రాత్రి 10 గంటల వరకు ‘ఎంవీవీ సిటీ’ వాసుల ఆందోళన
ఎండాడ జీవీఎంసీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముట్టడి
తాగునీరు అందించలేని జీవీఎంసీపై ఆగ్రహం
మధురవాడ: నెల రోజులకు పైగా జీవీఎంసీ తాగునీరు సరఫరా చేయకపోవడంతో పాటు, కొనుక్కుందామన్నా నీరు అందించకపోవడంపై పీఎంపాలెం ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఎదురుగా ఉన్న ఎంవీవీ సిటీ గేటెడ్ కమ్యూనిటీ వాసులు భగ్గుమన్నారు. నగరంలో నీటి కరువు ముంచుకొస్తున్నా పాలకులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకపోవడంతో శనివారం రాత్రి 9 గంటల సమయంలో సుమారు 400 మంది నివాసితులు యండాడ జీవీఎంసీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా తమకు తాగునీరు అందించాలని, సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అధికారుల తీరుకు వ్యతిరేకంగా సెల్‌ఫోన్ ఫ్లాష్‌లైట్లు వెలిగించి పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. నివాసితులు కార్లు, ద్విచక్ర వాహనాల్లో మూకుమ్మడిగా తరలివచ్చి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12 బ్లాకుల్లో 1,428 నివాసాలున్న తమ గేటెడ్ కమ్యూనిటీకి రోజుకు కనీసం 9 లక్షల లీటర్ల నీరు అవసరమవుతుందని తెలిపారు. జీవీఎంసీ అధికారులు రోజుకు కనీసం 12 ట్యాంకర్ల ద్వారానైనా నీటిని అందించడం లేదని, తాగునీరు కొనుక్కుందామన్నా 10 ట్యాంకర్లు దాటిన తర్వాత బుక్ కాకుండా బ్లాక్ చేస్తున్నారని వాపోయారు. తాము వాడుక నీరే కాక, తాగునీరు కూడా లభించక ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులకు చీమకుట్టినట్లయినా లేదని విమర్శించారు. డేటా సెంటర్‌కు నీటి సరఫరా నేపథ్యంలో నగరంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకున్నా పాలకులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేద్దామన్నా వాటిని కూడా ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తాగునీరు అందించకపోతే ఎంతటి ఆందోళనకై నా వెనుకాడేది లేదన్నారు. అవసరమైతే ఆది వారం జాతీయ రహదారిపై ధర్నా చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.
తక్షణమే ఈ గేటెడ్ కమ్యూనిటీకి 8 జీవీఎంసీ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రాత్రి 10 గంటల తర్వాత ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. ఎంవీవీ సిటీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. వంశీ, కార్యదర్శి జగదీశ్వరరావు, లక్ష్మీనారాయణ, జగన్నాథరావు పాల్గొన్నారు.


