breaking news
Dvr
-
స్వయం గురువుగా తయారు కావాలి..
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు స్సాక్షాత్ పరబ్రహ్మతస్మై శ్రీగురవే నమః...గురు మంత్రంలో చివరి మంత్రం చెప్పేటప్పుడు‘గురుః సాక్షాత్ పరబ్రహ్మ’ అని అంటారు. అంటే పరబ్రహ్మయే. మీరు ఆత్మసాక్షాత్కారం పొందిన తరువాత ఆ శక్తియే మీ ద్వారా ప్రవహిస్తుంది. కనుక అప్పుడు మీరు పరబ్రహ్మ సాధనంగా మారతారు. మీలో స్వయం గురుతత్వ స్థితిని పెంపొందించుకుంటారు.ఆదిగురువు అవతరమూర్తులందరూ పంచభూతాలపై ఆధిపత్యం కలిగివుంటారు. వారి ద్వారానే బ్రహ్మ వ్యక్తీకరింపడ్డాడు. ఈ ఆదిగురువు ముగ్గురి ద్వారా అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ద్వారా వ్యక్తీకరింపబడ్డాడు. ఆయన నాలుగు తలలుగల బ్రహ్మలా జన్మించాడు. మనకు పైకి కనబడే ఈ ముగ్గురు కాకుండా నాల్గవ తల శ్రీ గణేశునిది. ఈ విధంగా దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, గణేశ రూపంతో, శక్తులతో ఆది గురువయ్యాడు. గురువు కు వుండాల్సిన ఉత్తమ గుణాలు చాలా వున్నాయి. ఆ గుణాలన్నీ గురువులో వ్యక్తమవ్వాలి. ఈ గుణాలకు యజమాని శివుడు. శివ తత్వం అంటే గురుతత్వమే. అలా ఈ గుణాలన్నీ మీ ద్వారా ప్రస్పుటమవ్వాలి, ప్రకాశించాలి.అప్పుడు మీరు విరాటశక్తిలో ఒకరైపోతారు. ఇతరులకు ధర్మాన్ని బోధించగలుగుతారు. ఆత్మగా మారుతారు. ఆ విధంగా నిజమైన గురువుగా మారుతారు.ఒక గురువుగా మీరు మీ నిత్య జీవితంలో అనేక విషయాలకు అతీతంగా వుండగలగాలి. అదే మీరు చేరుకోవలసిన ఉన్నత స్థితి.‘‘యధా రాజా తధా ప్రజా’’ అన్నట్లుగా మీరు స్వయం గురువుగా తయారయిన్నప్పుడే ఇతరులకు గురువుగా మారి ఓ ప్రతీకగా, ఆదర్శ్ర΄ాయంగా నిలబడి నడిపించగలరు.. ఇక్కడ మన అర్థం చేసుకోవలసిన విషయమేమంటే – సమాజంలో మనం చూస్తున్న గురువులను, తమను తాము గురువులుగా చెప్పుకునే గురువులు మనకు ఆత్మసాక్షాత్కారం ఇవ్వగలుగుతున్నారా అన్నది. తమలో గురు తత్వం లేని గురువు కూడా ఇతరులకు గురువు కావాలనుకుంటారు. తాను స్వయంగురువుగా వ్యక్తీకరింపబడిన వ్యక్తి ఇతరులకు గురువు కావాలని ఎన్నడూ అనుకోడు.మిమ్మల్ని మీరు గమనించుకోండి. ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి ప్రయత్నించండి. ఆత్మగా రూపొందండి. ఎప్పుడు మీరు ఆత్మగా రూపొందుతారో అప్పుడు మీకు మీరు గురువు కాగలగుతారు. అదే స్వయం గురుతత్వం.గురువు ప్రప్రధమంగా మనల్ని భగవంతుడినితో అనుసంధాన పరచడానికి ప్రయత్నిస్తాడు. అంటే దానర్థం ఆయన మీ కుండలినీ శక్తిని జాగృత పరిచి, సర్వవ్యాపిత శక్తితో మిమ్మల్ని అనుసంధానం చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉండాలి.గురువుకి మించిన తత్వం లేదుగురువును మించిన తపస్సు లేదుగురువుని మించిన జ్ఞానం లేదుఅటువంటి గురుదేవునికి నమస్కరిస్తున్నాను అని గురుగీత స్తోత్రంలోని ఒక శ్లోకంలో గురువుకి వున్న ఉన్నత స్థాయి గురించి చెప్పారు.– డాక్టర్ ప్రతాని రాకేశ్, సహజ యోగసాధకులు, (పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా)శ్రీ మాతాజీ నిర్మలాదేవినిర్వహణ: డి.వి.ఆర్. -
దేవతలు కట్టిన కోవెల!
విష్ణుమూర్తి... సౌమ్యనాథస్వామిగా అవతరించి, చిరుమందహాసంతో, అభయహస్తంతో దర్శనమిస్తూ ..కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా పూజలు అందుకుంటున్న క్షేత్రం నందలూరు సౌమ్యనాథాలయం. విశాలమైన ప్రాంగణంలో... నాలుగు రాజగోపురాల మధ్య ఉన్న ఈ ఆలయం పది ఎకరాల విస్తీర్ణంలో, పూర్తిగా ఎర్రరాతిని ఉపయోగించి నిర్మించడం విశేషం.ఈ ఆలయంలోని 108 స్తంభాలపైనా భాగవతం చిత్రించి ఉండటం మరో విశేషం. 11 శతాబ్దం నుంచీ ఉన్న ఈ ఆలయాన్ని దేవతలే కట్టించారని పురాణాలు చెపుతున్నాయి. స్వయంగా నారదమహర్షి సౌమ్యనాథస్వామి మూలవిరాట్టును ప్రతిష్టించారని ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది.స్వామి పాదాలపై సూర్యకిరణాలు...గర్భగుడికీ ఆలయ ప్రధాన ద్వారానికీ మధ్య 120 గజాల దూరం ఉన్నా.. ద్వారం నుంచి మూలవిరాట్టు రూపం చాల స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో స్వామి పాదాలపైన సూర్యకిరణాలు పడటమూ ఇక్కడ చూడొచ్చు.స్వామిపై అన్నమయ్య కీర్తనలు...తాళ్లపాకకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయాన్ని ఒకప్పుడు అన్నమాచార్యులు రోజు దర్శించుకునేవాడనీ, స్వామిపైన పదహారు కీర్తనలు కూడా రాశాడనీ అంటారు. ఇక్కడ స్వామికి ప్రతిరోజు నిర్వహించే పూజలు ఒకెత్తయితే, ఆషాఢమాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలు ముక్కోటి ఏకాదశి నాడు చేసే లక్షతులసీ అర్చన మరొకెత్తు. ఇవే కాకుండా శ్రావణ, ధనుర్మాసాల్లో నిర్వహించే ఉత్సవాలు చూసేందుకు చుట్టుపక్కల ఊళ్లకు చెందిన భక్తులకు ఎక్కువగా చూస్తారు.వైభవంగా మొదలైన బ్రహ్మోత్సవాలు...ఈనెల 21, మంగళవారం అంకుర్పారణతో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యాయి. బుధవారం ధ్వజారోహణం జరిగింది. 26న గరుడసేవ, 28న కళ్యాణోత్సవం, 29న రథోత్సవం, 30న చక్రస్నానం, 31న పుష్పయాగం నిర్వహించనున్నారు. స్వామివారు రోజుకొక వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ఐదవరోజున గరుడోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలను స్వయంగా టీటీడీ దేవస్థానం వారే నిర్వహించడం సంప్రదాయం.– రామమోహన్ మోడపోతుల, సాక్షి, రాజంపేట, వైఎస్సార్ కడప జిల్లానిర్వహణ: డి.వి.ఆర్. -
యద్భావం తద్భవతి: మనసులో మంచి భావనలు ఉంటే అంతా..
‘మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః’ ప్రాపంచిక బంధాలలో చిక్కుకోవడానికిగానీ, వాటినుండి విడుదల పొందడానికి కానీ; మన సు ఖానికిగానీ, దుఃఖానికి కానీ; అభ్యున్నతికిగానీ, పతనానికి కానీ – ఇలా దేనికైనా మన మనసు, అందులో ఎగిసిపడే ఆలోచనలే కారణాలని చెబుతూ శ్రీ రామకృష్ణ పరమహంస ఒకరోజు తమ శిష్యులకు మనిషి మనసులోని కోరికలు, ఆశలు అతనిని ఎలా పతనం చేస్తాయో వివరించడానికి ఈ కథను చెప్పారు.ఒక వర్తకుడు వ్యా΄ార నిమిత్తం తన గ్రామం నుండి పట్టణానికి నడిచి వెడుతున్నాడు. ఆ కాలంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పటిలాగా రవాణా సౌకర్యాలు ఉండేవి కాదు కాబట్టి తెల్లవారు జాము నుంచి మధ్యాహ్నం దాకా నడిచేసరికి బాగా అలసిపోయాడు. మరొక నాలుగైదు గంటలు నడిస్తే కానీ గమ్యం చేరలేడు. కనుక ఎక్కడైనా తగిన చోటు దొరికితే కాసేపు ఆగి బడలిక తీర్చుకొందామనుకొన్నాడు. అతని అదృష్టం కొద్దీ ఒక పెద్ద చెట్టు, దాని చుట్టూ అరుగు కనిపించాయి. పరమానందంగా ఆ చెట్టు నీడన ఆ అరుగుపై కాళ్ళు చాచి పడుకొన్నాడు.చల్లగా వీస్తున్న గాలి అతని మార్గాయాసాన్ని కాస్త ఉపశమింపజేసింది. అప్పుడతనికి తన దాహం తెలిసింది. ‘తాగడానికి నీరు లభిస్తే ఎంత బాగుంటుందో’ అనుకొన్నాడు. వెంటనే అతని పక్కన ఒక ΄ాత్రలో చల్లని నీరు ప్రత్యక్షమైంది. ఆశ్చర్యపోతూ అమృత తుల్యంగా ఉన్న ఆ నీటిని తాగి దాహం తీర్చుకొన్నాడు. దాహం తీరగానే అతని మనసు భోజనం పైకి మళ్ళింది. ‘బాగా ఆకలి వేస్తోంది. తినడానికి మంచి భోజనం లభిస్తే బాగుండు’ అని అనుకుంటూండగానే అతని ఎదుట పంచభక్ష్య పరమాన్నాలు వడ్డించబడిన విందు భోజనం అరిటాకులో సిద్ధంగా కన్పించింది.ఎంతో సంబరంగా కడుపునిండా భోంచేశాడు. కాసేపు కునుకు తీస్తేగానీ భుక్తాయాసం తీరి నడక ముందుకు సాగదు. ఈ అరుగు పైన మెత్తటి పరుపు, తలగడ అమరితే బాగుండు అని మనసులో అనుకొన్నాడో లేదో తక్షణం అతని ఎదుట హంసతూలికా తల్పం ప్రత్యక్షమైంది. దానిపై పడుకొని ‘ఇప్పుడెవరైనా నా కాళ్ళు పడితే బ్రహ్మాండంగా నిద్ర పోవచ్చు’ అని అనుకొన్న మరుక్షణం ఇద్దరు అపురూపమైన అందగత్తెలు అతని కాళ్ళు పట్టడం మొదలు పెట్టారు. తాను ఏ చెట్టు నీడన కూర్చున్నాడో అది కల్పవృక్షమనీ, అతడు మనసులో ఏది కోరుకొన్నా దానిని వెంటనే ప్రసాదిస్తుందనీ అతనికి తెలియదు.ఇప్పుడు అతనికి ఒక అనుమానం మొదలైంది. ‘ఈ అడవిలో నేను గనుక గాఢంగా నిద్రపోతే, ఒంటరిగా, నిరాయుధుడుగా ఉన్న నన్ను ఏ పెద్దపులో వచ్చి చూసిందంటే నా గతి ఏమౌతుందో’ అనుకొంటూండగానే ఎక్కణ్ణుంచో గాండ్రుమంటూ ఒక పెద్దపులి వచ్చి, అతనిపై భీకరంగా దాడిచేసి చంపేసింది. అంతటితో ఆతని కోరికలన్నీ అంతమైపోయాయి. ‘యద్భావం తద్భవతి’ అన్నట్లు మన మనసులో మంచి భావనలు ఉంటే మనకు మంచే జరుగుతుంది. లేకపోతే మన గతి అథోగతే అన్నది శ్రీ రామకృష్ణులు ఈ కథ ద్వారా మనకు అందించిన సందేశం.– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రినిర్వహణ : డి.వి.ఆర్ -
అమృతోత్సవ సోమ నాథుడు
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రథమస్థానం సోమనాథ క్షేత్రానిదే... ఇది గుజరాత్‌లోని సౌరాష్ట్రలో అరేబియా సముద్ర తీరాన ఉంది. చంద్రునికి శాపవిముక్తి జరిగిన క్షేత్రం కాబట్టే సోమనాథ క్షేత్రంగా పేరొందింది. పరమేశ్వరుడు జ్యోతిర్లింగ ఆకారంలో యుగాల నుంచి దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నాడు. సిరిసంపదలతో వున్న ఈ క్షేత్రంపై అనేకమంది విదేశీపాలకులు లెక్కలేనన్ని సార్లు దండయాత్రలు చేశారు. అయితే ఎన్ని దండయాత్రలకు గురైనా మళ్లీ అన్నిసార్లూ పునర్ నిర్మితమైన క్షేత్రమిది. చంద్రుని పేరుమీదుగా సోమనాథుడుస్వామి సోమనాథునిగా వెలసిన కథ స్కాంద పురాణంలో ఉంది. బ్రహ్మ మానసపుత్రుడైన దక్షప్రజాపతి అశ్విని నుంచి రేవతి వరకు గల 27 మంది కుమార్తెలను చంద్రునికి ఇచ్చి వివాహం జరిపించాడు. అయితే చంద్రుడు రోహిణి ఒక్కదానినీ అనురాగంతో చూస్తూ, మిగిలిన వారిని అలక్ష్యం చేయసాగాడు. దాంతో... తక్కిన 26 మంది తమ తండ్రితో ఈ విషయాన్ని మొరపెట్టుకోగా, దక్షుడు అల్లుడైన చంద్రుడిని మందలిస్తాడు. అయినప్పటికీ, చంద్రుని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో, క్షయరోగగ్రస్తుడవు కమ్మని చంద్రుని శపిస్తాడు దక్షుడు. ఫలితంగా చంద్రుడు క్షీణించసాగాడు. చంద్రకాంతి లేకపోవడంతో ఔషధాలు, పుష్పాలు ఫలించలేదు. ఈ పరిస్థితిని చూసిన సమస్త లోకవాసులు, తమ కష్టాలు తీరే మార్గం చూపమని బ్రహ్మని ప్రార్థించగా ఆయన చంద్రునితో ప్రభాసక్షేత్రంలో మహామృత్యుంజయ మంత్రానుష్ఠానంగా శంకరుని ఆరాధించవలసిందిగా చెబుతాడు. బ్రహ్మ దేవుని సలహాను అనుసరించి, భక్తి శ్రద్ధలతో శివుని పూజించిన చంద్రుడికి శంకరుడు ప్రత్యక్షమై, చంద్రుని రోగ విముక్తుని గావించి, కృష్ణపక్షంలో చంద్రకళలు రోజు రోజుకీ తగ్గుతాయనీ, శుక్లపక్షంలో దినమొక కళ చొప్పున పెరుగుతుందనీ అనుగ్రహించాడు. ఆనాటి నుండి చంద్రుని కోరిక మేరకు సోమనాథునిగా, కుష్టు వంటి మహా రోగాలను తగ్గించే సోమనాథ జ్యోతిర్లింగరూపునిగా పార్వతీ సమేతంగా వెలసి భక్తులను కటాక్షిస్తున్నాడు పరమేశ్వరుడు.అలనాడు స్వర్ణాలయం..ఈ క్షేత్రంలో తనకు శాపవిముక్తి కలిగినందుకు పరమానందభరితుడైన చంద్రుడు సువర్ణంతో పరమేశ్వరునికి ఆలయం నిర్మించాడట. అనంతర కాలంలో శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని రావణాసురుడు వెండితో పునర్ నిర్మించగా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చందనపు చెక్కలతో నూతన ఆలయాన్ని నిర్మించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత రాజా భీమ్దేవ్ ఈ ఆలయాన్ని రాతితో పునర్నిర్మించాడు. పునఃప్రతిష్ఠకు డెబ్భై ఐదు ఏళ్లు పూర్తిసోమనాథక్షేత్రంలో భారీ సంపద వుండటంతో అనేకసార్లు దండయాత్రలకు గురైంది. క్రీ.శ. 1024లో గజనీ మహమ్మద్ దండయాత్రలో ఆలయం తీవ్ర నష్టానికి గురైంది. అనంతరం స్థానిక పాలకులు తిరిగి నిర్మించారు. దిల్లీ పాలకుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ, మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాలనలోనూ ఆలయంపై దాడులు జరిగాయి. జునాగఢ్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన తరువాత ఉక్కుమనిషి, భారతదేశ ప్రథమ హోంమంత్రి వల్లభాయ్‌పటేల్ ఆలయాన్ని సందర్శించి పునర్ నిర్మాణానికి ఆదేశాలిచ్చారు. 1951లో నూతన ఆలయ నిర్మాణం పూర్తయింది. నాటి భారత రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ ఆలయాన్ని ప్రారంభించారు. ఇది జరిగి డెబ్భై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా సోమనాథేశ్వరునికి అమృత మహోత్సవాలను జరిపించాలని సంకల్పించడమే కాదు... అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు.సోమనాథునికి ప్రధాని ప్రత్యేక పూజలు1951లో బాబు రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా పునఃప్రతిష్ఠ జరిగిన నాటి నుండి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలలో పాల్గొననున్నారు. అంతేకాదు, సోమనాథునికి స్వయంగా అభిషేకం, ధ్వజ పూజ, మహాపూజలు నిర్వహించనున్నారు. నిత్యం పూజలు, హారతులు, సౌండ్ అండ్ లైట్ షోలతో ఆలయం సందడిగా ఉంది. ఆలయ దర్శనం ఉదయం 6:00 నుండి రాత్రి 10:00 వరకు ఉంటుంది, మధ్యాహ్నం 1:00 నుండి 5:00 వరకు దర్శనం ఉండదు. – డి.వి.ఆర్. -
ముక్కోటి ఏకాదశి: ఉత్తర ద్వారాన వైకుంఠనాథుడు
ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రలోకి వెళ్లిన శ్రీమహా విష్ణువు, కార్తీకశుద్ధ ఏకాదశి రోజున యోగనిద్ర నుంచి మేల్కొని, శ్రీదేవి – భూదేవి సమేతంగా ఈ ఏకాదశి రోజున వైకుంఠానికి తిరిగి వచ్చాడట. అప్పుడు ముక్కోటి దేవతలు ఉత్తరద్వారం చెంత నిలిచి స్వామి దర్శనం చేసుకున్నారని, ఈ కారణంగానే దీనిని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తుంటారని పెద్దలు చెబుతారు. ఈ రోజున స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకోవడం వలన మోక్షం లభిస్తుందని విశ్వాసం. అందుకే తిరుమలతో సహా అన్ని వైష్ణవ క్షేత్రాలలోనూ భక్తుల సందర్శనకు వీలుగా ఈరోజున తెల్లవారు జాము నుంచే ఉత్తర ద్వారాలు తెరచి ఉంచుతారు. ఏకాదశి అంటే తిథులలో పదకొండవది. ఇది సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువుతో ముడిపడిన తిథి. అందుకే ఏకాదశిని హరితిథి అని, వైకుంఠదినమనీ అంటారు. ఇటువంటి ఏకాదశులు మాసానికి రెండు చొప్పున సంవత్సరానికి ఇరవై నాలుగు వస్తాయి. అధికమాసం వచ్చిన సంవత్సరంలో ఇరవై ఆరు వస్తాయి. (చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకూ ఒక అధికమాసం వస్తుంది). వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగానూ, ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగానూ మనం పండుగలాగ జరుపుకుంటాం. ఉత్తరాయన ప్రారంభదినం కావడం మూలాన ఇది అత్యంత విశిష్ఠమైనది. ముక్కోటి అంటే ముప్పది మూడు కోట్ల దేవతలని ఉద్దేశించింది. అప్పటినుంచి మూసి ఉన్న స్వర్గ ద్వారాలు ఈధనుర్మాసారంభం నుంచి తెరుచుకుంటాయని పురాణ వచనం. ఈ ఏకాదశినాడు విష్ణుమూర్తి గరుడ వాహనారూఢుడై ఉత్తరద్వారాన దర్శనమిస్తాడట. ఆ దివ్యసుందర రూపుని దర్శించుకోవడం కోసం దేవతలందరూ ఈ రోజున దివినుంచి భువికి దిగి వస్తారట. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు. మన ఆరునెలలు దేవతలకు పగలు, మరో ఆరునెలలు రాత్రి. దీని ప్రకారం దేవతలందరూ వైకుంఠ ఏకాదశినాడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలానికి అంటే చీకటి రాత్రినుంచి వెలుగులు చిమ్మే పగటిలోకి వచ్చారన్నమాట. స్వర్గద్వారాలను తెరవగానే ముందుగా ఈ కాంతి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశిస్తుంది. అందుకే విష్ణ్వాలయాలలో ఇవాళ ఉత్తరం వైపున ఉన్న ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ద్వారం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవడం అత్యంత పుణ్యప్రదం.ఉత్తర ద్వారమే వైకుంఠ ద్వారం. ఈ వైకుంఠద్వారమే సూర్యుని ఉత్తరాయణ ప్రవేశానికి సూచన. అందుకే ఉత్తర ద్వారం నుంచి విష్ణుదేవుని దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని పురాణ వచనం. శ్రీరంగం, తిరుపతి, అన్నవరం, భద్రాద్రి, మంగళగిరి, యాదగిరి గుట్ట, స్వర్ణగిరి వంటి అన్ని క్షేత్రాలలో ఈ ముక్కోటి ఏకాదశిని మహోత్సవంగా జరుపుకుంటారు. ముక్కోటి ఏకాదశిని అత్యంత మహిమాన్వితమైన రోజుగా పురాణాలు వర్ణిస్తున్నాయి. అందుకే ఈనాడు ఉపవాసం, విష్ణుపూజ విశేష ఫలాలనిస్తాయి. వైకుంఠ ఏకాదశినాడు గోపూజ చేయడం చాలమంచిది. విష్ణుమూర్తి సన్నిధిలో ఆవునేతితో దీపం వెలిగిస్తే సర్వపాపాలు హరించి అజ్ఞానమనే చీకట్లు తొలగి ముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. – డి.వి.ఆర్, (మంగళవారం ముక్కోటి) -
వెయ్యి డిగ్రీల వేడిలోనూ బ్లాక్ బాక్స్ భద్రం
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తులో బ్లాక్ బాక్స్, డిజిటల్ వీడియో రికార్డర్(డీవీడీ) అత్యంత కీలకం కాబోతున్నాయి. ఈ రెండింటిని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానం పేలిపోయినప్పుడు అందులోని ఇంధనం కారణంగా ఏకంగా 1,000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వెలువడింది. విమానం మొత్తం మంటల్లో చిక్కుకుంది. మృతదేహాలు మసిబొగ్గులా మారాయంటే ప్రమాద తీవ్రతను అంచనా వేయొచ్చు. భారీ ఉష్ణోగ్రతలోనూ బ్లాక్ బాక్స్ సురక్షితంగా ఉంటుందని, అందులోని డేటా చెరిగిపోదని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ బాక్స్‌లో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్(ఎఫ్డీఆర్), మరొకటి కాక్‌పిట్ వాయిస్ రికార్డర్(సీవీఆర్). ఎఫ్‌డీఆర్‌లో సాంకేతికపరమైన అంశాలు నిక్షిప్తమవుతాయి. అంటే విమానం ఎగురుతున్న ఎత్తు, వేగం, ఇంజన్ పనితీరును ఇది రికార్డు చేస్తుంది. కాక్‌పిట్‌లోని శబ్ధాలు, సంభాషణలు సీవీఆర్‌లో నమోదవుతాయి. టైటానియం లేదా స్టెయిన్లెస్ స్టీల్‌తో బ్లాక్‌బాక్స్ తయారు చేస్తారు. ఇది 1,100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతోపాటు అత్యధిక ఒత్తిడిని సైతం తట్టుకోగలదు. అంతేకాకుండా ఇది వాటర్‌ప్రూఫ్. నీటిలో 6 వేల మీటర్ల లోతున కూడా 30 రోజులపాటు భద్రంగా ఉంటుంది. నీటిలో దీని జాడ సులభంగా కనిపెట్టవచ్చు. అందులోని నుంచి సంకేతాలు వెలువడుతుంటాయి. డీవీఆర్ అనేది బ్లాక్‌బాక్స్ కంటే భిన్నమైనది. విమానంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఇందులో ఉంటుంది. విమానం కాక్‌పిట్, కేబిన్‌లో ఈ కెమెరాలు ఏర్పాటు చేశారు. బ్లాక్ బాక్స్, డీవీఆర్ డేటాను ప్రత్యేక ల్యాబ్‌ల్లో ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషించబోతున్నారు. ఇందుకోసం ఢిల్లీలో ఇటీవలే డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ ల్యాబ్ ప్రారంభించారు. దెబ్బతిన్న రికార్డర్లను మరమ్మతు చేసి, డేటాను వెలికితీసే సదుపాయం ఇక్కడ ఉంది. -
నేడు శివరాత్రి.. జనమనోహరుడు
శివరాత్రివేళ ఒక్కసారిగా పుణ్యనదులు, పుణ్యక్షేత్రాలు జనవాహినితో సందడిగా ఉంటాయి. ఒక సమైక్యతకీ, సమన్వయానికీ సంకేతమిది. భాషలు, ఆచార వ్యవహారాలు, కట్టూ బొట్టూ ఇలాంటి తేడాలు ఎన్ని ఉన్నా భారతీయులందరూ ఒకే శివభావంతో ఒక్కటిగా మసలే సుదినమిది. దేవదానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు ముందుగా పుట్టిన హాలాహలాన్ని ఉండలా చేసుకుని కంఠంలో ఉంచి కాపాడిన వాడు శివుడు. ఆ తరువాతపాలకడలిని మధించగా వచ్చిన అద్భుతమైన వస్తువులన్నింటినీ దేవదానవులే పంచుకున్నారు. అవేవీ శివుడు స్వీకరించలేదు. ఆశించలేదు. ఈ లీలద్వారా జగత్పాలకుడైన శివుడు,పాలకులు ఎలా ఉండాలో బోధించాడు.ఒకపాలకుడిగా ప్రజల ధనాలనీ, ప్రయోజనాలనీ తాను అనుభవించకుండా, సుఖాలను మాత్రం అందకి పంచి, కటువైన విషాన్ని తాను దిగమింగిన అమృతమూర్తి రుద్రుడు. భూమికోసం... తన పితరుల మోక్షం కోసం భగీరథుని ప్రార్థన మేరకు గంగను తన జటాజూటాల నుంచి దించిన వేల్పు శివుడు. లోకక్షేమంకోసం ఎంతటి భారాన్నైనా స్వీకరించి నిర్వహించే సమర్థత, సౌజన్యం శివుని సహజ స్వభావం. లోకకంటకులైన త్రిపురాసురాది దుష్టుల్ని నిగ్రహించి, తన పరాక్రమాన్ని, ప్రసన్నతనీ ప్రదర్శించిన పరమాత్ముడు. ‘శివం’ అంటే ‘మేలు, మంచి’. లోకాలకి మేలు చేసే స్వభావం కలవాడు కనుకనే శివుడు. ప్రాణికోటికి శుభాన్ని కోరేవాడు, శ్రేయస్సును కలిగించే వాడు శివుడు.రుద్రుడు – దుఃఖాన్నిపోగొట్టేవాడు;శంకరుడు – సుఖాన్నీ, శాంతినీ కలిగించేవాడు;శంభుడు – శాంతికిమూలమైన వాడు;సదాశివుడు – ఎల్లవేళలా శుభస్వరూపుడు.⇒ ఇలా శివుని నామాలన్నీ ఆయనలోని ‘మేలు’ గుణాల్ని చెబుతున్నాయి. ఈ స్వభావాలను మనలో పెంచుకునేలా చేసేదే శివభావన, శివారాధన.⇒ ‘శివుని పూజించడం – అంటే తపస్సునీ, జ్ఞానాన్నీ, త్యాగాన్నీ ఆరాధించడమే. భారతీయుల ఆదర్శాలివి. అందుకే నిరంతరం త΄ోరూపంలో ఉన్న శివుని ఆరాధిస్తున్నారు’’ అని స్వామి వివేకానందుల వాగ్భావన. ఈ సుదినాన శివ తత్త్వాన్ని అర్థం చేసుకుందాం.. చేతనైన మేరకు శివరాత్రిని జరుపుకుందాం. మన చిత్తాలను శుద్ధి చేసుకొని, పవిత్ర భావనతో అంతర్ముఖులమై మనలోని పరమాత్మని ధ్యానించడమే ముఖ్య శివారాధన. అంతర్ముఖత్వానికి సంకేతమే రాత్రి. సత్యాన్ని మరువకుండా జాగరూకతతో మెలగడమే జాగరణ. ఇంద్రియ చపలత్వాన్ని నిగ్రహించడమే ఉపవాసం. సద్భావనలతో పరమాత్మను ఆరాధించడమే అభిషేకం.– డి.వి.ఆర్. -
సాక్ష్యాలు నాశనం చేసేందుకు యత్నించిన వాజే
ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన స్కార్పియోని నిలిపి కలకలం సృష్టించిన ఘటనలో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. తొలత ఈ కేసును ముంబై ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజే దర్యాప్తు చేశాడు. రోజులు గడుస్తున్న కొద్ది.. ఈ కేసుతో వాజేకు ఉన్న సంబంధాలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అతడిని సస్పెండ్ చేసింది. ఆ తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఈ కేసుకు సంబంధించి వాజే మీద కేసు బుక్ చేసింది. అలానే మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా వాజేను దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి మరో ఆసక్తికర వార్త ప్రచారం అవుతోంది. వాజే ఈ కేసు దర్యాప్తులో సమయంలో సేకరించిన సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించాడనే వార్తలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వాజే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలో సేకరించిన ఆధారాలను రికార్డులో పేర్కొనలేదని తెలిసింది. అలానే సచిన్ వాజే తన సొంత రెసిడెన్షియల్ సొసైటీకి చెందిన సీసీటీవీ ఫుటేజ్, డీవీఆర్ మెషన్ డాటాతో పాటు తాను సేకరించిన ఇతర సమాచారాన్ని నాశనం చేసేందుకు యత్నించినట్లు సమాచారం. ప్రసుత్తం అధికారులు డిలీట్ అయిన డాటాను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మొదటి స్కార్పియో వాహనం యజమానిగా భావించిన మన్సుఖ్ హిరెన్‌ను ప్రశ్నించిన పోలీసులు ఆ వాహనం దొంగలించబడిందని గుర్తించారు. ఆ తర్వాత హిరెన్ హత్యకు గురికావడంతో కేసు మరో మలుపు తీసుకుంది. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏకి బదిలీ చేసింది ప్రభుత్వం. ఇక హిరెన్ భార్య ఆ స్కార్పియో వాహనాన్ని ముంబై పోలీసు అధికారి సచిన్ వాజే నాలుగు నెలల పాటు వాడుకున్నాడని చెప్పడంతో కేసులో కొత్త కోణాలు వెలుగు చూశాయి. స్కార్పియో వాహనాన్ని ఉపయోగించిన సచిన్ వాజేనే ఆ తర్వాత.. ఈ కేసులో మొదటి దర్యాప్తు అధికారిగా వ్యవహంచడంతో అతనిని బదిలీ చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత సస్పెన్షన్ వేటు వేసింది. ప్రస్తుతం అతడిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు ఎన్ఐఏ అధికారులు. చదవండి: అంబానీ ఇంటి వద్ద కలకలం : మరో కీలక పరిణామం అంబానీ ఇంటి వద్ద కలకలం : సచిన్‌పై బదిలీ వేటు -
‘స్మార్ట్’తో చెక్..!
సాక్షి, సిటీబ్యూరో: ఈ ఏడాది మార్చ్‌లో... పేట్లబురుజులో ఉన్న బంగారు నగల కార్ఖానాలో మూడు కేజీలకు పైగా పసిడి దొంగతనానికి పాల్పడిన అంతరాష్ట్ర ముఠా డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్) ఎత్తుకుపోయింది. జూలైలో అబ్దుల్లాపూర్‌మెట్‌లోని నవదుర్గ వైన్స్‌లో షెట్టర్ పగులకొట్టిన చోరులు రూ.8,600 నగదు, కొన్ని మద్యం బాటిళ్లతో పాటు డీవీఆర్ కూడా పట్టుకుపోయారు. తాజాగా ఈ నెల 11న అబిడ్స్ ఠాణా పరిధిలోని ఫతేసుల్తాన్‌లేన్‌కు చెందిన సునీల్ అగర్వాల్ ఇంట్లో రూ.కోటి విలువైన సొత్తు, నగదు ఎత్తుకుపోయిన నేపాల్ గ్యాంగ్ సైతం తమ వెంట డీవీఆర్ తీసుకువెళ్లింది. సైబర్ క్రిమినల్స్ మాత్రమే కాదు... సొత్తు సంబంధ నేరాలు చేసే నేరగాళ్లు సైతం నానాటికీ తెలివి మీరుతున్నారు. నేరాని సంబంధించి ఎలాంటి ఆధారాలు మిగలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా వెలుగులోకి వస్తున్న కొత్త ట్రెండ్ డీవీఆర్లు ఎత్తుకెళ్లడం. ఇటీవల కాలంలో అనేక ఉదంతాల్లో ఈ ధోరణి కనిపించిందని పోలీసులు చెబుతున్నారు. అంతరాష్ట్ర ముఠాల నుంచి చిల్లర నేరగాళ్ల వరకు ప్రతి ఒక్కరూ దీన్ని అనుసరిస్తున్నారు. ప్రజలు కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ కేటుగాళ్లకు చెక్ చెప్పవచ్చని సూచిస్తున్నారు. సమయానుకూలంగా ‘స్మార్ట్’గా... ఏదైనా నేరం జరిగినప్పుడు దర్యాప్తులో భాగంగా చిన్న క్లూ అయినా సంపాదించాలని పోలీసులు ఎలా ఆలోచిస్తారో... ఏ చిన్న ఆధారం వదలకూడదని నేరగాళ్లూ ఎత్తులు వేస్తుంటారు. ఇందులో భాగంగానే ఒకప్పుడు తమ వేలి, కాలి ముద్రలు దొరక్కుండా జాగ్రత్తపడేవారు. అప్పట్లో పోలీసుల దర్యాప్తునకు ఇవే కీలకం కావడంతో చేతికి గ్లౌజులు, కాళ్లకు ప్లాస్టిక్ కవర్లు కట్టుకుని ‘రంగం’లోకి దిగేవారు. ఆ తర్వాతి రోజుల్లో పోలీసు జాగిలాలకు తమ జాడ చిక్కకుండా ఘటనాస్థలాల్లో కారం చల్లడం వంటి ఉదంతాలు వెలుగు చూశాయి. కొన్నేళ్ల క్రితం సికింద్రాబాద్‌లోని ఆర్ఏకే లాడ్జిలో జరిగిన ఎన్ఆర్ఐ కుటుంబం హత్య కేసు సహా మరెన్నో నేరస్థలాల్లో ఈ ధోరణి కనిపించింది. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు తీరు మారింది. అనేక కేసుల్లో సీసీ కెమెరాలే కీలక ఆధారాలు ఇస్తున్నాయి. దీంతో దొంగలు తొలినాళ్లల్లో సీసీ కెమెరాలకు చిక్కకుండా ముఖానికి మాస్క్‌లు, ముసుగులు వేసుకునే వారు. ఆపై వాటిని ధ్వంసం చేయడం చేశారు. ఈ ‘కాలక్రమంలో’ భాగంగా ఇటీవల కాలంలో కనిపిస్తున్న ట్రెండ్ డీవీఆర్‌ల చోరీ. అది ఎత్తుకుపోతే అంతే... ప్రస్తుతం దుకాణదారులతో పాటు ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే పబ్లిక్ ప్లేసుల్లో పూర్తి స్థాయిలో ఇవి అందుబాటులోకి రాలేదు. ప్రజలు, వ్యాపారులు ఏర్పాటు చేసుకునే సీసీ కెమెరాలకు సంబంధించి డీవీఆర్ అత్యంత కీలకమైంది. సీసీ కెమెరాలు రికార్డు చేసే ఫీడ్ మొత్తం అందులోనే నిక్షిప్తమవుతుంది. నేరగాళ్లు దీన్ని కూడా పట్టుకుపోతే దర్యాప్తునకు అవసరమైన ఆధారాలు చెరిగిపోయినట్లే. చోరీ జరిగిన ప్రాంతానికి చుట్టుపక్కల, సమీపంలో ఇతర సీసీ కెమెరాలు లేకపోతే దాదాపు ఆధారాలు కనుమరుగైనట్లే. అబ్దుల్లాపూర్‌మెట్ వైన్ షాపులో చోరీ విషయంలో ఇదే జరిగింది. ఇలాంటి సందర్భాల్లో దర్యాప్తు కష్టసాధ్యంగా మారుతోంది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న పోలీసుల విభాగం కొన్ని కీలక సూచనలు చేస్తోంది. ఫోన్లో సేవ్ చేసుకుంటే... ఇటీవల కాలంలో అందుబాటులోకి వస్తున్న సీసీ కెమెరాల్లో అత్యధికం ఐపీ బేస్ట్ పరిజ్ఞానంతో పని చేస్తున్నాయి. యజమానులు తాము ఎక్కడ ఉన్నప్పటికీ తమ ఇంట్లో, దుకాణంలో ఏ జరుగుతోందో చూడటానికి అనువుగా ఇంటర్నెట్ ఆధారంగా పని చేసే వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. అనునిత్యం వీరి సెల్‌ఫోన్‌తో కనెక్ట్ అయి ఉండే ఈ కెమెరాల ఫీడ్‌ను యజమానులు ఎక్కడున్నా చూడగలుగుతున్నారు. దీనిని సద్వినియోగం చేసుకుంటూ, సెల్‌ఫోన్స్ లేదా మెమొరీ కార్డ్స్ సామర్థ్యం పెంచుకుంటూ మరికొన్ని చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. ఫోన్లో కనిపించే ఫీడ్ కనీసం 48 గంటల పాటు సేవ్ అయ్యేలా సెట్టింగ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అలా చేయడం ద్వారా చోరీ చేసిన తర్వాత తమ వెంట డీవీఆర్‌ను ఎత్తుకుపోయినా సెల్ఫోన్లో రికార్డు అయి ఉండే ఫీడ్ ఆధారంగా దర్యాప్తు ముందుకు వెళ్తుంది. ‘పక్కన’ పెడితే ఎంతో మేలు... సెల్ఫోన్లో సేవింగ్ విధానం ఇళ్లల్లో ఉన్న సీసీ కెమెరాలకు సరిపోతుంది. కెమెరాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఫీడ్ భద్రపరచడానికి మెమొరీ కార్డ్ సామర్థ్యం చాలకపోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ‘పక్కన ఏర్పాట్లు’ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఒక దుకాణంలో ఉన్న సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్ పక్కన ఉన్న మరో దుకాణంలో ఉండేలా చూసుకోవాలని కోరుతున్నారు. ఇలా చేయడం ద్వారా ఒకవేళ చోరీ జరిగి దొంగలు ఆ దుకాణంలోని డీవీఆర్ ఎత్తుకుపోయినా ఇబ్బంది ఉండదన్నారు. పక్కపక్క ఇళ్లల్లో చోరీలు తరచూ వెలుగు చూస్తున్నా... దుకాణాల్లో ఈ తరహాలో జరగడం అత్యంత అరుదని, దీంతో ఈ విధానం వల్ల ఫలితాలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. ఈ కోణంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. -
పక్కనే వుంటే పోయేదేముంది?
