు.

రెవెన్యూ శాఖలో అత్యధికంగా 181 రహస్య జీవోలు 
శాఖలవారీగా చూస్తే రెవెన్యూ శాఖలో అత్యధికంగా 181 రహస్య జీవోలు విడుదలయ్యాయని కారుమూరి వెంక‌ట‌రెడ్డి తెలిపారు. ‘‘హోం శాఖలో 83, ఆర్థిక శాఖలో 24, పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 18 రహస్య జీవోలు ఇచ్చారు. అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు సంబంధించిన జీవోలను కూడా రహస్యంగా ఉంచారు. రెవెన్యూ శాఖ అంటే భూములు, ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే శాఖ. అలాంటి శాఖలో 181 జీవోలను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది? హోం శాఖలో 83 జీవోల్లో ఏముంది? ఆర్థిక శాఖలో 24 జీవోల్లో ఏముంది? పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న శాఖల్లో రహస్యంగా ఉంచాల్సిన అంశాలేమున్నాయి? ప్రభుత్వం వెంటనే దీనిపై వివరణ ఇవ్వాలి’’ అని చెప్పారు.

మేమొచ్చాక ర‌హ‌స్య జీవోల గుట్టు తేల్చుతాం
చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ గతంలో పారదర్శక పాలన అందిస్తామని, ప్రభుత్వ జీవోలన్నింటినీ ఆన్‌లైన్‌లో పెడతామని చెప్పారని కారుమూరి వెంక‌ట‌రెడ్డి తెలిపారు. ‘‘మరి ఇప్పుడు 434 జీవోలను ఎందుకు రహస్యంగా ఉంచారు? పారదర్శకతకు పెద్దపీట వేస్తామని చెప్పిన మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటే సరిపోదు ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు తెలిసేలా ఉండాలి. ప్రజలకు జవాబుదారీగా పాలన సాగించాలి. ఏ ప్రాతిపదికన కేటాయించారు? ఈ రహస్య జీవోల ద్వారా ఎవరికైనా అనుచిత ప్రయోజనాలు కల్పించారా? భూముల కేటాయింపుల్లో ఏమైనా అక్రమాలు జరిగాయా? అనే అంశాలపై సమగ్ర విచారణ జరగాలి. ప్రతి రహస్య జీవోలో ఏముందో ప్రజలకు తెలియాలి. ఈ ప్రభుత్వం వివరణ ఇవ్వకపోతే భవిష్యత్తులో వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక ప్రతి జీవో వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీస్తాం’’ అని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement