మహారాణిపేట: కేజీహెచ్‌లో రూ.23.75 కోట్ల వ్యయంతో నిర్మించిన నాలుగు అంతస్తుల అత్యాధునిక క్రిటికల్ కేర్ బ్లాక్(సీసీబీ) శనివారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు ఈ భవనాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్యాదవ్ విజయవాడ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అదే సమయంలో కేజీహెచ్‌లో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, పి.విష్ణుకుమార్రాజు, ఎన్‌టీఆర్ వైద్య సేవ ట్రస్టు చైర్మన్ సీతాంరాజు సుధాకర్ సంయుక్తంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ క్రిటికల్ కేర్ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలు అత్యున్నత ప్రమాణాలతో ఉండి, కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా లేని స్థాయి సదుపాయాలు ఇక్కడ లభ్యమవుతాయన్నారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు మాట్లాడుతూ కేజీహెచ్ అభివృద్ధి ద్వారా లక్షలాది మంది పేదలకు మేలు జరుగుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో ఓపీ బ్లాక్‌తో పాటు మరిన్ని వైద్య పరికరాలు, మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జేసీ విద్యాధరి, కేజీహెచ్ సూపరింటెండెంట్ డా.వాణి, ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సంధ్యారాణి, అడ్మినిస్ట్రేటర్ రమణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, పలువురు వైద్యులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.