ఒక అడవిలో కోతుల గుంపు ఒకటి ఉండేది. ఒకరోజు అవన్నీ కలిసి ఏకాదశీ వ్రతం చేసుకోవాలనుకున్నాయి. ఆ ప్రకారం ఆ తర్వాత వచ్చే ఏకాదశినాడు కోతులన్నీ ఒక చెట్టుకింద సమావేశమై ఉపవాసాన్ని ప్రారంభించాయి. కాసేపటికి ఒక కోతి అంది– ఇలా ఎంతసేపని కింద కూర్చుంటాం? చెట్లకొమ్మల మీద ఉండటమే మనకు అలవాటు కాబట్టి చెట్లెక్కి కొమ్మల మొదట్లోనే కూర్చుందాం’’ అంది. ఆ మాటలు మిగతా కోతులకు నచ్చాయి. వెంటనే అమలు పరిచాయి. అలా కొంతసేపు గడిచింది. అప్పుడు మరోకోతి ఇలా సూచించింది– మనం కొమ్మలమీద కూర్చుంటే చెట్లెక్కగలిగిన ఏ చిరుతపులో వస్తే మన పరిస్థితి ఏమిటి? అందువల్ల ఇంకొంచెం పైకెళ్తే మంచిది. దానివల్ల నేలమీదకు చూస్తూ, శత్రువులు రాకుండా జాగ్రత్త పడడానికి వీలవుతుంది– అంది. ఈ ఆలోచన కూడా నచ్చడంతో వెంటనే అమలు పరిచాయి. మరికొంతసేపు గడిచింది. ఇంకొక కోతి అంది– నేలచూపులు ఎంతసేపు చూస్తాం... పండ్లవైపు చూస్తే మాత్రం ఉపవాస వ్రతానికి నష్టం ఏంటి– అని. వెంటనే ఆ సలహా కూడా అమలులోకి వచ్చేసింది. మరోకోతికి మరో ఆలోచన వచ్చింది. ఉపవాసం కారణంగా మనకు ఆకలి ఎక్కువగా ఉండి, మంచి పండ్లను ఏరుకునే సమయం ఉండకపోవచ్చు. అందువల్ల రేపటికి తినడానికి వీలుగా ఏం పండ్లు ఉంటాయో, ఇప్పుడే పరీక్షించి పెట్టుకుంటే బాగుంటుంది కదా– అని. ఇంకేం... కోతులన్నీ మంచి మంచి పండ్లను ఏరుకోవడం మొదలెట్టాయి. ‘రేపు మనకు ఎంత నీరసంగా ఉంటుందో ఏమో, కొన్ని పండ్లు పైకి బాగున్నా, లోపల పురుగులుండవచ్చు. కాబట్టి ఇప్పుడే వాటిని కొద్ది కొద్దిగా రుచి చూసి పక్కన పెట్టుకుంటే మన ఉపవాస వ్రతానికి నష్టం ఏమైనా వాటిల్లుతుందా ఏమిటి? మనుషులు కూడా అలాగే పొద్దున ఉపవాసం ఉంటూనే, రాత్రి పలహారానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటూనే ఉంటారు’’ అంటూ అనుభవజ్ఞురాలైన ఓ వృద్ధ వానర ం తనలో తాను గొణుక్కుంటున్నట్లుగా అంది. అన్నింటికంటే ఈ సలహా కోతులన్నిటికీ బాగా నచ్చింది. కోతులన్నీ ఆవురావురుమని పండ్లన్నీ ఆరగించేయడం మొదలెట్టేశాయి. చివరికి వాటి ఉపవాస వ్రతం అలా ముగిసింది. మనం ఏదైనా ఒక పని ప్రారంభిద్దాం అనుకోగానే ఇలాగే నలుగురూ వచ్చి నాలుగు సలహాలు చెబుతారు. దాంతో మనం అనుకున్న పని కాస్తా అటక ఎక్కుతుంది. ఒకవేళ వాళ్లు చెప్పిన సలహాలు మంచివే అనుకోండి, వాటిని పాటించేందుకు తగిన సమయం సందర్భం, వాటిని పాటించే క్రమంలో నిగ్రహం, నిక్కచ్చితనం అవసరం. – డి.వి.ఆర్. -
ఒకటి కాదని మరొకటి
ఒకతను బావి తవ్వుదామనుకున్నాడు. మరొకతన్ని సలహా అడిగితే ఒకచోట తవ్వమని చెప్పాడు. పదిహేను అడుగుల లోతు తవ్వాక దానిలో నీళ్లు పడకపోయేసరికి అతడు నిరాశ చెందాడు. ఇంతలో అక్కడికి వేరొకతను వచ్చి, ఇతని తెలివితక్కువతనాన్ని హేళన చేసి తనకు తోచిన మరొకచోట తవ్వమని సలహా ఇచ్చాడు. ఇతను అక్కడకు వెళ్లి మళ్లీ తవ్వడం మొదలు పెట్టాడు. ఈసారి ఇరవై అడుగుల లోతు తవ్వాడు. కానీ నీరు పడలేదు. ఇంకొకతను వచ్చి మరొకచోట తవ్వమని చెప్పాడు. అక్కడ ముప్పై అడుగుల లోతు తవ్వాడు. కానీ నీరు పడలేదు. దాంతో నిరాశా నిస్పృహలతో ఆ పని వదిలేసి వస్తుండగా, నాల్గవ అతను వచ్చి నవ్వుతూ ఇలా అన్నాడు. ‘‘నువ్వు ఇప్పటిదాకా చాలా కష్టపడ్డావు. కానీ తప్పుదారి పట్టడం వల్ల నీకు నీళ్లు పడలేదు. నేను చెప్పిన చోట తవ్వితే తప్పకుండా నీళ్లు పడతాయి. అయితే, పలుగుతో కాదు, పారతో వెడల్పుగా తవ్వు’’ అని సలహా ఇచ్చాడు. అతను అలాగే చేశాడు. అలా 45 అడుగులలోతు తవ్వాడు. కానీ లాభం లేకపోయింది. దాంతో గట్టిగా నిట్టూర్పు విడిచి, పలుగు, పారా విసిరి అవతల పారేసి, ఇంటి దారి పట్టాడు. రామకృష్ణ పరమహంస తన శిష్యులకు ఈ కథ చెబుతూ, అతను అలా నాలుగైదు చోట్ల తవ్వడం వల్ల అనుకున్న ఫలితాన్ని పొందలేకపోయాడు. అదే ఒకేచోట లోతుగా తవ్వి వుంటే తప్పకుండా నీళ్లు పడి ఉండేవి. కొందరు ఇదేవిధంగా ఒకటి కాదని మరొకటి మారుస్తూ అనేక అంశాలను పట్టుకుని వదిలేస్తుంటారు. దాని మూలంగా దేనిలోనూ పట్టు సాధించలేకపోతారు. అలా కాకుండా ఒకేదానిని నిశితంగా అధ్యయనం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చునని చెప్పేవారు. – డి.వి.ఆర్ -
దేవుడు గంట కొట్టాడు
అదొక పల్లెటూరు. ఆ ఊళ్లో ఒక అమాయకుడున్నాడు. అతను ఎప్పుడూ సత్యమే చెబుతాడని, అబద్ధం చెçప్పడని ఊళ్లో వాళ్లకి గట్టి నమ్మకం. అదే వూరిలో పురాతన కాలం నాటి ఒక దేవాలయం ఉంది. కొన్ని తరాల కిందట ఆ గుడిలో దొంగలు పడి దేవుడి విగ్రహాన్ని ఎత్తుకు పోవడంతో ఆ దేవాలయం పూజాపురస్కారాలూ లేక, దాని ఆలనాపాలనా చూసేవారు లేక శిథిలావస్థకు చేరింది. ఆ దేవాలయం మొండి గోడల మీద రావి, తుమ్మ వంటి చెట్లు మొలిచి, లోనికి ప్రవేశించడానికి వీలు కానంతగా పాడిబడిపోయింది. దాంతో ఎవరూ ఆ గుడిలోకి ప్రవేశించడానికి సాహసించేవారు కాదు.ఒకరోజు రాత్రి ఆ గుడిలోనుంచి గంటల శబ్దం, శంఖనాదాలు వినిపించసాగాయి. అదేపనిగా గంటలు మోగుతుండడంతో ఊరిలో వాళ్లు ఉండబట్టలేక లాంతర్లు తీసుకుని గుడి వైపుగా అడుగులు వేశారు. పచ్చ కర్పూరపు పరిమళాలు వెలువడుతుండడంతో అడ్డు వచ్చిన కంపను కొట్టివేస్తూ, ధైర్యంగా లోనికి వెళ్లారందరూ. అ గుడి పరిస్థితి ఎప్పటిలాగే ఉంది. వాళ్లు ఇంకొంచెం ముందుకు పోయి, లోపల ఏం జరుగుతోందో అని చూశారు. అక్కడ ఆ అమాయకుడు గోడకు ఆనుకుని బిగ్గరగా శంఖం ఊదటం, గంట గొట్టడం, హారతి ఇవ్వడం కనిపించింది. ఎలాగూ ఇక్కడి దాకా వచ్చాము కదా అని జనాలందరూ కలసి నేల పరిశుభ్రం చేయడం మొదలు పెట్టారు. గుడిలో వింత ఏం జరుగుతోందో చూద్దామని వస్తున్న వారందరూ ఎవరికి అడ్డం వచ్చిన చెత్తను, కంపను వారు తొలగించుకుంటూ వస్తున్నారు. కొందరు బూజుకర్రలు తీసుకు వచ్చారు. ఇంకొందరు అదే వూపులో అక్కడ పాడుబడిన దిగుడు బావినుంచి, నీళ్లు తోడి తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలో నిండి పోయి ఉన్న చెత్తను తొలగించి, శుభ్రం చేయసాగారు. ఇలా తెల్లవార్లూ జరిగింది. గుడి ఎలాగూ శుభ్రపడింది కాబట్టి, గుడిలో దేవతా విగ్రహం లేకపోవడం అరిష్టం అని చెప్పి పంతులు గారి దగ్గర ముహూర్తం పెట్టించుకుని, మంచిరోజు చూసి గుడిలో దేవుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఎడతెరపిలేకుండా వస్తున్న విరాళాలు, శ్రమదానాలతో పూజలు, పురస్కారాలతో గుడి పునర్వైభవం సంపాదించుకుంది. ఆలయం, ఆలయ ప్రాంగణమూ శుభ్రంగా లేకపోవడం వల్లే కదా, అందరూ ఆ గుడిని దూరం పెట్టింది. ఆలయం శుభ్రం కావడంతోనే, గుడిలోకి దేవుడొచ్చేశాడు. మనసులోని మాలిన్యాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకుంటే గుండె గుడిలోకి కూడా దైవం ప్రవేశిస్తాడు. అయితే అందుకు ఎవరో ఒకరు పూనుకోవాలి. – డి.వి.ఆర్. -
ఉన్నా... సున్నా!
సాక్షి, సిటీబ్యూరో: ఈ ఏడాది మార్చ్‌లో... పేట్లబురుజులోని బంగారు నగల తయారీ కార్ఖానాలో మూడు కేజీలకు పైగా పసిడి బందిపోటు దొంగతనానికి పాల్పడిన అంతరాష్ట్ర ముఠా డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్) ఎత్తుకుపోయింది. శనివారం రాత్రి... అబ్దుల్లాపూర్‌మెట్‌లోని నవదుర్గ వైన్స్‌లో షెట్టర్ పగులకొట్టి దొంగతనం చేశారు. ఇక్కడ నుంచి రూ.8,600 నగదు, కొన్ని మద్యం బాటిళ్లు చోరీ చేసిన దొంగలు తమ వెంట డీవీఆర్ కూడా పట్టుకుపోయారు. సైబర్ క్రిమినల్స్ మాత్రమే కాదు... సొత్తు సంబంధ నేరాలు చేసే నేరగాళ్లు సై తం నానాటికీ తెలివి మీరుతున్నారు. నేరానికి సం బంధించి ఎలాంటి ఆధారాలు మిగలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగమే డీవీఆర్లు మాయం చేయడం. ఇటీవల అనేక ఉదంతాల్లో ఈ ధోరణి కనిపించిందని పోలీసులు చెబున్నారు. ప్రజలు కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ కేటుగాళ్లకు చెక్ చెప్పవచ్చని సూచిస్తున్నారు. సమయానుకూలంగా ‘స్మార్ట్’గా... ఏదైనా నేరం జరిగినప్పుడు చిన్న ఆధారం వదలకూడదని నేరగాళ్లు ఎత్తులు వేస్తుంటారు. ఇందులో భాగంగా ఒకప్పుడు తమ వేలి, కాలి ముద్రలు దొరక్కుండా జాగ్రత్తపడేవారు. అప్పట్లో పోలీసుల దర్యాప్తునకు ఇవే కీలకం కావడంతో చేతికి గ్లౌజులు, కాళ్లకు ప్లాస్టిక్ కవర్లు కట్టుకుని ‘రంగం’లోకి దిగేవాళ్ళు. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు తీరు మారింది. అనేక కేసుల్లో సీసీ కెమెరాలే కీలక ఆధారాలు ఇస్తున్నాయి. దీంతో దొంగలు తొలినాళ్ళల్లో సీసీ కెమెరాలకు చిక్కకుండా ముఖానికి మాస్క్‌లు, ముసుగులు వేసుకునే వారు. ఆపై వాటిని ధ్వంసం చేయడం చేశారు. ఈ ‘కాలక్రమంలో’ భాగంగా ఇటీవల కాలంలో కనిపిస్తున్న ట్రెండ్ డీవీఆర్‌ల చోరీ. ఎత్తుకుపోతే అంతే... ప్రస్తుతం దుకాణదారులతో పాటు ఇంటి యజమానులూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే పబ్లిక్ ప్లేసుల్లో పూర్తి స్థాయిలో ఇవి అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వం చేపడుతున్న సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఇవి ఏర్పాటవుతున్నాయి. ప్రజలు, వ్యాపారులు ఏర్పాటు చేసుకునే సీసీ కెమెరాలకు సంబంధించి డీవీఆర్ అత్యంత కీలకమైంది. సీసీ కెమెరాలు రికార్డు చేసే ఫీడ్ మొత్తం అందులోనే నిక్షిప్తమవుతుంది. చోరీ చేసిన నేరగాళ్లు దీన్ని కూడా పట్టుకుపోతే దర్యాప్తునకు అవసరమైన ఆధారాలు చెరిగిపోయినట్లే. చోరీ జరిగిన ప్రాంతానికి చుట్టుపక్కల, సమీపంలో ఇతర సీసీ కెమెరాలు