ఇరాన్, హెజ్‌బొల్లా, టర్కీ నాయకుల సరసన ఏర్పాటు
టెల్ అవీవ్: అక్లోబర్‌లో ఎన్నికలు జరగనున్న ఇజ్రాయెల్‌లో ఒక ప్రచార హోర్డింగ్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. టెల్ అవీవ్ నగరం మధ్యలో అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు పార్టీ ఏర్పాటు చేసిన బిల్‌బోర్డ్‌పై న్యూయా ర్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీని చిత్రించారు. పోస్టర్‌లో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, ఇరాన్ నాయకుడు మొ జ్తాబా ఖమేనీ, హెజ్‌బొల్లా అధిపతి నయీమ్ ఖాసెమ్‌ల పక్కన ఆయన ఫోటోను చిత్రించారు.
‘వారు నెతన్యాహు ఓడిపోవాలని కోరుకుంటున్నారు. వారిని గెలవనివ్వకండి’అని లికుడ్ పార్టీ లోగోతో రాశారు. గాజా కాల్పుల విరమణ ప్రయత్నాలు నిలిచిపోయిన తరుణంలో, ఈ చర్య వారి మధ్య బహిరంగ వైరాన్ని మరింత తీవ్రం చేసింది. జులైలో ఇజ్రాయెల్ నెసెట్‌ను రద్దు చేయడంతో, అక్టోబర్‌లో ఎన్నికలకు మార్గం సుగమమైంది. 2023 అక్టోబర్ 7న హమాస్ నేతృత్వంలో దాడుల తర్వాత జరుగుతున్న మొట్టమొదటి జాతీయ ఎన్నికలు ఇవే.
తన అతివాద కూటమిని తిరిగి అధికారంలో తీసుకొచ్చేందుకు నెతన్యాహు ప్రచారలోకి దిగారు. అమెరికాలో ఇటీవల జరిగిన పోల్స్‌లో, అమెరికన్ యూదుల్లో నెతన్యాహు కంటే మమ్దానీకే ఎక్కువ ప్రజాదరణ ఉందని తేలింది. అభిప్రాయ సేకరణలో తన అధికార కూటమి వెనుకబడి ఉండటాన్ని గ్రహించిన నెతన్యాహు, తన సోషల్ మీడియా ఖాతాల్లో ఆ బిల్‌బోర్డ్ ఫోటోను పోస్ట్ చేశారు.
మమ్దానీ తనను ఒక యుద్ధ నేరస్థుడని పిలుస్తూ చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా పంచుకున్నారు. అయితే, నెతన్యాహు ఎన్నికల ప్రచార సామగ్రిలో తన చిత్రాన్ని చేర్చడంపై మమ్దానీ ఇంకా బహిరంగంగా స్పందించలేదు. మమ్దానీ తన మేయర్ ఎన్నికల ప్రచారం నుంచే గాజాలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని గట్టిగా విమర్శిస్తూ వచ్చారు. గత నెలలో నెతన్యాహును యుద్ధ నేరగాడు అనడంతో మాటల యుద్ధం తీవ్రమైంది. సెపె్టంబరులో నగరంలో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి నెతన్యాహు హాజరైతే, ఆయన అరెస్టు కోసం అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు జారీ చేసిన వారెంట్‌ను అమలు చేయాలని అమెరికా అధికారులకు పిలుపునివ్వడం తెలిసిందే.


