వెయ్యి డిగ్రీల వేడిలోనూ బ్లాక్‌ బాక్స్‌ భద్రం | Air India plane black box recovered | Sakshi
Sakshi News home page

వెయ్యి డిగ్రీల వేడిలోనూ బ్లాక్‌ బాక్స్‌ భద్రం

Jun 14 2025 6:23 AM | Updated on Jun 14 2025 6:23 AM

Air India plane black box recovered

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై దర్యాప్తులో బ్లాక్‌ బాక్స్, డిజిటల్‌ వీడియో రికార్డర్‌(డీవీడీ) అత్యంత కీలకం కాబోతున్నాయి. ఈ రెండింటిని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానం పేలిపోయినప్పుడు అందులోని ఇంధనం కారణంగా ఏకంగా 1,000 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వెలువడింది. విమానం మొత్తం మంటల్లో చిక్కుకుంది. మృతదేహాలు మసిబొగ్గులా మారాయంటే ప్రమాద తీవ్రతను అంచనా వేయొచ్చు. భారీ ఉష్ణోగ్రతలోనూ బ్లాక్‌ బాక్స్‌ సురక్షితంగా ఉంటుందని, అందులోని డేటా చెరిగిపోదని నిపుణులు చెబుతున్నారు. 

బ్లాక్‌ బాక్స్‌లో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి. ఒకటి ఫ్లైట్‌ డేటా రికార్డర్‌(ఎఫ్‌డీఆర్‌), మరొకటి కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌(సీవీఆర్‌). ఎఫ్‌డీఆర్‌లో సాంకేతికపరమైన అంశాలు నిక్షిప్తమవుతాయి. అంటే విమానం ఎగురుతున్న ఎత్తు, వేగం, ఇంజన్‌ పనితీరును ఇది రికార్డు చేస్తుంది. కాక్‌పిట్‌లోని శబ్ధాలు, సంభాషణలు సీవీఆర్‌లో నమోదవుతాయి. టైటానియం లేదా స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో బ్లాక్‌బాక్స్‌ తయారు చేస్తారు. ఇది 1,100 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతతోపాటు అత్యధిక ఒత్తిడిని సైతం తట్టుకోగలదు. అంతేకాకుండా ఇది వాటర్‌ప్రూఫ్‌. నీటిలో 6 వేల మీటర్ల లోతున కూడా 30 రోజులపాటు భద్రంగా ఉంటుంది. 

నీటిలో దీని జాడ సులభంగా కనిపెట్టవచ్చు. అందులోని నుంచి సంకేతాలు వెలువడుతుంటాయి. డీవీఆర్‌ అనేది బ్లాక్‌బాక్స్‌ కంటే భిన్నమైనది. విమానంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఇందులో ఉంటుంది. విమానం కాక్‌పిట్, కేబిన్‌లో ఈ కెమెరాలు ఏర్పాటు చేశారు. బ్లాక్‌ బాక్స్, డీవీఆర్‌ డేటాను ప్రత్యేక ల్యాబ్‌ల్లో ఫోరెన్సిక్‌ నిపుణులు విశ్లేషించబోతున్నారు. ఇందుకోసం ఢిల్లీలో ఇటీవలే డిజిటల్‌ ఫ్లైట్‌ డేటా రికార్డర్, కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ ల్యాబ్‌ ప్రారంభించారు. దెబ్బతిన్న రికార్డర్లను మరమ్మతు చేసి, డేటాను వెలికితీసే సదుపాయం ఇక్కడ ఉంది.   
 

Advertisement
 
Advertisement
Advertisement