లేకపోతే దాదాపు ఆధారాలు కనుమరుగైనట్లే. అబ్దుల్లాపూర్‌మెట్ వైన్ షాపులో చోరీ విషయంలో ఇదే జరి గింది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న పో లీసుల విభాగం కొన్ని కీలక సూచనలు చేస్తోంది. ఫోన్లో భద్రం... సీసీ కెమెరాల్లో అత్యధికం ఐపీ బేస్ట్ పరిజ్ఞానంతోపని చేస్తున్నాయి. యజమానులు తాము ఎక్కడ ఉన్నప్పటికీ తమ ఇంట్లో, దుకాణంలో ఏ జరుగుతోందో చూడటానికి అనువుగా ఇంటర్నెట్ ఆధారంగా పని చేసే వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. అనునిత్యం వీరి సెల్‌ఫోన్‌తో కనెక్ట్ అయి ఉండే ఈ కెమెరాల ఫీడ్‌ను యజమానులు ఎక్కడున్నా చూడగలుగుతున్నారు. దీనిని సద్వినియోగం చేసుకుంటూ, సెల్‌ఫోన్స్ లేదా మెమొరీ కార్డ్స్ సామర్థ్యం పెంచుకుంటూ మరికొన్ని చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. ఫోన్లో కనిపించే ఫీడ్ కనీసం 48గంటలపాటుసేవ్ అయ్యేలా సెట్టింగ్ చేసుకో వాలనిసూచిస్తున్నారు. అలా చేయడంద్వారాచోరీ చేసిన తర్వాత తమ వెంట డీవీఆర్నుఎత్తుకుపోయినా సెల్ఫోన్లో రికార్డు అయిఉండే ఫీడ్ ఆధారంగా దర్యాప్తు ముందుకు వెళ్తుంది. పక్క దుకాణంలో ఏర్పాటు... సెల్ఫోన్లో సేవింగ్ విధానం ఇళ్లల్లో ఉన్న సీసీ కెమెరాలకు సరిపోతుంది. అదే దుకాణాల విషయానికి వస్తే అన్నింటి ఫీడ్‌ను ఇలా సేవ్ చేసుకోవడం సాధ్యం కాదు. కెమెరాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఫీడ్ భద్రపరచడానికి మెమొరీ కార్డ్ సామర్థ్యం చాలకపోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ‘పక్కన ఏర్పాట్లు’ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఒక దుకాణం లో ఉన్న సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్ పక్కన ఉన్న మరో దుకాణంలో ఉండేలా చూసు కోవాలని కోరుతున్నారు. ఇలా చేయడం ద్వారా ఒకవేళ చోరీ జరిగి దొంగలు ఆ దుకాణంలోని డీవీఆర్ ఎత్తుకుపోయినా ఇబ్బంది ఉండదని వివరిస్తున్నారు. పక్కపక్క ఇళ్ళల్లో చోరీలు తరచుగా వెలుగు చూస్తున్నా... దుకాణాల్లో ఈ తరహాలో జరగడం అత్యంత అరుదని, దీంతో ఈ విధానం వల్ల ఫలితాలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. ఈ కోణంలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. -
ఉగాదిన ఏం చేయాలంటే..?
దుర్ముఖి నామ సంవత్సరం నుంచి నేడు మనం హేవిళంబి నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. రైతులు, రాజకీయనాయకులు, ఉపాధ్యాయులు, కళాసాంస్కృతిక రంగాలవారు, సినీనటులు, ఉపాధ్యాయులు, వివిధ రకాల వృత్తులు, ఉద్యోగాలలో ఉండే వారంతా ఈ సంవత్సరం తమ రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయో పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుని దానికి అనుగుణంగా నడుచుకోవడం ఆచారం. అంతకన్నా ముందు అసలు ఉగాది రోజు ఏం చేయాలో చూద్దాం... ఉగాది సంప్రదాయం ఈ పర్వదినాన ఉదయమే ఇల్లు అలికి, ముగ్గుపెట్టి లేదా అటకలతో సహా అన్నిగదులలోనూ బూజు దులిపి ఊడ్చి, శుభ్రంగా కడుక్కుని, మామిడి లేదా వివిధ రకాల పుష్పాలతో తోరణాలు కట్టాలి. గడపలకు పసుపు, కుంకుమలు అలంకరించాలి. ఆరోగ్యానికి అభ్యంగనం ఉగాది వంటి పర్వదినాలలో నువ్వులనూనెలో లక్ష్మి, జలంలో గంగాదేవి ఉంటారని శాస్త్రోక్తి. కాబట్టి మామూలు రోజులలో ఎలా స్నానం చేసినా, ఉగాదినాడు పొద్దున్నే లేచి ఒళ్లంతా నువ్వుల నూనె, సున్నిపిండి పట్టించి, కుంకుడురసం లేదా సీకాయపొడితో తలారా స్నానం చేయాలి. అనంతరం నూతన వస్త్రాలు లేదా శుభ్రంగా ఉతికిన దుస్తులు ధరించి, నిత్యకర్మానుష్ఠానాలు ముగిసిన తర్వాత బంధుమిత్రులతో కలిసి భోజనం చేసి, పంచాంగ శ్రవణం చేయాలి. శుభ్రమైన దుస్తులు శుభం.. శుభం... ఉగాదినాడు వీలయితే నూతన వస్త్రాలు లేదా చిరుగులు పడని, శుభ్రంగా ఉతికిన దుస్తులు ధరించడం శ్రేయోదాయకం. తెల్లటి దుస్తులు ధరించడం శుభప్రదం పంచాంగం అంటే ... తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు భాగాలను కలిపి పంచాంగం అంటారు. తిథి వలన సంపద, నక్షత్రం వల్ల పాపపరిహారం, సరైన యోగంతో వ్యాధి నివృత్తి, కరణం ద్వారా కార్యానుకూలతను పొందవచ్చు. పంచాంగ శ్రవణ ఫలమేమిటి? ఉగాదినాటి పంచాంగ శ్రవణం గంగాస్నాన ఫలంతో సమానమట. అదొక్కటే కాదు, సంవత్సరానికి అధిపతులైన రాజాది నవనాయకుల గ్రహఫలితాలను శాస్త్రోక్తంగా వినడం వల్ల గ్రహదోషాలు నివారించబడి, వినేవారికి ఆరోగ్యాన్ని, యశస్సును, ఆయుష్షునూ వృద్ధి చేసి, సంపదతో కూడిన సకల శుభఫలాలనూ ఇస్తుందట. కాబట్టి ఉగాదినాడు పంచాంగ ఫలాలను తెలుసుకోవడం వల్ల భవిష్యత్ కార్యాచరణను చేపట్టడం సులభం. – డి.వి.ఆర్.


