వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకున్నా రావడం లేదు. బోర్ల నుంచి కూడా నీరు రావడం లేదు. జీవీఎంసీ నీటిని సరఫరా చేయడం లేదు సరికదా... కొనుక్కుందామన్నా ఇవ్వడం లేదు. ఇంట్లో చుక్క నీరు లేదు. ఉదయమైతే రోజు ఎలా గడపాలో అర్థం కావడం లేదు. మా ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. రాత్రి వేళ మహిళలం కూడా రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తున్నామంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. –డాక్టర్ శిరిషా, ఎంవీవీ సిటీ
రోజుకు 4 ట్యాంకర్ల నీరే ఇస్తున్నారు
ఎంవీవీ గేటెడ్ కమ్యూనిటీలోని 6017 ప్లాట్‌లో నివాసముంటున్నాం. నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. కనీస బాత్రూమ్ అవసరాలు తీర్చుకోవడానికి కూడా పిల్లలు, వృద్ధులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. రోజుకు కేవలం 4 ట్యాంకర్ల నీరు మాత్రమే ఇస్తున్నారు. 10 ట్యాంకర్లు దాటితే బుకింగ్ ఆపేస్తున్నారు. –రామ్‌కుమార్, సీనియర్ సిటిజన్
నాలుగు రోజులుగా తీవ్ర ఇబ్బంది
నాలుగు రోజుల నుంచి పరిస్థితి మరీ దారుణంగా మారింది. నీరు ఇవ్వడం లేదు. కొనుక్కుందామన్నా అనుమతించడం లేదు. ఇది ఎక్కడి న్యాయం? నీరు లేకపోతే ఎలా జీవించాలి? ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో మేం రాత్రి వేళ జీవీఎంసీ పంప్‌హౌస్ దగ్గరకు రాలేదు. మా ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలనే ఇక్కడికి వచ్చాం. –డాక్టర్ గోపాల కృష్ణారావు


