HYD: క్యాబ్‌ డ్రైవర్‌ దారుణ హత్య | Cab Driver Rajasekhar Incident | Sakshi
Sakshi News home page

HYD: క్యాబ్‌ డ్రైవర్‌ దారుణ హత్య

Sep 14 2026 8:30 AM | Updated on Sep 14 2026 9:13 AM

 Cab Driver Rajasekhar Incident

సాక్షి, హైదరాబాద్‌: ఓ వ్యక్తి హత్య.. రెండు కుటుంబాలను విషాదంలో ముంచింది. బేగంపేట పోలీసుస్టేషన్‌ పరిధిలోని సీబీఎన్‌ నగర్‌కు చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ రాజశేఖర్‌ సంగారెడ్డి జిల్లాలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసు వివరాలు ఆరా తీయడానికి శనివారం సాయంత్రం పటాన్‌చెరు ఠాణాకు వెళ్లిన ఆయన బంధువు శ్యామ్‌ గుండెపోటుతో అక్కడిక్కడే చనిపోయారు. దీంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.   

గురువారం రాత్రి అదృశ్యం..  
ఖమ్మం జిల్లా పాతర్లపాడుకు చెందిన రాజశేఖర్‌ (32) నగరానికి వలసవచ్చి బేగంపేట పోలీసుస్టేషన్‌ పరిధిలోని సీబీఎన్‌ నగర్‌లో స్ధిరపడ్డారు. ఈయనకు భార్య లీల, ఎనిమిదేళ్ల లోపు వయసున్న కుమార్తెలు శ్రీనిధి, అనన్య ఉన్నారు. రాజశేఖర్‌కు రెండు కార్లు ఉండేవి. ఒకదాన్ని తాను నడుపుతూ.. మరో దాన్ని డ్రైవర్‌ ద్వారా నడిపిస్తున్నారు. రాజశేఖర్‌ సమీప బంధువు అశోక్‌ మూడు రోజుల క్రితం ఓ కారు ఖరీదు చేశారు. దీన్ని ప్రస్తుతం రాజశేఖర్‌ నడుపుతున్నారు. గురువారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజశేఖర్‌ తిరిగి రాలేదు. ఆయన ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ రావడంతో కుటుంబీకులు శుక్రవారం బేగంపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.   

మృతదేహం, కారు వేర్వేరు చోట్ల.. 
సంగారెడ్డి జిల్లా కోహిర్‌లోని గోల్డెన్‌ దాబా సమీపంలో రాజశేఖర్‌ కారు పోలీసులకు లభించింది. సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు అక్కడికి వెళ్లారు. రాజశేఖర్‌ కోసం పోలీసులు, కుటుంబీకులు, స్నేహితులు వెతికారు. శుక్రవారం అర్ధరాత్రి రుద్రారం శివారులోని చెట్ల పొదల్లో రాజశేఖర్‌ మృతదేహం లభించింది. హతుడి సోదరుడు రాంబాబు ఫిర్యాదుతో పటాన్‌చెరు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో రాజశేఖర్‌ మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. బెల్ట్‌ వంటి దాంతో మెడకు ఉరి బిగించి చంపినట్లు నిర్ధారించారు  

ఠాణాలో కుప్పకూలిన బంధువు.. 
కేసు పూర్వాపరాలు, దర్యాప్తు అంశాలను ఆరా తీయడానికి రాజశేఖర్‌ బంధువులు, స్నేహితులు శనివారం సాయంత్రం పటాన్‌చెరు ఠాణాకు వెళ్లారు. అక్కడ పోలీసు అధికారులతో మాట్లాడుతున్న సమయంలో హతుడి సమీప బంధువు శ్యామ్‌ గుండెపోటుతో కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో అటు రాజశేఖర్, ఇటు శ్యామ్‌ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకొన్నాయి.  

కారు కోసమే ఘాతుకమా? 
ప్రాథమిక ఆధారాలను బట్టి రాజశేఖర్‌ నడుపుతున్న కారు కోసమే ఆయన హత్య జరిగినట్లు భావిస్తున్నారు. ప్యాసింజర్ల మాదిరిగా కారు బుక్‌ చేసుకుని,  ఆపై వెనుక సీటు నుంచి మెడకు బెల్టు బిగించి చంపేసినట్లు అనుమానిస్తున్నారు. కాగా.. కారు మరమ్మతులకు లోనుకావడంతోనే అక్కడ వదిలేసి పారిపోయినట్లు భావిస్తున్నారు.

 ఇదీ చదవండి: నార్సింగి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement