కనీస వేతనం, ఎన్నికల హామీల అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి
అనకాపల్లిలో స్కీమ్ వర్కర్లపై పోలీసులు లాఠీచార్జీ.. పలువురికి గాయాలు
అనకాపల్లి, పార్వతీపురం, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్రమ అరెస్టులు
సాక్షి, అమరావతి: కనీస వేతనం నెలకు రూ.26వేలు చెల్లించాలని, సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఇతర ముఖ్యమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా స్కీమ్ వర్కర్లు కదం తొక్కారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్నం భోజన పథకం, యానిమేటర్లు(వీఓఏ), రిసోర్స్ పర్సన్స్(ఆర్‌పీ), స్కూల్ స్వీపర్స్, సమగ్రశిక్ష, నేషనల్ హెల్త్ మిషన్, ఉపాధి హామీ పథకం, వెలుగు తదితర స్కీమ్ వర్కర్లు కలెక్టరేట్లను ముట్టడించారు.
భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని వస్తున్న నేపథ్యంలో విజయనగరంలో కలెక్టరేట్ ముట్టడికి విరామం ఇచ్చారు. మిగిలిన 25 జిల్లాల్లో పెద్ద ఎత్తున కలెక్టరేట్లను ముట్టడించిన స్కీమ్ వర్కర్లు తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పలు జిల్లాల్లో స్కీమ్ వర్కర్లను పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్టులు చేశారు.
అనకాపల్లి, పార్వతీపురం, ఏలూరు, కృష్ణా తదితర జిల్లాల్లో స్కీమ్ వర్కర్లను పోలీసులు అడ్డుకోవడంతో బారికేడ్లను నెట్టుకుని ముందుకువెళ్లారు. దీంతో వారిని పోలీసులు ఈడ్చిపడేశారు. అనేక మందిని అక్రమంగా అరెస్టు చేశారు. అనకాపల్లిలో రెచ్చిపోయిన పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో వీఓఏ రాష్ట్ర అధ్యక్షురాలు సీహెచ్ రూపాదేవి చేయి విరిగింది. మరో నలుగురు గాయపడ్డారు.

అంగన్‌వాడీ కార్యకర్త రూపాదేవికి చేయి విరిగింది. కృష్ణా జిల్లాలో పోలీసులు, స్కీమ్ వర్కర్లకు మధ్య జరిగిన తోపులాటలో స్కీమ్ వర్కర్లు రమ, నాంచారమ్మ, లక్ష్మీలకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పార్వతీపురంలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా స్కీమ్ వర్కర్లు కలెక్టరేట్‌ను ముట్టడించారు.
హామీలు అమలు చేయకుండా నిర్బంధమా?
హామీలను అమలు చేయాలని కోరితే చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి స్కీమ్ వర్కర్లను నిర్బంధించడం, లాఠీ చార్జ్ చేయడంపై స్కీమ్ వర్కర్స్ యూనియన్ల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వివిధ ప్రాంతాల్లో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీ నాగేశ్వరరావు, డీఎన్‌వీడీ ప్రసాద్, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నరసింగరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగునాయుడు, అంగన్‌వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి, మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి తదితరులు పాల్గొన్నారు.


