అమృతోత్సవ సోమ నాథుడు | Somnath Temple completes 75 years since reopening | Sakshi
Sakshi News home page

అమృతోత్సవ సోమ నాథుడు

May 11 2026 5:34 AM | Updated on May 11 2026 5:34 AM

Somnath Temple completes 75 years since reopening

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రథమస్థానం సోమనాథ క్షేత్రానిదే... ఇది గుజరాత్‌లోని సౌరాష్ట్రలో అరేబియా సముద్ర తీరాన  ఉంది. చంద్రునికి శాపవిముక్తి జరిగిన క్షేత్రం కాబట్టే సోమనాథ క్షేత్రంగా పేరొందింది. పరమేశ్వరుడు జ్యోతిర్లింగ ఆకారంలో యుగాల నుంచి దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నాడు. సిరిసంపదలతో వున్న ఈ క్షేత్రంపై అనేకమంది విదేశీపాలకులు లెక్కలేనన్ని సార్లు దండయాత్రలు చేశారు. అయితే ఎన్ని దండయాత్రలకు గురైనా మళ్లీ అన్నిసార్లూ పునర్‌ నిర్మితమైన క్షేత్రమిది. 

చంద్రుని పేరుమీదుగా సోమనాథుడు
స్వామి సోమనాథునిగా వెలసిన కథ స్కాంద పురాణంలో ఉంది. బ్రహ్మ మానసపుత్రుడైన దక్షప్రజాపతి అశ్విని నుంచి రేవతి వరకు గల 27 మంది కుమార్తెలను చంద్రునికి ఇచ్చి వివాహం జరిపించాడు. అయితే చంద్రుడు రోహిణి ఒక్కదానినీ అనురాగంతో చూస్తూ, మిగిలిన వారిని అలక్ష్యం చేయసాగాడు. దాంతో... తక్కిన 26 మంది తమ తండ్రితో ఈ విషయాన్ని మొరపెట్టుకోగా, దక్షుడు అల్లుడైన చంద్రుడిని మందలిస్తాడు. అయినప్పటికీ, చంద్రుని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో, క్షయరోగగ్రస్తుడవు కమ్మని చంద్రుని శపిస్తాడు దక్షుడు. ఫలితంగా చంద్రుడు క్షీణించసాగాడు. చంద్రకాంతి లేకపోవడంతో ఔషధాలు, పుష్పాలు ఫలించలేదు.

 ఈ పరిస్థితిని చూసిన సమస్త లోకవాసులు, తమ కష్టాలు తీరే మార్గం చూపమని బ్రహ్మని  ప్రార్థించగా ఆయన చంద్రునితో ప్రభాసక్షేత్రంలో మహామృత్యుంజయ మంత్రానుష్ఠానంగా శంకరుని ఆరాధించవలసిందిగా చెబుతాడు. బ్రహ్మ దేవుని సలహాను అనుసరించి, భక్తి శ్రద్ధలతో శివుని పూజించిన చంద్రుడికి శంకరుడు ప్రత్యక్షమై, చంద్రుని రోగ విముక్తుని గావించి, కృష్ణపక్షంలో చంద్రకళలు రోజు రోజుకీ తగ్గుతాయనీ, శుక్లపక్షంలో దినమొక కళ చొప్పున పెరుగుతుందనీ అనుగ్రహించాడు. ఆనాటి నుండి చంద్రుని కోరిక మేరకు సోమనాథునిగా, కుష్టు వంటి మహా రోగాలను తగ్గించే సోమనాథ జ్యోతిర్లింగరూపునిగా పార్వతీ సమేతంగా వెలసి భక్తులను కటాక్షిస్తున్నాడు పరమేశ్వరుడు.

అలనాడు స్వర్ణాలయం..
ఈ క్షేత్రంలో తనకు శాపవిముక్తి కలిగినందుకు పరమానందభరితుడైన చంద్రుడు సువర్ణంతో పరమేశ్వరునికి ఆలయం నిర్మించాడట. అనంతర కాలంలో శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని రావణాసురుడు వెండితో పునర్‌ నిర్మించగా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చందనపు చెక్కలతో నూతన ఆలయాన్ని నిర్మించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత రాజా భీమ్‌దేవ్‌ ఈ ఆలయాన్ని రాతితో పునర్నిర్మించాడు. 

పునఃప్రతిష్ఠకు డెబ్భై ఐదు ఏళ్లు పూర్తి
సోమనాథక్షేత్రంలో భారీ సంపద వుండటంతో అనేకసార్లు దండయాత్రలకు గురైంది. క్రీ.శ. 1024లో గజనీ మహమ్మద్‌  దండయాత్రలో ఆలయం తీవ్ర నష్టానికి గురైంది. అనంతరం స్థానిక పాలకులు తిరిగి నిర్మించారు. దిల్లీ పాలకుడైన అల్లావుద్దీన్‌ ఖిల్జీ, మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబ్‌ పాలనలోనూ ఆలయంపై దాడులు జరిగాయి. జునాగఢ్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన తరువాత ఉక్కుమనిషి, భారతదేశ ప్రథమ హోంమంత్రి వల్లభాయ్‌పటేల్‌ ఆలయాన్ని సందర్శించి పునర్‌ నిర్మాణానికి ఆదేశాలిచ్చారు. 1951లో నూతన ఆలయ నిర్మాణం పూర్తయింది. నాటి భారత రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ ఆలయాన్ని  ప్రారంభించారు. ఇది జరిగి డెబ్భై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా సోమనాథేశ్వరునికి అమృత మహోత్సవాలను జరిపించాలని సంకల్పించడమే కాదు... అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు.

సోమనాథునికి ప్రధాని ప్రత్యేక పూజలు
1951లో బాబు రాజేంద్ర ప్రసాద్‌ చేతుల మీదుగా పునఃప్రతిష్ఠ జరిగిన నాటి నుండి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆలయంలో 
జరిగే ప్రత్యేక పూజలలో పాల్గొననున్నారు. అంతేకాదు, సోమనాథునికి స్వయంగా అభిషేకం, ధ్వజ పూజ, మహాపూజలు నిర్వహించనున్నారు. నిత్యం పూజలు, హారతులు, సౌండ్‌ అండ్‌ లైట్‌ షోలతో ఆలయం సందడిగా ఉంది. ఆలయ దర్శనం ఉదయం 6:00 నుండి రాత్రి 10:00 వరకు ఉంటుంది, మధ్యాహ్నం 1:00 నుండి 5:00 వరకు దర్శనం ఉండదు. 

– డి.వి.ఆర్‌.

Advertisement
 
Advertisement
Advertisement