భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ | Third Flood Warning at Bhadrachalam | Sakshi
Sakshi News home page

భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Aug 1 2026 8:24 AM | Updated on Aug 1 2026 8:24 AM

Third Flood Warning at Bhadrachalam

భద్రాచలంటౌన్‌: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో 29 అడుగుల వద్ద ఉన్న నీటిమట్టం శుక్రవారం ఉదయానికి ఒక్కసారిగా పెరిగిపోయింది. రాత్రి 55 అడుగులు దాటి ప్రవహించింది. ఎగువన ఉన్న సమ్మక్క బ్యారేజీ నుంచి సుమారు 15 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో భద్రాచలం వద్ద ఉధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాజెక్టులన్నీ నిండిపోయి ఉండటంతో వరద మరింత పెరుగుతోంది. రాత్రి 12 గంటలకు అధికారులు  మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద పరిస్థితిని రాష్ట్ర మంత్రులు నిరంతరం సమీక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.

స్తంభించిన రాకపోకలు
గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఏజెన్సీలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి లక్ష్మీనగరం వెళ్లే దారిలో తూరుబాక వద్ద,  భద్రాచలం నుంచి చర్ల  వెళ్లే రోడ్డులో కుదునూరు వద్ద ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరింది. చర్ల నుంచి వెంకటాపురం వెళ్లే రోడ్డులో ఆలుబాక వద్ద సైతం వరద నీరు రోడ్డుపైకి చేరటంతో రాకపోకలు నిలిచిపోయాయి.  భద్రాచలం నుంచి కూనవరం వెళ్లే రోడ్డులో మురుమూరు, పోలిపాక గ్రామాల వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భద్రాచలం దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతాల గ్రామాలకు కపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పరీవాహక ప్రాంత ప్రజలు నది వైపు వెళ్లవద్దని, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ఇళ్ల  నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు
అధికారులు యుద్ధప్రాతిపదికన వరద సహాయక చర్యలు చేపట్టారు. కలెక్టర్‌ అంకిత్, ఎస్పీ రోహిత్‌ రాజు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. భద్రాచలం కరకట్టతో పాటు స్లూయిస్‌ల వద్ద నీటి లీకేజీలు లేకుండా చేపట్టిన ముందస్తు చర్యలను పరిశీలించారు. అత్యవసర సమాచారం కోసం భద్రాచలం ఐటీడీఏ  కార్యాలయంలో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. సమాచారం, సహాయం  కోసం 79952 68352 నంబర్‌లో సంప్రదించాలని ఐటీడీఏ పీఓ రాహుల్‌  సూచించారు.

గంటల వ్యవధిలోనే మూడో ప్రమాద హెచ్చరిక
గోదావరి నీటిమట్టం శుక్రవారం ఉదయం నుంచి గంటగంటకూ పెరిగింది. ఉదయం 9 గంటలకు 41.70 అడుగులుగా ఉన్న నీటిమట్టం, 10 గంటలకు 42.80 అడుగులకు చేరింది.  ఉదయం 10.14 గంటలకు 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ తర్వాత ఐదు గంటల వ్యవధిలోనే వరద నీరు 48 అడుగులకు చేరింది. దీంతో మధ్యాహ్నం 3.48 గంటలకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 12 గంటలకు వరద 55 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement