పిల్లల్లో నైతిక విలువలు పెంచాలంటే.. పేరెంట్స్‌ ఏం చేయాలి? | Parenting Tips Spirituality For Children | Sakshi
Sakshi News home page

పిల్లల్లో నైతిక విలువలు పెంచాలంటే.. పేరెంట్స్‌ ఏం చేయాలి?

Oct 24 2026 11:24 AM | Updated on Oct 24 2026 11:24 AM

Parenting Tips Spirituality For Children

పిల్లలకు చదువు ఎంత ప్రధానమో, ఆధ్యాత్మిక చింతన కూడా అంతే అవసరం. దీనివల్ల జీవితంలో సన్మార్గంలో నడవడంతో పాటు, సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి, ఒత్తిడిని అధిగమించి మానసిక ప్రశాంతత ఎలా పొందాలి లాంటి విషయాలు తెలుస్తాయి. అయితే, పిల్లలకు ఆధ్యాత్మిక చింతనను అలవరచే క్రమంలో పేరెంట్స్‌ కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి.

తెలుసుకుంటూ తెలియజెప్పడం
కుటుంబపరంగా, సమాజపరంగా వివిధ ఆచారాలు, సంప్రదాయాలు పాటించక తప్పదు! కానీ, ఈ రోజుల్లో చాలామంది వాటి అర్థం ఆంతర్యం తెలుసుకోకుండా ఒకరిని చూసి మరొకరు గుడ్డిగా పాటిస్తూ అసలు విషయాన్ని గాలికి వదిలేస్తున్నారు. కాబట్టి,  మనం పిల్లలకు ఏ విషయాలు నేర్పించాలనుకుంటున్నామో ముందుగా వాటి గురించి పూర్తిగా తెలుసుకుని ఆ తర్వాత వాళ్లకు తెలియజెప్పడం వల్లే ఆయా ఆచారాలు, సంప్రదాయాలు వల్ల కలిగే లాభాలు ఏంటో వారు తెలుసుకోగలుగుతారు. తద్వారా వారికి క్రమేపీ ఆధ్యాత్మికత దిశగా ఆసక్తి కలుగుతుంది.

పౌరాణిక కథలు
రామాయణం, మహాభారతం, భాగవతం వంటి పురాణాలలో ఉండే వివిధ అంశాల గురించి పిల్లలకు  కథల రూపంలో చెప్పడం వల్ల వారిలో ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. అలాగే, జీవితంలో వచ్చే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి. వివిధ సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలి వంటి ఎన్నో విషయాలు వారికి వ్యక్తిగత పాఠాలుగా ఉపయోగపడతాయి.

చేసి చూపించాలి...
ప్రతి మతంలోనూ ఎన్నో మంచి విషయాలు ఉంటాయి. అయితే, వాటిని పాటించే విషయంలో మాత్రం చాలా మంది పాటించరు. ఆయా మతాలలోని మంచి అలవాట్లను మనం పాటిస్తూ, పిల్లలూ వాటిని పాటించేలా చేయడం వల్ల వారిలో లౌకిక భావనలు పెంపొందుతాయి.

మెడిటేషన్‌
పిల్లలు క్రమం తప్పకుండా ధ్యానం చేసేలా ప్రోత్సహించడం  ద్వారా వారికి ఆధ్యాత్మిక భావన కలగడంతోపాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఫలితంగా వారు చదువులో రాణించడంతో పాటు, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకో గలుగుతారు.

చదువుకు ఆటంకం కలగకుండా... 
పిల్లలకు చదువుకునే వయసులోనే ఆధ్యాత్మిక చింతనను కూడా అలవరిస్తే చక్కటి పౌరులుగా ఎదుగుతారు. అయితే, ఆధ్యాత్మికతను అలవాటు చేసే క్రమంలో వారి చదువుకు భంగం కలగకుండా జాగ్రత్త పడటమూ ఎంతో అవసరం. ఆధ్యాత్మికత మంచిది కదా అని పరీక్షల సమయంలోనో లేదా స్కూలు ఎగ్గొట్టించో గుళ్లకు, తీర్థయాత్రలకు తిప్పడం వల్ల ప్రయోజనాలు చేకూరకపోగా పాఠాలు పోయి లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే ఎక్కువ సమయం పట్టే కార్యక్రమాలను సాధ్యమైనంత వరకు సెలవు రోజుల్లోనే సాధన చేయించడం ద్వారా వారి చదువుకి ఆటంకం కలగకుండా జాగ్రత్తపడచ్చు.
– డి.వి.ఆర్‌.

ఇదీ చదవండి: మనసు ప్రశాంతంగా ఉండాలంటే.. ఈ పని చేయండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement