దేవతలు కట్టిన కోవెల! | Devotional Story About The Sacred Nandalur Soumyanatha Temple, A 1,000 Year Old Marvel Of Faith And Architecture | Sakshi
Sakshi News home page

దేవతలు కట్టిన కోవెల!

Jul 23 2026 8:21 AM | Updated on Jul 23 2026 10:52 AM

Devotional Story About The Sacred Nandalur Soumyanatha Temple

భక్తి

విష్ణుమూర్తి... సౌమ్యనాథస్వామిగా అవతరించి, చిరుమందహాసంతో, అభయహస్తంతో దర్శనమిస్తూ ..కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా పూజలు అందుకుంటున్న క్షేత్రం నందలూరు సౌమ్యనాథాలయం. విశాలమైన ప్రాంగణంలో... నాలుగు రాజగోపురాల మధ్య ఉన్న ఈ ఆలయం పది ఎకరాల విస్తీర్ణంలో, పూర్తిగా ఎర్రరాతిని ఉపయోగించి నిర్మించడం విశేషం.

ఈ ఆలయంలోని 108 స్తంభాలపైనా భాగవతం చిత్రించి ఉండటం మరో విశేషం. 11 శతాబ్దం నుంచీ ఉన్న ఈ ఆలయాన్ని దేవతలే కట్టించారని పురాణాలు చెపుతున్నాయి. స్వయంగా నారదమహర్షి సౌమ్యనాథస్వామి మూలవిరాట్టును ప్రతిష్టించారని ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది.

స్వామి పాదాలపై సూర్యకిరణాలు...
గర్భగుడికీ ఆలయ ప్రధాన ద్వారానికీ మధ్య 120 గజాల దూరం ఉన్నా.. ద్వారం నుంచి మూలవిరాట్టు రూపం చాల స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో స్వామి పాదాలపైన సూర్యకిరణాలు పడటమూ ఇక్కడ చూడొచ్చు.

స్వామిపై అన్నమయ్య కీర్తనలు...
తాళ్లపాకకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయాన్ని ఒకప్పుడు అన్నమాచార్యులు రోజు దర్శించుకునేవాడనీ, స్వామిపైన పదహారు కీర్తనలు కూడా రాశాడనీ అంటారు. ఇక్కడ స్వామికి ప్రతిరోజు నిర్వహించే పూజలు ఒకెత్తయితే, ఆషాఢమాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలు ముక్కోటి ఏకాదశి నాడు చేసే లక్షతులసీ అర్చన మరొకెత్తు. ఇవే కాకుండా శ్రావణ, ధనుర్మాసాల్లో నిర్వహించే ఉత్సవాలు చూసేందుకు చుట్టుపక్కల ఊళ్లకు చెందిన భక్తులకు ఎక్కువగా చూస్తారు.

వైభవంగా మొదలైన బ్రహ్మోత్సవాలు...
ఈనెల 21, మంగళవారం అంకుర్పారణతో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యాయి. బుధవారం ధ్వజారోహణం జరిగింది. 26న గరుడసేవ, 28న కళ్యాణోత్సవం, 29న రథోత్సవం, 30న చక్రస్నానం, 31న పుష్పయాగం నిర్వహించనున్నారు. స్వామివారు రోజుకొక వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ఐదవరోజున గరుడోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలను స్వయంగా టీటీడీ దేవస్థానం వారే నిర్వహించడం సంప్రదాయం.
– రామమోహన్‌ మోడపోతుల, సాక్షి, రాజంపేట, వైఎస్సార్‌ కడప జిల్లా

నిర్వహణ: డి.వి.ఆర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement