సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు వాటర్ మెన్ కాదు.. క్వార్టర్ మెన్.. మంచి నీరు ఇవ్వలేదు.. మందు మాత్రం ఇస్తున్నారంటూ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఇవాళ (ఆదివారం) విశాఖ నగర వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. రీజనల్ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, కేకే రాజు, వరుదు కళ్యాణి, మాజీ మేయర్ హరి వెంకట కుమారి పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించారు.
ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. మూడు రోజులకు ఒకసారి మంచి నీరు ఇస్తున్నారు.. వేలాది బోర్లు ఎండిపోతున్నాయి. మంచి నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం ఉంటే ఎంత.. పోతే ఎంత? ఇప్పుడే ఇలా ఉంటే ఎండాకాలంలో మంచి నీటి పరిస్థితి ఏమిటి? మంచి నీటి సమస్యను పరిష్కరించడంలో చంద్రబాబు విఫలమయ్యారు’’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు నైజం యూజ్ అండ్ త్రో పాలసీ: కన్నబాబు
కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. వెన్నుపోటు పార్టీ మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ‘‘చంద్రబాబుది వెన్నుపోటు పార్టీ అయితే వైఎస్సార్సీపీది వెన్ను చూపని పార్టీ. యాదవ సామాజిక వర్గానికి సాధారణ మహిళను జీవీఎంసీ మేయర్‌గా వైఎస్ జగన్ చేశారు.. యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను చంద్రబాబు మేయర్ పీఠం నుంచి దించేశారు. చంద్రబాబు నైజం యూజ్ అండ్ త్రో పాలసీ.
..రుషి కొండపై భవనం కడితే తప్పుడు ప్రచారం చేశారు. కూటమి పాలనలో విశాఖ నగరంలో కొండలను పిండి చేస్తున్నారు. రూపాయికి చాక్లెట్ కూడా రాదు. కానీ ఎకరా భూమి 99 పైసలకు ఇచ్చేస్తున్నారు. మూడు రోజులకు ఒకసారి వాటర్ ఇచ్చేవాడు వాటర్ మ్యాన్ నా? చంద్రబాబు చేసిన మోసాన్ని గడప గడపకు తీసుకువెళ్లాలి. పెన్షన్లు తీసుకొనే వారిని చంద్రబాబు తాగు బోతులుగా చిత్రీకరిస్తున్నారు. పేకాట ఆడే వారికి డీఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చారు’’అని కన్నబాబు దుయ్యబట్టారు.
అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు: వరుదు కల్యాణి
వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘‘అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం కోసం రూ.2 లక్షల 40 వేల కోట్లు ఖర్చు చేయాలి. మూడేళ్లలో కేవలం 32 వేల కోట్ల ఖర్చు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఒక సైనికుడులా పని చేయాలి. కూటమికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు’’ అని ఆమె పేర్కొన్నారు.
విశాఖ నగర వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు కేకే రాజు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. స్థానిక సమస్యలు మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలి. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమం పథకాలను ప్రజలకు వివరించాలి. చెప్పిన హామీలు కంటే ఎక్కువగా వైఎస్ జగన్ అమలు చేశారు. విశాఖకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. యాదవులకు విశాఖ మేయర్ పదవి వైఎస్ జగన్ ఇచ్చారు. జీవీఎంసీలో కీలకమైన పదవులు బడుగు బలహీన వర్గాలు వారికి ఇచ్చారు’’ అని ఆయన వివరించారు.
ఇదీ చదవండి: ఏడు దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా చంద్రబాబూ?


