మతం మారితే బీసీ హోదా రాదు! | No benefits of backward class reservation for Islam converts: SC upholds Madras HC order | Sakshi
Sakshi News home page

మతం మారితే బీసీ హోదా రాదు!

Oct 16 2026 4:20 AM | Updated on Oct 16 2026 4:20 AM

No benefits of backward class reservation for Islam converts: SC upholds Madras HC order

ఇస్లాంలోకి మారిన వారికి బీసీ రిజర్వేషన్లు వర్తించవు 

హిందూ సామాజిక వెనుకబాటుతనాన్ని మరో మతంలోకి బదిలీ చేయలేం 

మద్రాస్‌ హైకోర్టు తీర్పును సమర్ధించిన సుప్రీంకోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారిన వ్యక్తులు వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్లు పొందేందుకు అర్హులు కారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక వ్యక్తి మతం మారినంత మాత్రాన అతడి సామాజిక, కుల హోదా వాటంతట అవే బదిలీ కావని తేల్చిచెప్పింది. హిందూ మతం నుంచి ఇస్లాం స్వీకరించిన వారికి ముస్లిం బీసీలుగా రిజర్వేషన్లు కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన జీవోను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించిన మద్రాస్‌ హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్ధించింది. గురువారం జస్టిస్‌ పీకే మిశ్రా, జస్టిస్‌ చంద్రశేఖర్‌ల ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. 

హోదా దానంతటదే బదిలీ కాదు 
వెనుకబడిన తరగతులు (బీసీ), అత్యంత వెనుకబడిన తరగతులు (ఎంబీసీ), డీనోటిఫైడ్‌ కమ్యూనిటీలు (డీఎన్‌సీ), షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ) నుంచి ఇస్లాంలోకి మారిన వారిని ముస్లిం బీసీలుగా పరిగణిస్తూ తమిళనాడు ప్రభుత్వం 2024 మార్చి 9న జీవో నంబర్‌ 15ను జారీ చేసింది. ఈ జీవోను మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసింది. దీనిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం.. హైకోర్టు తీర్పుతో పూర్తిగా ఏకీభవించింది. ఒక వ్యక్తి మతం మారినంత మాత్రాన రాష్ట్రంలో నోటిఫై చేసిన ఏడు ముస్లిం బీసీ వర్గాల్లో ఆటోమేటిక్‌గా భాగం కాలేరని స్పష్టం చేసింది. హిందూ సామాజిక వ్యవస్థలోని వెనుకబాటుతనాన్ని, రిజర్వేషన్ల ప్రయోజనాలను హిందూయేతర సామాజిక వ్యవస్థలోకి బదిలీ చేయలేమని పునరుద్ఘాటించింది. 

ఇస్లాంలో కుల వ్యవస్థ లేదు 
మద్రాస్‌ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులోని అంశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. ఇస్లాం మతం సమానత్వం అనే పునాదిపై ఏర్పడిందని, అందులో సామాజిక అసమానతలకు, కుల వివక్షకు తావులేదని హైకోర్టు చెప్పింది. ఇస్లాంలో కొన్ని వర్గాలను ఫార్వర్డ్‌గా, మరికొన్నింటిని బ్యాక్‌వర్డ్‌గా వర్గీకరించడం ఖురాన్‌ సూత్రాలకు విరుద్ధమని అభిప్రాయపడింది. ఇస్లాం సమానత్వాన్ని బోధిస్తుందని, దేవుడి దృష్టిలో అందరూ సమానులేనని పేర్కొంది. కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలను కొనసాగించాలన్న ఉద్దేశంతో భిన్నమైన సామాజిక వర్గాల నుంచి వచ్చిన వారిని ఒకే కేటగిరీ కింద చేర్చడం ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధమే కాకుండా ఇస్లామిక్‌ సిద్ధాంతాలకు వ్యతిరేకమని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement